ఇన్ని రోజులు "సాహో" షూటింగ్ జరుగుతుంది.. జరుగుతుంది అని మాత్రమే వింటున్నాం కానీ అది ఎప్పుడు వస్తుంది..? మళ్లీ "బాహుబలి" మాదిరే రెండేళ్లు తీసుకుంటాడా అనేది మాత్రం ఎవరూ చెప్పడం లేదు. పైగా ఈ చిత్రం మొదలై ఏడాదిన్నర దాటిపోయింది. "బాహుబలి 2" వచ్చి కూడా దాదాపు అంతే సమయం అయిపోయింది. దాంతో ప్రభాస్ మళ్లీ అభిమానులకు ఇచ్చిన మాట తప్పాడు. త్వరగా సినిమాలు చేస్తాడన్నాడు కానీ కుదరడం లేదు. అయితే ఇన్నాళ్లకు సాహో విజువల్ ఎలా ఉండబోతుందో ఓ క్లారిటీ వచ్చింది. ఈ చిత్ర ట్రైలర్ కట్ నెక్ట్స్ లెవల్లో ఉంటుందని తెలుస్తుంది.
మేకింగ్ వీడియో చూసిన తర్వాత "సాహో"పై ఎక్కడలేని అంచనాలు వచ్చేసాయి. ఇప్పుడు ఇండియన్ సినిమా అంతే కుర్ర దర్శకుడు సుజీత్ గురించే మాట్లాడుకుంటున్నారు. అసలెవరీ కుర్రాడు.. ఎక్కడ్నుంచి వచ్చాడు.. రెండో సినిమాకే 200 కోట్ల బడ్జెట్ ఎలా పెట్టిస్తున్నాడు.. ఏ నమ్మకంతో అతడు ఏం చెబితే అది నిర్మాతలు చేస్తున్నారు అంటూ చాలా ప్రశ్నలు ఇప్పుడు అందరి మదిలోనూ ఉన్నాయి. అయితే వాటన్నింటికీ సమాధానం ఒకేఒక్క మేకింగ్ వీడియోతో ఇచ్చాడు సుజీత్. ఇకిప్పుడు అసలు సినిమా ఎలా వస్తుందో అని చూడ్డానికి.. ఓ ట్రైలర్ కట్ చేసి మేకర్స్ చూసుకున్నారని తెలుస్తుంది. అది చూసిన తర్వాత అసలు హాలీవుడ్ సినిమా చూస్తున్నామా.. లేదంటే తెలుగు సినిమానేనా అనే అనుమానం వచ్చేలా ఉన్న మేకింగ్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారని ప్రచారం జరుగుతుంది.
ప్రభాస్ ఏదైతే నమ్మకం సుజీత్ మీద పెట్టుకున్నాడో దాన్ని వంద శాతం పూర్తి చేస్తున్నాడు. పైగా విజువల్ ట్రీట్ చూసిన తర్వాత సినిమా రేంజ్ ఏంటో దర్శక నిర్మాతలకు కూడా క్లారిటీ వచ్చేసింది. దాంతో ఆలస్యం అవుతున్నా కూడా ఏ మాత్రం కంగారు పడటం లేదు. ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకుడికి 200 కోట్లు బడ్జెట్ అంటే చిన్న విషయం కాదు. "రన్ రాజా రన్"తో ఆకట్టుకున్న సుజీత్.. "సాహో"తో సంచలనం సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. తెలుగులో ఇప్పటి వరకు విజువల్ గ్రాండియర్స్ ఎలా ఉంటాయో మన దర్శకులు చూపించారు కానీ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు సుజీత్ చూపించడానికి రెడీ అవుతున్నాడు.
"సాహో" విడుదలైన తర్వాత తెలుగు ఇండస్ట్రీ యాక్షన్ పార్ట్ గురించి కూడా మాట్లాడుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. తెలుగుతో పాటు బాలీవుడ్ కూడా ఇప్పుడు ఈ చిత్రం గురించి మాట్లాడుకుంటుంది. కచ్చితంగా ఈ చిత్రంతో బాహుబలి రికార్డులను ప్రభాస్ మరిపిస్తాడంటున్నారు. బాహుబలి 2 కష్టం కానీ సాహో వచ్చిన తర్వాత తొలిభాగం రికార్డులు మాత్రం గల్లంతైపోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. అదే కానీ జరిగితే ప్రభాస్ తెలుగు హీరో కాదు ఇంక.. ఆయన బాలీవుడ్ వెళ్లి సెటిల్ అయిపోవచ్చు. 2019, ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం నాడే "సాహో"కు కూడా స్వాతంత్ర్యం రానుంది. మరి చూడాలిక.. ఈ దర్శకుడి డ్రీమ్ ప్రాజెక్ట్.. ప్రభాస్ డ్రీమ్ ఎంతవరకు నెరవేరనున్నాయో..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Prabhas, Shradda kapoor, Shraddha Kapoor, Telugu Cinema