కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణం కేవలం అభిమానులనే కాదు.. సినిమా ఇండస్ట్రీని కూడా విషాదంలోకి నెట్టేసింది. ఈయన చనిపోయి మూడు నెలలు అయిపోయినా కూడా ఇంకా ఆయన ధ్యాసలోనే ఉన్నారు ఫ్యాన్స్. మరోవైపు ఆయన నటించిన చివరి సినిమా జేమ్స్ టీజర్ ఈ మధ్యే విడుదలైంది. ఇది చూసిన తర్వాత మరోసారి పునీత్‌ను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు అభిమానులు. కుటుంబ సభ్యులు అయితే జేమ్స్ టీజర్ చూసి ఏడుపు కంట్రోల్ చేసుకోలేకపోయారు. మరోవైపు మిగిలిన ఇండస్ట్రీలు కూడా పునీత్ చివరి సినిమా టీజర్ చూసి ఎమోషనల్ అవుతున్నారు. ఫిబ్రవరి 11న విడుదలైన జేమ్స్ టీజర్ రికార్డులు తిరగరాస్తుంది. 5 భాషల్లో విడుదలైన ఈ టీజర్‌కు ఒక్కటంటే ఒక్క డిస్ లైక్ కూడా రాలేదు. యూ ట్యూబ్ చరిత్రలోనే ఇది రికార్డు.
ఇదిలా ఉంటే 2021 అక్టోబర్ 29న ఆయన గుండెపోటుతో మరణించాడు. పునీత్ రాజ్‌కుమార్ మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు మాత్రమే కాదు కన్నడ ప్రజలకు కూడా తీరని లోటు. ఎందుకంటే ఆయన్ని హీరోలా కాకుండా తమలో ఒకడిగా చూసుకున్నారు. ఆయన కూడా అభిమానులను సొంత వాళ్ల కంటే ఎక్కువగా చూసుకున్నాడు కాబట్టే ఇప్పుడు దేవుడు అయ్యాడు. తాజాగా పునీత్ గురించి ప్రభాస్ ఆసక్తికరమైన ఎమోషనల్ ట్వీట్ చేసాడు. జేమ్స్ టీజర్ చూసిన తర్వాత ఇది ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని అర్థమవుతుంది. ఈ సినిమాలో ప్రియా ఆనంద్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్ విలన్‌గా నటించాడు. చేతన్ కుమార్ తెరకెక్కిస్తున్నాడు.
మార్చ్ 17న పునీత్ జయంతి సందర్భంగా సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. కన్నడతో పాటు మిగిలిన అన్ని భాషల్లో ఒకేరోజు జేమ్స్ విడుదల కానుంది. దీనికోసం భారీగానే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే జేమ్స్ టీజర్ చూసిన తర్వాత ప్రభాస్ ఎమోషనల్ అయ్యాడు. ‘'జేమ్స్' సినిమా పోస్టర్ షేర్ చేసి.. మనం మరో అద్భుతమైన సినిమాను చూడబోతున్నాం.. పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ సర్‌ని అభిమానించే కోట్లాది మంది మన లాంటి అభిమానులకు ఈ చిత్రం ఎప్పుడూ ప్రత్యేకమైనదే.. వి మిస్ యూ సర్’ అంటూ పోస్ట్ చేశాడు ప్రభాస్. దీంతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పోస్ట్ చేసి పునీత్ అభిమానులు సంబరపడుతున్నారు. అలాగే మరోవైపు ఎమోషనల్ కూడా అవుతున్నారు. అన్నట్లు జేమ్స్ సినిమాలో పునీత్ పాత్రకు శివన్న డబ్బింగ్ చెప్పాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.