సినిమా షూటింగ్స్‌లో తనకు ఎదురైన ఇబ్బందులను Unfinished పుస్తకంలో వివరించారు బాలీవుడ్ నటి Priyanka Chopra . తన జ్ఞాపకాలన్నింటినీ పొందుపరిచిన ఈ పుస్తకం మంగళవారం విడుదలైంది. దీనికి ఆమె అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. బాలీవుడ్లో మగవాళ్ల ఆధిపత్యం, ఫేవరిజం గురించి కూడా ఆమె రాశారు. ఒక చిన్న పట్టణం నుంచి హాలీవుడ్ వరకు సాగిన తన ప్రయాణాన్ని, ఈ క్రమంలో తనకు ఎదురైన అనుభవాలను Unfinishedలో రాశారు. కెరీర్ ప్రారంభంలో తనను దర్శకులు చులకనగా చూశారన్నారు. ఒకసారి సినిమా సెట్స్‌లో ఒక దర్శకుడితో ఎదురైన వింత అనుభవం గురించి పుస్తకంలో వివరించారు. ఒక పాటను చిత్రీకరిస్తున్నప్పుడు లోదుస్తులు కనిపించేలా నటించాలని దర్శకుడు అగిడారని ఆమె తెలిపారు. ఒక ఐటెం సాంగ్‌లో భాగంగా దుస్తులు తీసివేసి నటించాల్సి వచ్చిందని ప్రియాంక వివరించారు. "ఒక్కొక్క షాట్లో ఒక్కో వస్త్రం తీసివేయాలని డైరెక్టర్ చెప్పారు. కానీ అది చాలా పెద్ద సాంగ్. ప్రతి సన్నివేశానికి ఒక్కో పీస్ తీసివేయాలంటే ఎక్కువ పొరలు ఉండే దుస్తులు వేసుకుంటానని చెప్పాను. తద్వారా శరీరాన్ని కప్పుకోవచ్చని భావించాను.
ఈ విషయం గురించి స్టైలిస్ట్‌తో మాట్లాడమని డైరెక్టర్ సలహా ఇచ్చారు. నేను ఆయనకు కాల్ చేసి పరిస్థితి గురించి వివరించాను. ఆ తరువాత డైరెక్టర్‌కు ఫోన్ ఇచ్చాను. అతడు నా ఎదురుగా నిలబడి స్టైలిస్ట్‌తో కొంచెం కోపంగా మాట్లాడారు. ‘ఏది ఏమైనా సరే.. ఈ సాంగ్‌లో హీరోయిన్ ప్యాంటీ, లోదుస్తులు కనిపించాలి. లేకపోతే సినిమా చూడటానికి జనం ఎందుకు వస్తారు’ అని ఆయన ప్రశ్నించాడు" అని తన పుస్తకంలో ప్రియాంక వెల్లడించారు.
ఈ సంఘటన జరిగిన మరుసటి రోజే ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నానని ప్రియాంక రాశారు. "డైరెక్టర్ మాటలు నన్ను బాధపెట్టాయి. అతడు నాకు ఏమాత్రం గౌరవం ఇవ్వలేదు. దీంతో సినిమా చేసేది లేదని చెప్పాను. ఇలాంటివి ఆమోదయోగ్యం కాదని చెప్పేశాను. నా నిర్ణయంతో ఆయనకు ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో మరో సినిమా సెట్స్‌లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చాడు. చివరకు ఈ విషయంలో సల్మాన్ ఖాన్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది" అని ప్రియాంక వివరించారు.
* సినిమా అవకాశాల కోసం కష్టాలు
మిస్ వరల్డ్-2000 పోటీల్లో గెలిచిన తరువాత ప్రియాంక సినిమాల్లోకి వెళ్లాలనుకుంది. మొదటిసారి ఒక నిర్మాతను కలిసిన విషయం, ఆయన ఇచ్చిన సలహాలను కూడా తన పుస్తకంలో రాశారు. "ఆ నిర్మాతను కలిసి కాసేపు మాట్లాడాను. ఆయన నన్ను నిల్చోమని, పక్కకు, వెనక్కు తిరగమని చెప్పాడు. కాసేపు అదేపనిగా చూశాడు. సినిమాల్లో నటించాలంటే నా శరీర ఆకృతిలో కొన్ని మార్పులు చేసుకోవాలని చెప్పాడు. బ్రెస్ట్, బట్ సైజు పెరగాలని, దవడ ఫిక్స్ చేయాలని చెప్పారు. ఇవన్నీ చేసే డాక్టర్ ఒకరు తనకు తెలుసని, నేను సరేనంటే ఆయన వద్దకు నన్ను పంపుతానని చెప్పాడు" అని Unfinished పుస్తకంలో ప్రియాంక వివరించారు. తమ అభిమాన నటి జ్ఞాపకాలన్నీ పొందుపరిచిన ఈ పుస్తకానికి ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది.