నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తన తండ్రి మహానటుడు ‘ఎన్టీఆర్’ జీవిత చరిత్రపై ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు వేరే నిర్మాతలు అయితే ఈ సినిమాను సరిగా నిర్మిస్తారో లేదో అన్న కారణంగా ఈ సినిమాతో స్వయంగా బాలయ్య నిర్మాత అవతారం ఎత్తి..తన తండ్రి పాత్రలో నటిస్తూ ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించాడు.
ఇక ఎన్టీఆర్ సినీ జీవితం నేపథ్యంలో తెరకెక్కిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో ఎమోషన్ కంటెంట్ లేకపోవడం..సినిమా మొత్తం అన్నగారిని ఒక దేవుడిలా చూపించడం మాములు జనాలకు కాస్తా అతిగా కనిపించింది. దీంతో ఈ సినిమా అనుకున్న రేంజ్‌లో వసూళ్లను సాధించలేకపోయింది. కానీ రెండో పార్టు ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ రిజల్ట్ మాత్రం అంతకు మించి వుంది. ఈ సినిమా ఫ్లాపైన సంగతి పక్కనపెడితే కొన్ని చోట్ల థియేటర్స్ రెంట్స్ రాబట్టలేని దారుణమైన ఫలితాలను నమోదు చేసినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
మాములుగా బాలయ్య ఏ సినిమా చేసినా..తన వంతు బాధ్యత నిర్వహిస్తుంటారు. శక్తి మేర తనవంతు కష్టపడతారు. సినిమా ఫలితాన్ని బాలయ్య చాలా తేలికగా తీసుకుంటారు. కానీ తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ ఫలితం మాత్రం బాలయ్యను తీవ్ర నిరాశకు గురిచేసినట్టు ఆయన సన్నిహితుల వర్గాలు చెబుతున్నాయి. అసలు ఎన్టీఆర్ బయోపిక్‌ను రెండు భాగాలుగా తెరకెక్కించడం బాలయ్య, క్రిష్‌లు చేసిన పెద్ద మిస్టేక్ అని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలతో పాటు కామన్ ఆడియన్స్ చెబుతున్నారు.
‘కథానాయకుడు’ సినిమాను సాగితీతగా తెరకెక్కించిన క్రిష్..‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాను కేవలం రెండు గంటల్లో ముగించాడు. కథానాయకుడుతో పోల్చితే..‘ఎన్టీఆర్ మహానాయకుడు’లో ఎమోషన్ పాలు ఎక్కువగా ఉన్న..ఇందులో చంద్రబాబును హైలెట్ చేస్తూ..నాదెండ్ల భాస్కరరావును విలన్‌గా చూపించడం..అంతేకాదు సినిమా మొత్తంగా టీడీపీ కరపత్రంలా ఉందనే టాక్ ఉండటంతో ఈ సినిమాను చూసే వాళ్లే కరువయ్యారు.
దాంతో బాలయ్య...ఎన్టీఆర్ బయోపిక్‌కు ఎందుకిలా జరిగింది అనే విషయమై తన అభిమానులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అన్నిఏరియాల్లో ఉన్న అభిమాన సంఘాల అథ్యక్షులను కలిసి ఈ అంశంపై చర్చించనున్నట్టు సమాచారం.
ఎన్టీఆర్ బయోపిక్ ఎందుకు డిజాస్టర్‌గా నిలిచిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. అసలు ఈ సినిమా ఫెయిల్ అవ్వడానికి దారితీసిన పరిస్థితులు, ప్రజలు అ సినిమా గురించి ఏమనుకుంటున్నారు అనేది
ఈ మీటింగ్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నట్టు సమాచారం. అంతేకాదు త్వరలో బోయపాటి శ్రీనుతో చేయబోయే సినిమాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయమై అభిమానులతో చర్చించనున్నట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, NTR, NTR Biopic, NTR Mahanayakudu, Telugu Cinema, Tollywood