HBDMegastarChiranjeevi: ‘నా అన్నయ్య’ అంటూ పవన్ కళ్యాణ్ ఎమోషనల్ మెసేజ్

Pawan Kalayn Wishes to Chiranjeevi | చిరంజీవి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్నయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.

news18-telugu
Updated: August 22, 2020, 3:55 PM IST
HBDMegastarChiranjeevi: ‘నా అన్నయ్య’ అంటూ పవన్ కళ్యాణ్ ఎమోషనల్ మెసేజ్
చిరంజీవి, పవన్ కళ్యాణ్
  • Share this:
Pawan Kalyan on Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నేడు. కొన్ని కోట్ల మంది మెగా అభిమానులకు పండుగ రోజు. అలాంటి పండుగ రోజు, వినాయకచవితి పండుగ కూడా వచ్చింది. ఈ శుభసందర్భంలో అభిమానులు, సినీ ప్రముఖులు చిరంజీవిని పుట్టినరోజు శుభాకాంక్షల్లో ముంచెత్తుతున్నారు. సోషల్ మీడియాలో #HBDMegastar అంటూ ట్వీట్ల మోత పుట్టిస్తున్నారు. చిరంజీవి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్నయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. జనసేన అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ సందేశాన్ని ఉంచారు. చాలా ఎమోషనల్‌ మెసేజ్ పెట్టారు.

‘అన్నయ్య చిరంజీవి నా స్ఫూర్తి ప్రదాత. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎంత ఆరాధిస్తానో నా అన్నయ్య చిరంజీవిని కూడా అంతలా పూజ్యభావంతో ప్రేమిస్తాను. నా అన్నయ్య, వదిన నాకు తల్లిదండ్రులతో సమానం. అన్నయ్య చేయిపట్టి పెరిగాను. ఒక విధంగా చెప్పాలంటే అన్నయ్యే తొలిగురువు. అమ్మలా లాలించారు. నాన్నలా మార్గదర్శిలా నిలిచారు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న పెద్దల మాటలు అన్నయ్యను చూస్తే నిజమనిపిస్తాయి. అంచెలంచెలుగా ఎదిగి కోట్లాది మంది అభిమానులు, శ్రేయోభిలాషులు గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించారు. తెలుగువారు సగర్వంగా ‘చిరంజీవి మావాడు’ అని చెప్పుకొనేలా అసామాన్యుడిగా ఎదిగి, నాలాంటి వారెందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. కష్టాన్ని నమ్ముకున్నారు. సముచిత స్థానానికి చేరుకున్నారు. చిన్న పాయగా పాయగా ఉద్భవించే నది అఖండ రూపాన్ని సంతరించుకున్నట్టు చిరంజీవి ఎదిగారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకున్నారు. ఆయన ఎదుగుదల ఆయనలోని సేవాతత్పరతను ఆవిష్కరింపజేసింది. ఆయనలా నటుడవ్వాలని, ఆయనలా అభినయించాలని కొందరు స్ఫూర్తి పొందితే, ఆయనలా సేవ చేయాలని మరెందరో ప్రేరణపొందారు. తన అభిమానులకు ‘సేవ’ అనే సత్కార్యానికి దారిచూపారు. ఎందరో ఆ దారిలో పయనిస్తూ నేడు సమాజంలో అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆపన్నులకు అండగా ఉంటున్నారు. అటువంటి కృషీవలుడి తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం. నేడు చిరంజీవి జన్మదినం. ఈ సందర్భంగా తెలుగువారందరూ ఆయన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను. చిరంజీవికి చిరాయువుతో కూడిన సుఖశాంతులు ప్రసాదించాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. అన్నయ్యకు ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.’ అని పవన్ కళ్యాణ్ సందేశం పంపారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 22, 2020, 3:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading