కేంద్రప్రభుత్వం 2021 ఏడాదికి గానూ పద్మ అవార్డులు ప్రకటించింది. అందులో పద్మ విభూషణ్-7 , పద్మభూషణ్-10 , పద్మ శ్రీ-102 ఇలా మొత్తం 119 మంది వివిధ రంగాలకు చెందిన వాళ్లు పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. అందులో ముఖ్యంగా సినిమా వాళ్లకు ఈ సారి చాలా తక్కువగానే వచ్చాయి. సంగీతంలో తమకంటూ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్న ఇద్దరు లెజెండరీ సింగర్స్‌కు ఈ సారి పద్మ పురస్కారాలు దక్కాయి. అందులో దివంగత లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు పద్మ విభూషణ్ లభించింది. చనిపోయిన తర్వాత భారతదేశ అత్యున్నత పద్మ పురస్కారం బాలుకు అందచేసింది కేంద్ర ప్రభుత్వం. 2020 సెప్టెంబర్ 25న బాలు చనిపోయారు. జులైలో కరోనా బారిన పడిన బాలసుబ్రమణ్యం.. ఆ తర్వాత 50 రోజుల పాటు చెన్నైలోని ఎంజిఎం హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో సెప్టెంబర్ 25న మరణించారు. ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు పద్మ పురస్కారం దక్కడంతో అభిమానులు ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారు. తమిళనాడు కోటాలో ఎస్పీ బాలుకు ఈ పురస్కారం వచ్చింది.
మరోవైపు కేరళ రాష్ట్రం నుంచి మరో లెజెండరీ సింగర్ చిత్రకు పద్మభూషణ్ వచ్చింది. సంగీత ప్రపంచానికి ఈమె చేసిన సేవలకు గుర్తుగా పద్మభూషణ్ బహూకరించింది కేంద్రం. సంగీత ప్రపంచంలో ఇద్దరు లెజెండ్స్‌కు ఒకే ఏడాది పద్మ అవార్డులు రావడంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.
పద్మ అవార్డులు గెలుచుకున్న వారికి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేస్తూ ఓ ట్వీట్ చేశారు. పద్మ అవార్డులు గెలుచుకున్న వారిని చూసి దేశం గర్విస్తోందని కొనియాడారు.వివిధ రంగాల్లో వారు దేశ అభ్యున్నతి కోసం విశిష్ట సేవలందించారని కొనియాడారు.
Published by:Praveen Kumar Vadla
First published:January 25, 2021, 21:48 IST