ఏ ముహూర్తంలో రాజమౌళి RRR అనే మల్టీస్టారర్ మొదలు పెట్టాడో తెలియదు కానీ అప్పట్నుంచీ మన హీరోలు కూడా ఇగోలు తీసి పక్కనబెట్టేసారు. బాలీవుడ్ మాదిరే తెలుగు ఇండస్ట్రీలో కూడా ప్రస్తుతం మల్టీస్టారర్ హవా బాగా నడుస్తుంది. గత రెండేళ్లుగా ఇలాంటి సినిమాలు ఇంకా వస్తున్నాయి. ఇద్దరు స్టార్ హీరోలు కూడా కలిసి నటించడానికి రెడీ అవుటున్నారు. కథ బాగుంటే కలిసి నటించడానికి మాకేం ఇబ్బంది లేదని చెబుతున్నారు స్టార్ హీరోలు కూడా. దాంతో దర్శకులు కూడా అలాంటి కథలే సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్, రవితేజ కాంబినేషన్లో ఓ క్రేజీ మల్టీస్టారర్ రాబోతుందని ప్రచారం జరుగుతుంది.
పవన్‌తో ఇదివరకే కాటమరాయుడు, గోపాల గోపాల లాంటి సినిమాలు చేసిన దర్శకుడు డాలి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడని తెలుస్తుంది. ఇది ఓ తమిళ సినిమాకు రీమేక్ అని.. అక్కడ్నుంచి కేవలం లైన్ మాత్రమే తీసుకుని ఇక్కడ పవన్, రవితేజ ఇమేజ్‌కు సరిపోయేలా కథ సిద్ధం చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను పవన్ స్నేహితుడు రామ్ తళ్లూరి నిర్మించబోతున్నాడు. ఇప్పటికే SRT బ్యానర్లో రవితేజ రెండు సినిమాలు చేసాడు. నేల టికెట్టుతో పాటు డిస్కో రాజా కూడా అదే బ్యానర్లో చేసాడు.
ఇప్పుడు ముచ్చటగా మూడోసారి చేయబోతున్నాడు. పైగా ఇది పవన్ కళ్యాణ్‌తో కలిసి మల్టీస్టారర్. తనకు రవితేజ అంటే చాలా ఇష్టమని.. నటించే అవకాశం వస్తే కచ్చితంగా చేస్తానని నేల టికెట్టు ఆడియోలో చెప్పాడు పవర్ స్టార్. ఇప్పుడు చెప్పినట్లుగానే ఆయనతో కలిసి నటించబోతున్నాడు పవర్ స్టార్. ప్రస్తుతం ఈయన మూడు సినిమాలు చేస్తున్నాడు. అందులో వకీల్ సాబ్ ఇప్పటికే చివరిదశకు వచ్చేసింది. మరోవైపు క్రిష్ సినిమాను కూడా మొదలు పెట్టేసాడు పవన్.
ఇక హరీష్ శంకర్ బ్యాలెన్స్. ఇవి అయిపోయిన తర్వాత డాలి సినిమా ఉండబోతుంది. పవన్ కళ్యాణ్ ఇదివరకే వెంకటేష్ కలిసి గోపాల గోపాల సినిమాలో నటించాడు. ఇప్పుడు రవితేజతో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. పేరుకు తమిళ రీమేక్ అయినా కూడా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కేవలం లైన్ మాత్రమే తీసుకొని మిగిలిన కథ మొత్తం కొత్తగా రాసుకుంటున్నాడు డాలి. మొత్తానికి ఈ క్రేజీ మల్టీస్టారర్ సెట్ అయితే పవన్, రవితేజ అభిమానులకు అంతకంటే కావల్సింది మరొకటి లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pawan kalyan, Ravi Teja, Telugu Cinema, Tollywood