హోమ్ /వార్తలు /సినిమా /

రివ్యూ: ప్రతిరోజూ పండగే.. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్..

రివ్యూ: ప్రతిరోజూ పండగే.. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్..

ప్రతి రోజూ పండగే

ప్రతి రోజూ పండగే

మారుతి సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన గత సినిమాలే రేంజ్ చూపించాయి. అయితే శైలజారెడ్డి అల్లుడు ఫ్లాప్ తర్వాత ఈయన చేసిన సినిమా కావడంతో ఆసక్తి బాగానే ఉంది. ఇక చిత్రలహరి విజయం తర్వాత సాయి నటించిన సినిమా.. ప్రతి రోజూ పండగే.

ఇంకా చదవండి ...

నటీనటులు: సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా, రావు రమేష్, సత్యరాజ్ తదితరులు

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

సినిమాటోగ్రఫీ: జయకుమార్

సంగీతం: థమన్

నిర్మాత: బన్నీ వాస్

దర్శకుడు: మారుతి

మారుతి సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన గత సినిమాలే రేంజ్ చూపించాయి. అయితే శైలజారెడ్డి అల్లుడు ఫ్లాప్ తర్వాత ఈయన చేసిన సినిమా కావడంతో ఆసక్తి బాగానే ఉంది. ఇక చిత్రలహరి విజయం తర్వాత సాయి నటించిన సినిమా ఇది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..


కథ:

రఘురామయ్య(సత్యరాజ్) కొడుకులు కోడళ్ళు అందరూ ఉండి కూడా ఒంటరిగా బతుకుతుంటాడు. చివరి రోజుల్లో కూడా ఎవరూ పట్టించుకోరు. అలాంటి సమయంలో ఆయన మనవడు సాయి (సాయి తేజ్)అమెరికా నుంచి వస్తాడు. తాత చావును కూడా పండగ చేయాలనుకుంటాడు. దూరమైపోయిన కొడుకులు కూతుళ్లను మళ్లీ అందరిని ఒక్కటి చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది అసలు కథ..

కథనం:

సాధారణంగా మారుతి సినిమా అంటే హీరోకు ఓ వ్యాధి ఉంటుంది.. లేదంటే ఏదైనా ఓ లక్షణం ఉంటుంది. దాన్నుంచి కామెడీ జనరేట్ చేస్తుంటాడు. కానీ ఈ సారి మాత్రం అలాంటివేం లేకుండా జాగ్రత్త పడ్డాడు మారుతి. పూర్తిగా కుటుంబ కథా చిత్రం అందించాలని ఫిక్సైపోయాడు. ఒంటిమీదకు శ్రీకాంత్ అడ్డాల పూనినట్లు పూర్తిగా ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అందించే ప్రయత్నం చేసాడు ఈ దర్శకుడు. వయసు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులను వదిలేసి.. తమ బతుకు తాము బతికేయాలనుకునే కొడుకులకు ఈ కథ కనువిప్పు కలిగించేలా రాసుకున్నాడు మారుతి. ముఖ్యంగా చివరి సమయంలో ఒంటరిగా ఉండే పేరెంట్స్ పడే బాధను ఈ చిత్రంలో చూపించాడు మారుతి. శతమానం భవతి సినిమాలో కూడా ఇదే కథ ఉంటుంది. కానీ అది వేరే ట్రీట్మెంట్. ఈ విషయంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు కూడా. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో వచ్చే చాలా సన్నివేశాలు అద్భుతంగా వర్కవుట్ అవ్వడమే కాకుండా.. కడుపుబ్బా నవ్వించాయి కూడా. పూర్తిస్థాయి ఫన్ ఎంటర్‌టైనర్‌గా ఫస్టాఫ్ తీర్చిదిద్దాడు మారుతి. సాయి ధరమ్ తేజ్ ఎంట్రీ సీన్.. కుటుంబంలో వచ్చే కామెడీ సన్నివేశాలన్నీ బాగానే అల్లుకున్నాడు మారుతి. అన్నింటికంటే హైలైట్ రాశి ఖన్నా ఏంజిల్ ఆర్నా ట్రాక్. సుప్రీమ్ సినిమాలో అదిరిపోయే కామెడీ చేసిన రాశి.. మళ్లీ ఇప్పుడు ఈ సినిమాలో రెచ్చిపోయింది. కమెడియన్స్ అవసరం లేకుండా పూర్తిగా రాశిపైనే కామెడీ ట్రాక్ రాసుకున్నాడు మరుతి. రావు రమేష్ కూడా ఈమెకు తోడయ్యాడు. ఫస్టాఫ్, సెకండాఫ్ అని తేడా లేకుండా ఇద్దరూ సినిమా అంతా బాగానే నవ్వించారు. కీలకమైన పాత్రలో సత్యరాజ్ కూడా అద్భుతంగా చేసాడు. ఈయన చుట్టూనే కథ అల్లుకున్నాడు మారుతి. తాతా మనవళ్ల మధ్య ఎమోషన్స్ కొత్తగా చూపించే ప్రయత్నం చేసాడు మారుతి. చాలా వరకు ఇది సక్సెస్ అయింది కూడా. కొన్ని సన్నివేశాలు బాగా కుదిరాయి. అయితే ఫస్టాఫ్‌లో ఉన్నంత ఎమోషన్స్ కానీ కామెడీ కానీ సెకండాఫ్‌లో కనిపించలేదు. కొన్ని ఎమోషన్స్ బలవంతంగా కథలో ఇరికించినట్లు అనిపించాయి. అది కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అక్కడక్కడా సత్యరాజ్, సాయి మధ్య వచ్చే సీన్స్ కాస్త ఓవర్ డోస్ అయ్యాయేమో అనిపించాయి. కానీ రావు రమేష్ ఉండటంతో బ్యాలెన్స్ అయిపోయింది. ఆయనపై వచ్చిన రెండు మూడు సన్నివేశాలు అద్భుతంగా వర్కవుట్ అయ్యాయి. కామెడీ కూడా బాగానే పండటంతో ప్రతిరోజూ పండగే అబౌ యావరేజ్ అనిపిస్తుంది. కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేసి తీసిన ఈ చిత్రం బాగానే వర్కవుట్ అయ్యేలా కనిపిస్తుంది. క్లైమాక్స్ ఎమోషనల్ గా కనెక్ట్ చేశాడు మారుతి కానీ రొటీన్ కథ కావడంతో ఎంతవరకు పాస్ మార్కులు వేయించుకుంటుందనేది చూడాలిక.

నటీనటులు:

సాయి తేజ్ మరోసారి ఆకట్టుకున్నాడు. మనవడిగా తన పాత్రలో ఫుల్ న్యాయం చేసాడు. కామెడీతో పాటు యాక్షన్, ఎమోషన్స్ కూడా బాగానే పండించాడు. అప్పుడప్పుడూ వద్దన్నా చిరంజీవి వచ్చెళ్లాడు. రాశి ఖన్నా బాగా నటించింది. కామెడీ కూడా బాగానే చేసింది. సత్యరాజ్ కీలకమైన పాత్రకు ప్రాణం పోసాడు. కథ అంతా ఆయనపైనే నడుస్తుంది కూడా. రావు రమేష్ కూడా చాలా వరకు మెప్పించాడు.. ఈయనే సినిమాకు ప్రధానబలం కూడా. కొన్ని సన్నివేశాల్లో కామెడీతో కడుపులు చెక్కలు చేసాడు. మిగిలిన వాళ్లంతా కథకు తగ్గట్లుగా వచ్చి వెళ్లారు.. అంతా బాగానే చేసారు కూడా.

టెక్నికల్ టీం:

థమన్ మరోసారి మంచి సంగీతమే అందించాడు. ముఖ్యంగా తకిట తకిట పాట అయితే థియేటర్స్‌లో గోల చేయించింది. మరో రెండు పాటలు కూడా బాగున్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది. కాకపోతే సెకండాఫ్ ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. అక్కడక్కడా బలవంతపు సన్నివేశాలు వచ్చినట్లు అనిపించాయి. జయకుమార్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. సినిమాకు ప్రధాన బలం అదే. ఇక దర్శకుడు మారుతి మరోసారి రొటీన్ కథతోనే వచ్చాడు కానీ ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. తన మార్కుకు భిన్నంగా కుటుంబ కథతో వచ్చినా కూడా చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా గతంతో పోలిస్తే ఎమోషనల్ సీన్స్ బాగా వర్కవుట్ చేసాడు. అయితే సెకండాఫ్ ఇంకాస్త శ్రద్ధ పెట్టుంటే సినిమా రేంజ్ మారిపోయుండేది. ఓవరాల్‌గా యావరేజ్ ఫ్యామిలీ డ్రామా దగ్గరే ఆగిపోయాడు మారుతి.

చివరగా ఒక్కమాట:

ప్రతిరోజూ పండగే.. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్..

రేటింగ్: 2.75/5

First published:

Tags: Maruthi, PratiRoju Pandaage, Sai Dharam Tej, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు