PAKISTAN PEMRA BANS KISSES HUGS INTIMATE SCENES BANNED IN TV SERIALS SK
TV Serials: ఇకపై రొమాంటిక్ సీన్స్ కనిపించవు.. టీవీ సీరియల్స్‌లో కౌగిలింతలు, ముద్దులపై నిషేధం.. ఎక్కడంటే..
ప్రతీకాత్మక చిత్రం
Pakistan TV serials: శాటిలైట్ టీవీ లైసెన్సుదారులందరూ నియమ నిబంధనలను పరిగణనలోకి తీసుకోవాలని PEMRA స్పష్టం చేసింది. నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని తెలిపింది. రూల్స్ ఉల్లంఘించిన టీవీ ఛానెళ్ల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేసింది.
సాయంత్రం అయిదంటే చాలు టీవీల్లో సీరియళ్ల (TV Serials) సందడి మామూలుగా ఉండదు. గృహిణులంతా అప్పటికే ఇంటి పనులన్నీ ముగించుకొని టీవీలకు అతుక్కుపోతారు. మళ్లీ నిద్రపోయే వరకు వరుస పెట్టి సీరియళ్లను వీక్షిస్తారు. ఇప్పుడు సినిమాలను మించే స్థాయిలో సీరియళ్లను నిర్మిస్తున్నారు. క్వాలిటీ విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. అందుకే కార్తీక దీపం వంటి పలు సీరియళ్లకు సినిమాలకు మించిన క్రేజ్ ఉంటుంది. ఐతే సినిమాల మాదిరే సీరియళ్లలో కూడా ఈ మధ్య కొన్ని సన్నివేశాలు శృతిమించుతున్నాయి. శృంగార సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రభుత్వం (Pakistan) కీలక నిర్ణయం తీసుకుంది. టీవీ సీరియళ్లలో కౌగిలింతలు, ఇతర సన్నిహిత దృశ్యాలపై నిషేధం విధించింది. ధారావాహికల్లో అభ్యంతర సన్నివేశాలను ప్రసారం చేయడాన్ని నిలిపేయాలని పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (PEMRA) టీవీ ఛానళ్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
టీవీ సీరియ్లలో అభ్యంతరకర సన్నివేశాలపై పౌరుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదుల వస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నామని PEMRA వెల్లడించింది. సదరు కార్యక్రమాలు పాకిస్థాన్ సమాజపు అసలైన సంస్కృతిని ప్రతిబింబించడం లేదని పేర్కొంది. సీరియళ్లలో వివాహేతర సంబంధాలు, అసభ్యకరమైన దృశ్యాలు, కౌగిలింతలు, పడక సన్నివేశాలు, జంటల మధ్య సాన్నిహిత్యం వంటివి.. ఇస్లామిక్ బోధనలు, దేశ సంస్కృతిని పూర్తిగా విస్మరిస్తున్నాయని విమర్శించింది. ఈ నేపథ్యంలో అన్ని టీవీ ఛానళ్లు తమ సీరియళ్ల కంటెంట్‌ను ముందుగా అంతర్గత పర్యవేక్షణ కమిటీ ద్వారా పూర్తిస్థాయిలో సమీక్షించాలని.. అభ్యంతరకర దృశ్యాలు ఉంటే వెంటనే తొగించాలని ఆదేశాలు జారీచేసింది.
శాటిలైట్ టీవీ లైసెన్సుదారులందరూ నియమ నిబంధనలను పరిగణనలోకి తీసుకోవాలని PEMRA స్పష్టం చేసింది. నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని తెలిపింది. రూల్స్ ఉల్లంఘించిన టీవీ ఛానెళ్ల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేసింది. ఐతే PEMRA తీసుకున్న ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు సమర్థిస్తున్నారు. చాలా మంచి నిర్ణయం తీసుకుందని కొనియాడుతున్నారు. మరికొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పరువు హత్యలు, మహిళలపై వేధింపులు వంటి అంశాలను పట్టించుకోని వారు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారని.. వారు ఇచ్చిన ఫిర్యాదులతో PEMRA ఇలాంటి నిర్ణయం తీసుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. ముందు వాటి గురించి ఆలోచించాలని.. సమాజంలో మహిళలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినవి చాలా ఉన్నాయని, అవి వదిలిపెట్టి ఇలాంటి వాటిపై ఉక్కుపాదం మోపడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.