నటీనటులు: డా. బ్రహ్మానందం, స్వాతి రెడ్డి, సముద్రఖని, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, నరేష్ అగస్త్య, దివ్య శ్రీపాద, వికాస్, ఆదర్శ్ బాలకృష్ణన్, శ్రీ విద్యా మహర్ద
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, ప్రశాంత్ ఆర్ విహారి
సినిమాటోగ్రఫర్: రాజ్ కె నల్లి
ఎడిటర్: గ్యారీ బి హెచ్
దర్శకుడు: హర్ష పులిపాక
నిర్మాతలు: అఖిలేష్ వర్ధన్, సృజన్
రెగ్యులర్ కథలకు బిన్నంగా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో పంచతంత్రం సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఐదు విభిన్నమైన కథల సమాహారంగా ఈ సినిమాను రిలీజ్ చేశారు. అప్పట్లో `చందమామకథలు` రాగా.. ఇప్పుడు పంచతంత్రం సినిమా వచ్చి తెలుగు ప్రేక్షకులకు ఓ వైవిధ్యమైన అనుభూతి కలిగిస్తోంది. హర్ష పులిపాక దర్శకత్వంలో బ్రహ్మానందం ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా? మన ఈ రివ్యూలో చూద్దాం.
కథ విషయానికొస్తే..
వేద వ్యాస్ (బ్రహ్మానందం) ఆలిండియా రేడియోలో పనిచేసి రిటైర్ అవుతాడు. విశ్రాంత జీవితంలో బోరింగ్ గా ఫీల్ అయి అరవై ఏళ్ల వయసులో రచయితగా కెరీర్ ప్రారంభించాలని ప్రయత్నిస్తాడు. కానీ ఇంట్లో తన కూతురు రోషిణి (కలర్ స్వాతి) ఆయన కోరికని అర్థం చేసుకునే ప్రయత్నం చేయదు. అయినప్పటికీ ఐదు కథలను రాసుకొని స్టోరీ టెల్లింగ్ పోటీలో పాల్గొంటాడు వేద వ్యాస్. ఆ ఐదు కథల ఇతివృత్తం మనిషి పంచేంద్రియాల చుట్టూ తిరుగుతుంటాయి.
ఇందులో మొదటి కథ ఇతివృత్తం వినడం. ఈ కథ సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన నరేష్ అగస్త్య చుట్టూ తిరుగుతుంది. ఉద్యోగం మంచిదే అయినా ఆయనలో ఏదో తెలియని అసంతృప్తి ఉంటుంది. ఈ క్రమంలోనే స్నేహితుల ద్వారా బీచ్ గురించి వినగానే ఉత్సాహం కలుగుతుంది. ఆ ఉత్సాహానికి కారణం ఏంటి? అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్.
ఇక రెండో కథ ఇతివృత్తం రుచి. ఇది రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ నేపథ్యంలో సాగుతుంది. జీవితంలో పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ అంటూ ఉండదు అడ్జస్ట్మెంట్ తో ముందుకు వెళ్లడమే లైఫ్ అనేది ఈ కథ ఉద్దేశం. ఇక మూడవ కథ ఇతివృత్తం వాసన. ఇందులో సముద్రఖని ఉంటాడు. నాలుగో కథ స్పర్శ. దివ్య శ్రీపాద, వికాస్ ముప్పాలా పోషించిన భార్యాభర్తలపై ఎమోషనల్ స్టోరీ ఇది. చివరిదైన ఐదో కథ యొక్క ఇతివృత్తం దృశ్యం. ఇది స్వాతి రెడ్డి పోషించిన లేఖ అనే స్టోరీ టెల్లర్ కథ. ఇలా ఐదు కథల సమాహారాన్ని చెప్పి స్టోరీ టెల్లింగ్ పోటీలో గెలుపొందుతాడు వేదవ్యాస్.
కథనం, టెక్నీషియన్స్ పని తీరు చూస్తే..
పంచతంత్రం సినిమాలో ఐదు కథలను చూపిస్తూ సినిమాపై ఆసక్తి పెంచాడు డైరెక్టర్. ఓ పోయెటిక్ సెన్స్ లో కమర్షియల్ అంశాలకు అతీతంగా పంచేంద్రియాలను థీమ్‌గా తీసుకుని దర్శకుడు నడిపించిన కథ కొత్త ఫీల్ తెప్పించింది. మన చుట్టూ నిత్యం జరిగే విషయాలను, సంఘటనలనే కథా వస్తువులుగా తీసుకొని సినిమా తెరకెక్కించడంలో వైవిద్యం చూపించాడు డైరెక్టర్ హర్ష పులిపాక. పంచతంత్రం సినిమాకు ప్రాణం చివరి రెండు కథలు. పాత్రల పరంగా ఎలాంటి వంకా పెట్టలేని పనితీరును కనబర్చారు డైరెక్టర్ హర్ష పులిపాక. నాలుగో కథలో భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం ఎంతో అద్భుతంగా చూపించాడు. భార్య కోసం భర్త పడే ఆవేదన.. వాళ్ళిద్దరి మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ ఇందులో బాగా కుదిరింది. చివరి కథ ఎంతో హృద్యంగా ఉంది. దర్శకుడు ఈ ఐదు కథలను, వేద వ్యాస్ అనే పాత్ర ద్వారా ముడిపెట్టిన తీరు ఆకట్టుకుంది.
నటీనటుల విషయానికొస్తే..
ఈ ఐదు కథల్లో నటీనటులందరూ కూడా ఎంతో అద్భుతంగా నటించారు. రెగులర్ గా కామెడీ పాత్రల్లో కనిపించే బ్రహ్మానందం ఈ డిఫరెంట్ రోల్ చేసి ఆకట్టుకున్నారు. మొదటి కథలో నరేష్ అగస్త్య, శ్రీవిద్య.. రెండో కథలో రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్.. మూడవ కథలో సముద్రఖని, దివ్యవాణి.. నాలుగో గదిలో దివ్య శ్రీపాద, వికాస్.. ఐదవ కథలో కలర్స్ స్వాతి, ఉత్తేజ్ నటన బాగానే ఉంది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు అసెట్ అయ్యాయి.
చివరి మాట: సినిమాల్లో ఇదో డిఫరెంట్ అనుభూతి
రేటింగ్: 2.75/5
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Brahmanandam, Tollywood, Tollywood actor