సంక్రాంతి సినిమాల్లో మొదటగా విడుదలైన ‘కథానాయకుడు’ మూడు వారాలు పూర్తి చేసుకుంది. రెండో వారంలోకి వచ్చిన వెంటనే సినిమా పూర్తిగా నష్టాల పాలైపోయింది. ఇప్పటికే ఫుల్ రన్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ఫుల్ రన్‌లో కేవలం 23 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది ఎన్టీఆర్ కథానాయకుడు. బాలకృష్ణతో పాటు డిస్ట్రిబ్యూటర్లు.. దర్శకుడు క్రిష్‌కు కూడా ఇది ఘోర పరాభవమే. దీనికంటే వినయ విధేయ రామ సినిమా చాలా ఏరియాల్లో మంచి వసూళ్లు సాధించింది. కానీ మంచి టాక్ తెచ్చుకున్న కథానాయకుడు మాత్రం దారుణంగా పరాభవం పాలైంది. దీన్ని ఎలా విశ్లేషించుకోవాలో కూడా ఇప్పుడు దర్శక నిర్మాతలకు అర్థం కావడం లేదు.
ఎందుకు ఇంతగా తక్కువ వసూళ్లు వచ్చాయో అని తెలుసుకునే పనిలో పడ్డారు వాళ్లు. తెలుగు రాష్ట్రాల్లో కేవలం 19 కోట్లు మాత్రమే వసూలు చేసింది ‘కథానాయకుడు’. ఇక ఓవర్సీస్‌లో మరో 4 కోట్లు వచ్చాయి. ఎటు చూసుకున్నా కూడా ఇప్పుడు భారీ నష్టాల వైపు అడుగులేస్తుంది కథానాయకుడు. బయ్యర్లకు కనీసం 50 కోట్ల నష్టాలు తీసుకొస్తుంది ఈ చిత్రం. దాంతో ఇప్పుడు వాళ్లేం చేయాలో తెలియక భయంతో వణికిపోతున్నారు. అయితే నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను తానే ఆదుకునే కార్యక్రమం పెడుతున్నాడు బాలయ్య. అదెలా ఉన్నా కూడా చరిత్ర సృష్టిస్తుందనుకున్న సినిమా ఇలా చరిత్రలో కలిసిపోవడం మాత్రం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు.
‘కథానాయకుడు’ కలెక్షన్లు చూసిన తర్వాత ‘మహానాయకుడు’ పరిస్థితి ఎలా ఉండబోతుందో అని వాళ్లు ఇప్పట్నుంచే టెన్షన్ పడుతున్నారు. ఫిబ్రవరి 7న విడుదల చేయాలనుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు మరో రెండు వారాల పాటు వాయిదా పడినట్లు తెలుస్తుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 22న విడుదల కానుంది. అన్నట్లు కథానాయకుడు కూడా అమేజాన్ ప్రైమ్ వీడియోస్‌లో ఫిబ్రవరి 7న విడుదల కానుంది. తొలివారం ముగియగానే చాలా ఏరియాల్లో ఇప్పటికే సినిమా ఫుల్ రన్ కూడా ముగిసింది. మొత్తానికి అన్నగారి సినిమా జీవితం పెద్దగా వర్కవుట్ కాలేదు.. మరి వివాదాస్పదంగా ఉన్న రాజకీయ జీవితం అయినా కాసులు కురిపిస్తుందో లేదో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Box Office Collections, NTR Biopic, Telugu Cinema, Tollywood