తెలుగు ఇండస్ట్రీ మోస్ట్ కాంట్రవర్సియల్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్‌కు బెయిల్ దొరికింది. మరో నిర్మాత పివిపి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈయన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జూబ్లీహిల్స్ నుంచి కడప వరకు వెళ్లింది వ్యవహారం. అక్కడి కోర్టు బండ్లకు 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. అంటే నవంబర్ 4 వరకు ఈయన జైల్లోనే ఉండాల్సింది. కానీ ఓ మంత్రి రాయబారంతో ఈయనకు ఊహించని విధంగా బెయిల్ వచ్చింది. కచ్చితంగా జైలుకు వెళ్తాడనుకున్న ఈయనకు మినిస్టర్ తెరవెనక చేసిన పనులే బయటపడేసాయని తెలుస్తుంది.
ఆఘమేఘాల మీద బండ్ల గణేష్‌కు బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బండ్ల కడప నుంచి హైదరాబాద్ వస్తున్నాడు. అసలు ఈ కేస్ ఎక్కడ మొదలైందనేది ఒక్కసారి చూసుకుంటే.. దాదాపు 8 ఏళ్ల కింద అంటే 2011లో కడపలోని మహేష్ అనే వ్యక్తి నుంచి 13 కోట్ల అప్పు తీసుకున్నాడు బండ్ల గణేష్. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ఈయనపై 2013లో మహేష్ చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసాడు. అప్పుడే కడప పోలీసులు బండ్ల గణేష్‌పై కేసులు నమోదు చేశారు. చాలాసార్లు కోర్టుకు హాజరు కాకపోవడంతో కడప జిల్లా మేజిస్ట్రేట్ ఈ నిర్మాతపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చేసారు. ఇంతలోనే నిర్మాత పీవీపీ కూడా ఈ మధ్యే బండ్ల గణేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసాడు.
తన ఇంటికి కొందరు అనుచరులను తీసుకొచ్చి బెదిరించాడని ఫిర్యాదు చేసాడు ఈయన. అందుకే జూబ్లీహిల్స్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కడప తీసుకెళ్లి అక్కడ రిమాండ్‌కు తరలించండంటూ కోర్టు చెప్పిన వెంటనే ఓ కీలక నేత రంగంలోకి దిగి బండ్ల గణేష్‌కు బెయిల్ వచ్చేలా చేసాడని తెలుస్తుంది. ప్రస్తుతం జగన్ హయాంలో మంత్రిగా ఉన్న ఓ నేత బండ్ల గణేష్‌కు అత్యంత ఆప్తుడు. ఆయనకే బినామీ అంటూ చాలా రోజులు వార్తలు వచ్చాయి కూడా. ఇప్పుడు ఈయనే మళ్లీ మనోడ్ని బయటికి తీసుకొచ్చాడని ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా కూడా జైలుకు వెళ్లాల్సిన బండ్ల.. బండెక్కి హైదరాబాద్ వచ్చేస్తున్నాడన్నమాట.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandla Ganesh, PVP, Telugu Cinema, Tollywood