ఎన్నో క్లాసికల్ చిత్రాలతో తెలుగు తెరపై తన మార్క్ చూపించారు లెజెండరీ డైరెక్టర్ కె విశ్వనాథ్ (K Viswanath). కళా తపస్విగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడుకట్టుకున్న ఆయన.. నేడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వృద్ధాప్యంతో సంభవించిన అనారోగ్య కారణాలతో గురువారం రాత్రి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
కె విశ్వనాథ్ మృతి పట్ల దేశ ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) సైతం ట్వీట్ చేస్తూ సంతాపం వ్యక్తం చేశారు. ''సినీ ప్రపంచంలో ఒక దిగ్గజం కె విశ్వనాథ్. సృజనాత్మకత గల దర్శకుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా సినీ లోకంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు వ్యక్తి. వివిధ ఇతివృత్తాలతో వారు తీసిన సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించాయి. అతని కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి'' అని పేర్కొన్నారు మోదీ.
శ్రీ కె. విశ్వనాథ్ గారి మృతిపట్ల విచారం వ్యక్తంచేస్తున్నాను. అతను సినీ ప్రపంచంలో ఒక దిగ్గజం, సృజనాత్మక దర్శకుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా సినీలోకంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. వివిధ ఇతివృత్తాలతో తీసిన అతని సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించాయి.
— Narendra Modi (@narendramodi) February 3, 2023
తెలుగు చిత్రపరిశ్రమకు గొప్ప గౌరవాన్ని, గుర్తింపు తీసుకొచ్చిన విశ్వనాథ్ (RIP Viswanath).. 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. భారతీయ సంస్కృతికి చిహ్నమైన శాస్త్రీయ కళలను కథలుగా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆత్మ గౌరవం సినిమాతో దర్శకుడిగా మారారు. శంకరాభరణం సినిమా తెలుగు చిత్రసీమలో చరిత్ర సృష్టించింది. జాతీయ పురస్కారం గెలుచుకుంది. సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం ఆయకు కీర్తి ప్రతిష్ఠతలు తెచ్చిపెట్టాయి. సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ.. ఆయన తీసిన సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం అందరినీ ఆలోజింపజేశాయి.
విశ్వనాథ్ పూర్తి పేరు.. కాశీనాథుని విశ్వనాథ్. 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా రేపల్లెలో ఆయన జన్మించారు. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారు. ఆ తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక.. వాహిని స్టూడియోస్‌లో సౌండ్ ఆర్టిస్టుగా సినీ కెరీర్‌ను మొదలుపెట్టారు. సినిమాల్లో ఆయన ప్రతిభను గుర్తించిన నాగేశ్వరరావు.. ఆత్మగౌరవం సినిమాలో దర్శకుడిగా అవకాశం కల్పించారు. ఆ తర్వాత సిరిసిరి మువ్వ సినిమాతో దర్శకుడిగా ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది. అలా ఎన్నో అద్భుతమైన..అపురూపమమైన చిత్రాలను టాలీవుడ్‌కి అందించారు కె.విశ్వనాథ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kasi vishwanath, Narendra modi, Tollywood