పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో అదరగొడుతున్నాడు. రెండు రోజుల క్రితమే కేజీయఫ్ డైరెక్టర్‌తో సలార్ సినిమాను ప్రారంభించిన ప్రభాస్ ఈరోజు ఉదయం ప్రతిష్టాత్మకం తెరకెక్కుతోన్న మరో పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ మోషన్ క్యాప్చర్ మొదలైందని ప్రకటించాడు. తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించిన ప్రభాస్ దీనికి సంబంధించిన ఓ ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. ఈరోజు మోషన్ క్యాప్చర్ మొదలైంది. ఇక ఫిబ్రవరి 2న ముహూర్తం అని తెలిపాడు. అంటే మైథలాజికల్ మాగ్నమ్ ఓపస్ ప్రాజెక్టు ఆదిపురుష్ వచ్చే నెలలో ప్రారంభంకానుందని తెలుస్తోంది. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. ప్రభాస్‌తో మరో సూపర్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో లంకేశ్ గా నటిస్తున్నాడు. ఇక సీత పాత్రలో కృతిసనన్ నటిస్తోందని సమాచారం. ప్రభాస్ సోదరుడు అంటే రామునికి లక్ష్మణుడి పాత్రను ఎవరు చేస్తారు అన్న దానిపై మాత్రం అలా గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఈ పాత్రలో ఓ హిందీ నటుడుని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆ రోల్‌కు బాలీవుడ్ కు చెందిన యువ నటుడు సన్నీ సింగ్ పేరు వినిపిస్తుంది. “సోను కె టిటు కి స్వీటీ” అనే చిత్రంలో కనిపించిన ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రభాస్‌కు తమ్ముడిగా కనిపించనున్నాడట. ఈ ఆదిపురుష్ చిత్రం కోసం దాదాపు 300 కోట్ల బడ్జెట్ కేటాయించారని తెలుస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోనన ఈ సినిమా ఇటు హిందీతో పాటు, తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలకానుంది.
ఈ సినిమాను భూషణ్ కుమార్ (టీ సిరీస్), ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ షూట్ ప్రారంభానికి ముందే సంచనాలు సృష్టిస్తోంది. ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం అవతార్, స్టార్ వార్స్ ఫేమ్ స్పెషలిస్టులను నిర్మాతలు సంప్రదించారని కథనాలు వెలువడుతున్నాయి.
ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమా ఆగస్టు 11 2022 న విడుదల కానుందని చిత్రబృందం ట్వీట్ చేసింది. దీంతో ఈ సినిమా విడుదల తేదీపై వస్తోన్న ఊహాగానాలకు తెరపడింది. ఇక ఈ ఎపిక్ ప్రాజెక్ట్‌లో విస్తృత శ్రేణి 3డి గ్రాఫిక్స్‌ను వాడనున్నారు. అవతార్, స్టార్ వార్స్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ కోసం పనిచేసిన నిపుణులే ఈ సినిమాకు కూడా పని చేస్తారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పూర్తిగా గ్రీన్ మాట్ టెక్నాలజీలో చిత్రీకరించనున్నారు. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదే కాక బాలీవుడ్ నటి దీపికా పదుకొనేతో కలిసి ప్రభాస్ ఓ సినిమా చేయనున్నాడు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియాల్సిఉంది.
Published by:Suresh Rachamalla
First published:January 19, 2021, 07:54 IST