RRR.. ప్రస్తుతం ఈ సినిమా గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఉన్నట్లుండి ఉరుములు లేని పిడుగు పడినట్లు ఉన్నఫలంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాడు దర్శకుడు రాజమౌళి. అక్టోబర్ 13, 2021న సినిమా విడుదల అవుతుందని తెలిపాడు. అయితే అక్కడి వరకు బాగానే ఉంది. పైగా ఓ రిలీజ్ పోస్టర్ కూడా విడుదల చేసాడు. ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు విడుదలైన పోస్టర్లోనే అసలు విషయం ఉంది. రాజమౌళి ఈ పోస్టర్ ఓ హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టాడంటూ సోషల్ మీడియాలో అప్పుడే చర్చ మొదలైపోయింది. అక్కడ విడుదలైన వెంటనే దీని ఒరిజినల్ ఇదే అంటూ కొందరు నెటిజన్లు ఆరా తీసారు.. ఈ రెండు పోస్టర్స్ పక్కపక్కనే పెట్టి పోలికలు కూడా చెప్తున్నారు. 2007లో వచ్చిన హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ఘోస్ట్ రైడర్ సినిమా పోస్టర్ ఆధారంగా ఇప్పుడు ట్రిపుల్ ఆర్ పోస్టర్ డిజైన్ చేసారని ప్రచారం జరుగుతుంది. చూడ్డానికి కూడా రెండు అలాగే ఉన్నాయి. దాంతో అక్కడ్నుంచి కాపీ కొట్టారా లేదంటే ఇన్స్పైర్ అయ్యారా అనే విషయం అర్థం కావడం లేదు అభిమానులకు. కానీ పోస్టర్ మాత్రం అదిరిపోయింది. రామ్ చరణ్ గుర్రంపై.. ఎన్టీఆర్ బైక్‌పై కనిపిస్తూ పిచ్చెక్కిస్తున్నారు. పోస్టర్ కాపీనా కాదా అనే విషయం పక్కనబెడితే ప్రస్తుతం ఈ ఫోటోను చూసి అటు మెగా.. ఇటు నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. దసరా కానుకంగా ఈ భారీ మల్టీస్టారర్‌ను విడుదల చేస్తున్నారు మేకర్స్. 300 కోట్లతో డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం పోస్టర్లో చరణ్ గుర్రం.. ఎన్టీఆర్ బైక్ నడుపుతుంటే ఘోస్ట్ రైడర్ పోస్టర్లోనూ ఇదే కనిపిస్తుంది.
అక్కడ కూడా గుర్రం, బైక్ కనిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా కాపీ కొట్టాడేమో అనకుండా అక్కడ్నుంచి స్పూర్తి పొంది ఉంటారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమాలో ఒలివియా మోరీస్, అలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rrr movie, Telugu Cinema, Tollywood