NET movie reivew: రాహుల్ రామకృష్ణ NET రివ్యూ.. మూడో కన్ను చూస్తుంది జాగ్రత్త..!

నెట్ సినిమా రివ్యూ (NET movie review)

NET movie reivew: ఈ రోజుల్లో ఇంటర్నెట్ కారణంగా లాభాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. మన జీవితం ఎవరికేం తెలియదులే.. మన మధ్యే ఉంటుందిలే అనుకుంటుంటాం. కానీ మనకు తెలియని మూడో కన్ను ఎప్పుడూ మనల్ని చూస్తూనే ఉంటుంది అని చెప్పడమే నెట్ కథ. రెండు యువ జంటల మధ్య జరిగే కథ ఇది. మరి నెట్ ఎలా ఉందో చూద్దాం..

  • Share this:
నటీనటులు: రాహుల్ రామకృష్ణ, అవికా గోర్, ప్రణీత పట్నాయక్, విశ్వ దేవ్, విష్ణు తదితరులు
సంగీతం: నరేష్ కుమరన్
డిఓపీ: అభిరాజ్
ఎడిటర్: రవితేజ గిరిజల
ప్రొడక్షన్ హౌజ్: తమడ మీడియా
నిర్మాతలు: రాహుల్ తమడ, సాయిదీప్ రెడ్డి బొర్ర
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: భార్గవ్ మాచర్ల
విడుదల: ZEE 5 (OTT)

ఈ రోజుల్లో ఇంటర్నెట్ కారణంగా లాభాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. మన జీవితం ఎవరికేం తెలియదులే.. మన మధ్యే ఉంటుందిలే అనుకుంటుంటాం. కానీ మనకు తెలియని మూడో కన్ను ఎప్పుడూ మనల్ని చూస్తూనే ఉంటుంది అని చెప్పడమే నెట్ కథ. రెండు యువ జంటల మధ్య జరిగే కథ ఇది. మరి నెట్ ఎలా ఉందో చూద్దాం..

కథ:
లక్ష్మణ్ (రాహుల్ రామకృష్ణ) నల్గొండ జిల్లాలో ఓ చిన్న ఊళ్లో మొబైల్ షాప్ ఓనర్. ఆయన భార్య సుచిత్ర (ప్రణీత పట్నాయక్) హౌజ్ వైఫ్. ఇద్దరూ నల్గొండలోనే ఉంటారు. అయితే భార్య ఊరు నుంచి వచ్చిందని.. స్టైల్‌గా ఉండదని ఆమెతో సన్నిహితంగా ఉండడు లక్ష్మణ్. అదే సమయంలో హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ప్రియ (అవికా గోర్), రంజిత్ (విశ్వ దేవ్) జంట ఉంటారు. ఇద్దరూ లిన్ ఇన్‌లో ఉంటారు. ఫోన్‌లోనే ఉంటూ ఎక్కువగా అశ్లీల చిత్రాలు చూస్తుంటాడు లక్ష్మణ్. ఆ సమయంలోనే ప్రియ వాళ్లు ఉండే అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన పర్సనల్ వీడియో లింక్ ఒకటి కనిపిస్తుంది. దానికోసం డబ్బులు ఖర్చు చేసి మరీ చూస్తాడు లక్ష్మణ్. దానికోసం అప్పులు కూడా చేస్తాడు. ఒకానొక సమయంలో ప్రియ ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. అదంతా లైవ్‌లోనే చూస్తున్న లక్ష్మణ్.. ఎలా ఆపాడు.. అసలు ఆపాడా లేదా.. ఆ వీడియో కారణంగా అతడి జీవితం ఏమైపోయింది అనేది మిగిలిన కథ..

కథనం:
ఈ రోజుల్లో సోషల్ మీడియాతో పాటు డిజిటల్ పరంగా కూడా మనమెంతో ముందుకు వెళ్లిపోయాం. మనకు తెలియని ఎన్నో కళ్లు మనకు తెలియకుండానే మనల్ని గమనిస్తూనే ఉన్నాయి. నాలుగు గోడల మధ్యలోనే మనం ఉన్నాం కదా అనుకుంటే.. నాలుగు గోడలు దాటిన ప్రపంచం మరోటి మనల్ని చూస్తుందనే మాటే భయంకరంగా ఉంటుంది. ఇలాంటి డిజిటల్ కథలు ఇదివరకు కూడా వచ్చాయి. ఇప్పుడు నెట్ సినిమా కథ కూడా దాని చుట్టూనే అల్లుకున్నాడు కుర్ర దర్శకుడు భార్గవ్ మాచర్ల. రెండు యువ జంటలు, వేర్వేరే జీవితాలు, వేర్వేలు సంఘటనల చుట్టూ ఈ కథ సాగుతుంది. ఎక్కడో నల్గొండలో అశ్లీల వీడియోలు చూసే అలవాటున్న లక్ష్మణ్ అనే మొబైల్ షాప్ ఓనర్‌కు అనుకోకుండా ప్రియ అనే అమ్మాయికి సంబంధించిన లింక్ పోర్న్ సైట్‌లో దర్శనమిస్తుంది. అక్కడ్నుంచి కథ అసలు మలుపు తిరుగుతుంది. పని పాట మానేసి.. ఇల్లు పెళ్లాం ధ్యాస లేకుండా.. ఉన్న డబ్బులు కూడా ఆ వీడియోల కోసమే ఖర్చు చేసి తన జీవితం పణంగా పెట్టేస్తుంటాడు లక్ష్మణ్. మరోవైపు సెక్యూర్డ్ లైఫ్ అనుభవిస్తున్నామనే భావనతో ఉన్న ప్రియకు అసలు నిజం తెలిసిన తర్వాత గుండె బద్ధలైపోతుంది.
ఇటు లక్ష్మణ్ జీవితం.. అటు ప్రియ జీవితాన్ని రెండూ బ్యాలెన్స్ చేస్తూ సీన్స్ రాసుకున్నాడు దర్శకుడు భార్గవ్. కేవలం గంటన్నర నిడివి మాత్రమే ఉన్న నెట్ సినిమాలో ఆలోచింపదగ్గ సన్నివేశాలతో పాటు అనుమానాలు పెంచే సీన్స్ కూడా చాలానే ఉన్నాయి. అసలు లక్ష్మణ్ ఎందుకు ఈ వీడియో వైపు అంత ఆకర్షితుడు అవుతాడు.. ఎందుకు ప్రియను కాపాడటానికి అంత ఆరాటపడతాడు.. ఏ సంబంధం లేని ఆమె కోసం భార్యను కూడా ఎందుకు కాదనుకుంటాడు అనే అనుమానాలు చాలానే ఉన్నాయి ఈ కథలో. ఓ చిన్న వీడియో లింక్ దొరికిన తర్వాత 24 గంటలు లైవ్ చూస్తూ ఉండిపోయి.. తన బతుకు గురించి కూడా పట్టించుకోనంత ఏముంది అందులో అనే కామన్ అనుమానాలు ప్రేక్షకులకు రావడం సహజం. అలాగే క్లైమాక్స్ కూడా అసంపూర్తిగానే వదిలేసాడు దర్శకుడు భార్గవ్. ప్రియ జీవితం సెట్ అయింది కానీ అదే సమయంలో లక్ష్మణ్ మాత్రం జీరోగా మిగిలిపోయాడు. ఇంట్లో భార్య ముందు నిస్సహాయుడిగానే ఉండిపోయాడు. ఈ కారెక్టర్‌కు కూడా సరైన ముగింపు ఇచ్చుంటే బాగుండేదేమో అనిపించింది. ఓవరాల్‌గా నెట్ కథ అందరి జీవితాల్లోనూ కనిపించేదే.. కాకపోతే కాస్త పచ్చిగా చూపించారు అంతే.

నటీనటులు:
రాహుల్ రామకృష్ణ నటన గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. కామెడీ మాత్రమే కాదు అన్ని పాత్రలు ఈయన చేయగలడని ఇప్పటికే చాలాసార్లు నిరూపించాడు. ఇప్పుడు నెట్‌తో మరోసారి ప్రూవ్ చేసాడు. ఇక అవికా గోర్ కూడా బాగా నటించింది. కారెక్టర్ బాగానే అర్థం చేసుకుని.. రిహార్సల్ లేకుండా అప్పటికప్పుడు నటించానని చెప్పింది అవికా. కేరాఫ్ కంచరపాలెం సినిమాలో చిన్న పాత్రతో అలరించిన ప్రణీత పట్నాయక్.. నెట్ సినిమాలో మాత్రం చాలా బాగా నటించింది. రాహుల్ తర్వాత అంత ఇంపాక్ట్ ఉన్న పాత్ర ఈమెదే. సాధారణ గృహిణిగా.. భర్త ప్రేమను నోచుకోలేని కొత్త పెళ్లి కూతురుగా చాలా బాగా ఎమోషన్స్ పండించింది ప్రణీత. అవికా ప్రియుడిగా విశ్వ దేవ్ ఉన్నంత వరకు బాగానే చేసాడు. టాక్సీవాలాలో విజయ్ దేవరకొండ పక్కన ఉండే కుర్రాడు విష్ణు.. నెట్‌లో పెద్ద పాత్రే చేసాడు. రాహుల్ బామ్మర్ది పాత్రలో సహజంగా నటించాడు.

టెక్నికల్ టీం:
నరేష్ కుమరన్ సంగీతం బాగుంది. ఇందులో పాటల కంటే కూడా నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. రవితేజ గిరిజల ఎడిటింగ్ పర్లేదు. గంటన్నర సినిమానే కావడంతో కత్తెరకు పెద్దగా పని చెప్పాల్సిన అవసరం పడలేదు. అభిరాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు భార్గవ్ మాచర్ల తను అనుకున్న కథను పచ్చిగానే చూపించాడు. బోల్డ్ కంటెంట్ కావడంతో మధ్యలో కొన్ని బెడ్రూమ్ సీన్స్‌తో పాటు లిప్ లాక్ సీన్స్ కూడా పెట్టాడు. అయితే కథలో చాలా అనుమానాలు అలాగే ఉండిపోయాయి. అసంపూర్తిగా కొన్ని కారెక్టర్స్ వదిలేసాడు. అవి పూర్తి చేసుంటే నెట్ సినిమా ఇంకా అర్థవంతంగా ఉండేది అనిపించింది.

చివరగా ఒక్కమాట:
NET.. మూడో కన్ను చూస్తుంది జాగ్రత్త..

రేటింగ్: 3/5
Published by:Praveen Kumar Vadla
First published: