టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ (Super Star krishna) (80) ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున 4.10 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. నిన్న గుండెపోటు, శ్వాస ఇబ్బందులతో హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో కృష్ణ అడ్మిట్ అయిన ఆయన.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ.. వైద్యానికి శరీరం సరిగా సహకరించకపోవడంతో కన్నుమూశారు.
కృష్ణ మరణవార్త తెలిసి టాలీవుడ్ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ పెద్దలు దిగ్భ్రాంతికి గురైయ్యారు. ధైర్యంగా ఉండాలంటూ కుమారుడుకు మహేష్ బాబుకు ప్రగాడ సానుభూతి తెలుపుతున్నారు. అభిమానులు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు. ఒకే సంవత్సరంలో ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి రమేష్ బాబు, ఇందిరా దేవి, కృష్ణ మరణించడంతో ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ట్విట్టర్ వేదికగా కృష్ణ మృతి పట్ల తన సంతాపాన్ని తెలిపారు.
''చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదుకి సార్థకత చేకూర్చిన శ్రీ కృష్ణ గారు తుదిశ్వాస విడిచారనే విషయం ఎంతో ఆవేదన కలిగించింది. కృష్ణ గారు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకొంటారని ఆశించాను. ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. కృష్ణ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
స్నేహశీలి, మృదు స్వభావి అయిన శ్రీ కృష్ణ గారు ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. మద్రాస్ లో ఉన్నప్పటి నుంచి మా కుటుంబంతో చక్కటి అనుబంధం ఉంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కథానాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా శ్రీ కృష్ణ గారు చేసిన సేవలు చిరస్మరణీయాలు. తెలుగు సినిమా పురోగమన ప్రస్థానంలో ఆయన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేశారు. విభిన్న పాత్రలు పోషించిన శ్రీ కృష్ణ గారు కౌబోయ్, జేమ్స్ బాండ్ కథలతో తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించారు. పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా జీవితంలో కూడా ఆయన తన ముద్ర వేశారు.
సినిమా రంగం క్షేమాన్ని కాంక్షించే శ్రీ కృష్ణ గారి మరణం తెలుగు చలనచిత్ర సీమకు తీరని లోటు. ఆయన కుమారుడు శ్రీ మహేష్ బాబు గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను'' అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.
మరికాసేపట్లో కృష్ణ పార్దీవ దేహాన్ని నానక్ రామ్ గూడ లోని ఆయన నివాసానికి తీసుకెళ్లనున్నారు. అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం వరకు అక్కడే ఉంచనున్నారని సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Krishna, Pawan kalyan, Tollywood