అసలే ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ కావడంతో ఇప్పుడు నందమూరి అభిమానులు బాధలో ఉన్నారు. దానికితోడు ఆ సినిమాపై రోజుకొకరు చేస్తున్న విమర్శలతో చచ్చిన పామును మరింతగా చంపుతున్నట్లు అవుతుంది. ఈ సినిమాలో అన్నీ అబద్ధాలు చూపించారంటూ ఇప్పటికే నాదెండ్ల భాస్కరరావు ఆరోపించారు. ఆ తర్వాత లక్ష్మీ పార్వతి కూడా ఇదే చెప్పింది. ఇక వర్మ అయితే భజన చేస్తే బయోపిక్స్ ఆడవంటూ ఓ సంచలన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఈ జాబితాలో మరో వ్యక్తి కూడా చేరిపోయాడు.
ఎన్టీఆర్ అల్లుడు.. చంద్రబాబు తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేసాడు. తాను ముందు కథానాయకుడు సినిమా చూసానని.. కథ పరంగా పూర్తి న్యాయం చేసినట్లు అనిపించిందని చెప్పాడు ఈయన. అయితే ఈ సినిమా ఎందుకు ఆడలేదో అర్థం కాలేదని దగ్గుపాటి చెప్పాడు. అయితే ఇది ఇలా ఉంటే అతి కీలకమైన మహానాయకుడు సినిమాపై ఈయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. ఈ చిత్రంలో కొన్ని లేని సన్నివేశాలు ఉన్నట్లుగా చూపించడం ఆశ్చర్యంగా అనిపించిందని చెప్పాడు దగ్గుపాటి.
సినిమాలో క్లైమాక్స్ ముందు ట్రైన్‌లో ఎమ్మెల్యేలంతా ఢిల్లీ వెళ్తుంటే ఎవరో వచ్చి అడ్డుకున్నట్లు.. వాళ్లను లాక్కెళ్లడానికి ప్రయత్నించినట్లు.. అప్పుడు చంద్రబాబు అడ్డు పడ్డట్లు చూపించారు. కానీ అవన్నీ అప్పుడు జరగలేదని.. ఆ సమయంలో నేను ట్రైన్‌లోనే ఉన్నట్లు వెంకటేశ్వరరావు చెప్పాడు. దాంతో పాటు రామకృష్ణ స్టూడియోకు వచ్చిన ఎమ్మెల్యేలంతా స్వచ్ఛందంగా వచ్చారని.. వాళ్లను తీసుకెళ్లడానికి ఎవరూ ప్రయత్నించలేదని.. కానీ సినిమాలో మాత్రం వాళ్లను ఏదో ఎవరో వెంటాడుతున్నట్లు చూపించారని చెప్పాడు దగ్గుపాటి.
అప్పట్లో ఎమ్మెల్యేలు బయటకు వెళ్లేవాళ్లు.. సినిమాలు చూసేవాళ్లు.. ఎంజాయ్ చేసేవాళ్లు.. అసలు తాను మాటల్లో చెప్పలేని ప్రదేశాలకు కూడా ఎమ్మెల్యేలు వెళ్లొచ్చారని చెప్పాడు ఈయన. కానీ సినిమాలో వాళ్లనేదో బంధించినట్లు చూపించారని.. అది నిజం కాదని చెప్పాడు దగ్గుపాటి. సినిమాలో చంద్రబాబును హీరో చేయడానికి ప్రతీ సన్నివేశంలో డ్రామా పండించారు. దీనిపై దగ్గుపాటి వెంకటేశ్వరరావు సెటైర్లు వేసారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Chandrababu naidu, NTR Biopic, NTR Mahanayakudu, Telugu Cinema, Tollywood