టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబుకు ఊహించని షాక్ తగిలింది. ఈయనపై పోలీసు కేసు నమోదైంది. వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈయన్ని వెంటనే అదుపులోకి తీసుకోవాలంటూ తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసలు విషయం ఏంటంటే.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు పూర్తైన తర్వాత.. ఓ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మోహన్ బాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. తమ మనోభావాలను దెబ్బ తీసేలా మంచు మోహన్ బాబు మాట్లాడారని.. వెంటనే ఆయనపై కేసు పెట్టి అరెస్ట్ చేయాలంటూ ఆ సంఘం నేతలు పోలీసులను ఆశ్రయించారు. గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులకు మోహన్ బాబుపై ఫిర్యాదు చేసారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా ఈయన మాట్లాడుతూ ఈ రోజుల్లో గొర్రెలు కాచుకునే వాడి దగ్గర కూడా సెల్ ఫోన్ ఉంది. వాడు వెంటనే నొక్కి చూస్తున్నాడు అంటూ మాట్లాడాడు. ఇదే కాంట్రవర్సీ అయిందిప్పుడు. మా ఎన్నికల్లో ఈ ఘర్షణ ఏమిటి.. అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్.. గొర్రెలు మేపుకునే వాడి దగ్గర కూడా ఫోన్ ఉంది.. వాడు కూడా మన గొడవను రికార్డు చేసే అవకాశం ఉంటుంది.. ఈ న్యూసెన్స్ ఇప్పుడే ఆపేద్దాం అంటూ సీరియస్ అయ్యాడు మోహన్ బాబు.
ఈయన వ్యాఖ్యలను ఇప్పుడు తీవ్రంగా తప్పు బట్టారు గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం. ఆయన చేసిన కామెంట్స్ గొర్రెల కాపరులను కించపరిచేలా ఉన్నాయని.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మోహన్ బాబుపై ఫిర్యాదు చేశారు. గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం జిల్లా అధ్యక్షులు కలికినేని తీరీష్, సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బసినబోయిన గంగరాజు, రాము, లాలయ్య ఈ ఫిర్యాదు చేసిన వాళ్ళలో ఉన్నారు. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను వాళ్లు డిమాండ్ చేసారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Manchu mohan babu, Telugu Cinema, Tollywood