ఒకే ఒక్క సినిమాతో ఉన్న ఇమేజ్ మొత్తం పాడు చేసుకున్నాడు దర్శకుడు క్రిష్. ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించడం ఈయన అదృష్టమనే ముందు అంతా అనుకున్నారు. కానీ అదే ఆయన దురదృష్టం అని తెలియడానికి కొన్ని రోజులు పట్టింది. ఎన్టీఆర్ లాంటి మహానాయకుడు జీవితాన్ని కేవలం 90 రోజుల్లోనే తెరకెక్కిస్తే ఎంత అద్భుతమైన దర్శకుడు అంటూ క్రిష్ ను నెత్తిన పెట్టుకున్నారు. కానీ సీన్ రివర్స్ కావడానికి ఎన్నో రోజులు పట్టలేదు. కథానాయకుడుని మించి ఇప్పుడు మహానాయకుడు డిజాస్టర్ కావడంతో క్రిష్ దర్శకత్వ ప్రతిభ పైనే అందరికీ అనుమానాలు వస్తున్నాయి.
నిజానికి తనకు ఇచ్చిన బాధ్యతను క్రిష్ నూటికి నూరు శాతం పూర్తి చేశాడు. కానీ సినిమాలో అంతకంటే ఎక్కువ విషయం లేనప్పుడు దర్శకుడు మాత్రం ఏం చేయగలడు.. దానికి తోడు బాలకృష్ణ అడుగడుగునా ఎన్టీఆర్ బయోపిక్ ను శాసించాడని తెలుస్తోంది. ప్రతి విషయంలోనూ తన తండ్రిని పాజిటివ్ గా చూపించాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క నెగిటివ్ కూడా ఉండకూడదని అల్టిమేటం పెట్టడంతో తనకున్న పరిధిలోనే ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించాడు క్రిష్.
తీరా అది విడుదలైన తర్వాత ఇప్పుడు చరిత్రలో నిలిచిపోయే డిజాస్టర్‌గా మారిపోయింది. దాంతో అనవసరంగా ఇప్పుడు ఈ దర్శకుడిని అందరూ బలి చేస్తున్నారు. మణికర్ణిక సినిమా చేజారిపోయి.. ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్ బయోపిక్ కూడా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు ఎటు వెళుతుందో తెలియని సందిగ్ధంలో పడిపోయింది క్రిష్ కెరీర్. ఇప్పటికిప్పుడు అర్జంటుగా ఒక సినిమా తీసి బ్లాక్ బస్టర్ ఇస్తే కానీ ఈ దర్శకుడు ఉన్న సంగతి ప్రేక్షకులు గుర్తించేలా కనిపించడం లేదు. మరి ఇలాంటి సమయంలో క్రిష్ ఎలాంటి సినిమాతో వస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Krish, NTR Biopic, NTR Mahanayakudu, Telugu Cinema, Tollywood