Lockdown: టాలీవుడ్ హీరోను అడ్డుకున్న పోలీసులు.. ఆస్పత్రికి వెళ్తున్నానని చెప్పినా వినలేదు..

నిఖిల్ సిద్దార్థ

పోలీసుల తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యవసర వైద్య సేవలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఉంటుందన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా? అని నెటిజన్లు మండిపడుతున్నారు.

 • Share this:
  తెలంగాణలో లాక్‌డౌన్ కఠినంగా అమలవుతోంది. ఏం చేసినా.. ఉదయం 6 నుంచి 10 గంటల వరకే. ఆ తర్వాత ఎవ్వరినీ రోడ్ల మీదకు అనుమతించడం లేదు. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఉంది. ఐతే లాక్‌డౌన్ సమయంలో టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ రోడ్డు మీదకు వచ్చారు. ఆయన సరదా కోసం రోడ్డు మీదకు రాలేదు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ పేషెంట్ కోసం అత్యవసర మందులు తీసుకెళ్లేందుకు బయటకు వచ్చారు. ఆ మందులతో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉప్పల్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. లాక్‌డౌన్‌లో ఎందుకు బయటకు వచ్చావని నిలదీశారు. ఓ పేషెంట్ కోసం మందులు తీసుకెళ్తున్నానని.. ప్రిస్క్రిప్షన్, పేషెంట్ వివరాలు చూపించినా వదల్లేదు. లాక్‌డౌన్ సమయంలో ఈ-పాస్ ఉంటేనే అనుమతిస్తామని స్పష్టం చేశారు.

  ఓ వైపు కరోనా బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు పోలీసులేమో రోడ్డు మీద ఆపేశారు. పోనీ ఈపాస్ కోసం అప్లై చేద్దామంటే.. సర్వర్ డౌన్ అయిపోయింది. ఏం చేయాలో పాలుపోక.. ఈ విషయాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేశారు నిఖిల్ సిద్దార్థ్. లాక్‌డౌన్ సమయంలో అత్యవసర వైద్య సేవలకు మినహాయింపు ఉంది కదా..? నన్ను ఎందుకు ఆపారో అర్ధం కావడం లేదని పేర్కొన్నారు.

  నిఖిల్ ట్వీట్ చేసిన కాసేపటికే హైదరాబాద్ సిటీ పోలిస్ విభాగం ట్విటర్ ద్వారా స్పందించింది. మీరున్న లొకేషన్ చెప్పండి.. అక్కడున్న సిబ్బంది ద్వారా మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ఆ తర్వాత ఎట్టకేలకు నిఖిల్ ఆస్పత్రికి వెళ్లి పేషెంట్‌కు మందులు అందజేశారు.


  ఐతే పోలీసుల తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యవసర వైద్య సేవలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఉంటుందన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా? అని నెటిజన్లు మండిపడుతున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్, పేషెంట్ వివరాలు చూపించినా.. వదలక పోవడం దారుణమని మండిపడుతున్నారు. కాగా, కరోనా లాక్‌డౌన్ సమయంలో నిఖిల్ సిద్దార్థ్ కూడా పలువురు బాధితులకు తన వంతు సాయం చేస్తున్నారు. సాయం కోసం ఎవరైనా ట్వీట్ చేస్తే.. వెంటనే స్పందిస్తున్నారు. సోనూసూద్ స్ఫూర్తితో అవసరమైన వారికి మందులు, ఆహార పదార్థాలను పంపిణీ చేస్తున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published: