హోమ్ /వార్తలు /సినిమా /

Bigg Boss 4 Gangavva: బిగ్ బాస్ లోకి ఇలా వెళ్లాను.. నా అనారోగ్యానికి కారణమిదే.. గంగవ్వతో News18 ముచ్చట

Bigg Boss 4 Gangavva: బిగ్ బాస్ లోకి ఇలా వెళ్లాను.. నా అనారోగ్యానికి కారణమిదే.. గంగవ్వతో News18 ముచ్చట

గంగవ్వ (Twitter: StarMaa)

గంగవ్వ (Twitter: StarMaa)

Bigg Boss 4 Gangavva: హౌస్ లో అనారోగ్యానికి గురై బాధపడ్డ గంగవ్వ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఆమె గ్రామస్తుల స్పందన ఏమిటి? తదితర అంశాలపై న్యూస్18 తో గంగవ్వ ప్రత్యేకంగా ముచ్చటించింది.

(ఏ. వెంకటేశ్వరరావు, కరస్పాండెంట్, న్యూస్‌18)

మై విలేజ్ షో తో ప్రపంచానికి పరిచయమైన గంగవ్వ అనతి కాలంలోనే లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకుంది. సమంత, మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ లను తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేసిన గంగవ్వ సినీ పరిశ్రమలోనూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. అనూహ్యంగా బిగ్ బాస్ షోలో అడుగుపెట్టి అందరికీ షాక్ ఇచ్చిన ఈ అమ్మ హౌస్ లో ఇమడలేక తనంతట తానుగా ఎలిమినేట్ అవ్వాలని ప్రయత్నించినప్పటికీ ప్రేక్షకులతో పాటు బిగ్ బాస్ కూడా మొదట అంగీకరించలేదు. కన్నీళ్ళతో గంగవ్వ అభ్యర్థించండంతో కరిగిపోయిన బాస్ హౌస్ నుండి రిలీజ్ చేశారు. ప్రస్తుతం తను ఏం చేస్తోంది? తన డ్రీమ్ అయిన ఇంటి పనులు ఎంతవరకు వచ్చాయి? హౌస్ లో అనారోగ్యానికి గురై బాధపడ్డ గంగవ్వ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఆమె గ్రామస్తుల స్పందన ఏమిటి? తదితర అంశాలపై న్యూస్18 తో గంగవ్వ ప్రత్యేకంగా ముచ్చటించింది. గంగవ్వ ఏమన్నారో ఆమె మాటల్లోనే..

కలలో కూడా అనుకోలె..

మై విలేజ్ షో తో సరదాగా కెమెరా ముందుకు వచ్చాను. కానీ బిగ్ బాస్ లాంటి గొప్ప షో లో పాల్గొంటానని కలలో కూడా ఊహించలేదు. తొలుత వాళ్ళు నన్ను సంప్రదించి విషయం చెప్పినపుడు సందేహించాను. కానీ మా విలేజ్ షో బృందం ప్రోత్సహించడం తో ఓకే చెప్పాను. ఆటలు ఎలా ఆడాలో నాకు అవగాహన కల్పించారు. అయితే తీరా అక్కడికి వెళ్ళాక అంతా కొత్తగా అన్పించింది. మొదటి రెండు మూడు రోజులు నాకేమీ అర్థం కాలేదు. తర్వాత ఎలా ఉండాలో గ్రహించాను. చివరి వరకు హౌస్ లో వుండి టైటిల్ కొట్టాలనే పట్టుదల పెరిగింది. అందుకు తగ్గట్టుగా మారాను. ప్రేక్షకులు కూడా నన్ను ఎంతగానో అభిమానించారు. కానీ పూర్తి గ్రామీణ వాతావరణంలో స్వచ్ఛమైన గాలి పీల్చుకుని, మట్టి మనుషుల మధ్య బతికిన నాకు అక్కడి వాతావరణం ఒంటికి పడలేదు. హౌస్ లో ఉన్న వాళ్లంతా నన్ను ఒక అమ్మలా చూసుకున్నారు. ఆటలో భాగంగా చిన్న చిన్న గొడవలు అంతే.. వాళ్లంతా నా పిల్లల లాంటి వారు.

అయినప్పటికీ అక్కడి వాతావరణం అనుకూలంగా లేక అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఇంకా కొన్ని రోజులు అక్కడే వుంటే ఆరోగ్యం పూర్తిగా విషమిస్తుందనే భయంతో సరిగా నిద్ర కూడా పట్టలేదు. అందుకే హౌజ్ నుంచి బయటకి రావడానికి ప్రయత్నించాను. కానీ బిగ్ బాస్ కు నాపై ఉన్న ప్రేమ, ప్రేక్షకుల అభిమానం అందుకు అడ్డుకట్ట వేసింది. నా అనారోగ్య లక్షణాలు గమనించి పెద్ద డాక్టర్లతో చికిత్స చేయించారు. శరీరానికి పట్టిన వ్యాధి తగ్గినప్పటికీ మనసులో ఆందోళన అలాగే ఉండి పోయింది. అంతే కాదు... నా కుటుంబ సభ్యులపై బెంగ మొదలైంది. ఇక ఉండలేక పోయా. బిగ్ బాస్ ను కన్నీళ్ళతో వేడుకుంటే అయిష్టంగానే నన్ను బయటికి రావడానికి అవకాశం ఇచ్చారు. బయటి ప్రపంచంలో అడుగు పెట్టాక మనసు కుదుటపడింది.

కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నా

చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు అనుభవించా. కన్నీళ్ళ మధ్యనే జీవితం గడిచింది. దేవుడికి ఎందుకు కరుణ కలిగిందో తెలియదు కానీ మై విలేజ్ షో ద్వారా కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ప్రేక్షకులు ఆదరించడం మొదలు పెట్టాక జీవితంలో ఆనందం మొదలైంది. ఎక్కడికి వెళ్ళినా అందరు తమ సొంత కుటుంబ సభ్యురాలిగా ఆదరిస్తున్నారు. అందుకు కారణం.. మై విలేజ్ షో టీమ్. వాళ్ళు లేకపోతే నేను లేను.ఈ టీమ్ లో ఉన్న వాళ్ళంతా నా బిడ్డల లాంటోళ్లు. దేవుడిచ్చిన పిల్లలు అనే అంటాను.అయితే నా కొడుకు గురించిన బెంగ పట్టుకుంది. ఇప్పటికీ మేము చిన్న పూరిల్లు లో నివసిస్తున్నాం.

సొంత ఇంటి కోసం ముప్పై ఏళ్లుగా కష్టాలు పడుతున్నా. కానీ కుటుంబం తినడానికే సరిపోతోంది. సొంత ఇంటి కల ఇక మర్చిపోవాలని అనుకున్నా. కానీ ఆ దేవుడు బిగ్ బాస్ రూపంలో వరం ఇచ్చాడు. నాకు ఇల్లు కట్టిస్తామని బిగ్ బాస్ మాటిచ్చారు. ఆ మాట విన్నప్పుడు కోటి దేవుళ్ళకు మనసులో దండం పెట్టుకున్నా. అతి త్వరలో లంవాడిపల్లి లొ కానీ, జగిత్యాలలో కానీ నేను కోరుకున్న చోట నాకు ఇల్లు కట్టించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ ఇల్లు ఎప్పుడు పూర్తి అవుతుందా? ఆ ఇంటి మీద నా పేరు, బిగ్ బాస్ పేరు, మై విలేజ్ షో టీమ్ పేరు రాయించి ఎపుడెపుడు ఆ ఇంట్లో చేరుదామా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నా.

First published:

Tags: Big boss telugu, Gangavva

ఉత్తమ కథలు