"నీవెవ‌రో" మూవీ రివ్యూ..

"నీవెవ‌రో" మూవీ రివ్యూ..

నీవెవరో మూవీ రివ్యూ

ఒక విచిత్రంతో ప్ర‌యాణం మొద‌లుపెట్టి.. విచిత్రంగా త‌మిళ ఇండ‌స్ట్రీకి వెళ్లి.. మ‌ళ్లీ స‌రైనోడు.. రంగ‌స్థ‌లం.. నిన్నుకోరి లాంటి సినిమాల‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు ఆది పినిశెట్టి. అయితే త‌మిళనాట విజ‌యం సాధించినా కూడా సొంత భాష‌లో గుర్తింపు కోసం పాకులాడుతున్నాడు ఈ హీరో.

 • Share this:
  రివ్యూ: నీవెవ‌రో
  న‌టీన‌టులు: ఆది, తాప్సీ, రితికా సింగ్, వెన్నెల కిషోర్, శివాజీ రాజా త‌దిత‌రులు
  రేటింగ్: 2.25/5
  నిడివి: 138 నిమిషాలు
  సంగీతం: అచ్చు మ‌రియు ప్రాస‌న్
  సినిమాటోగ్ర‌ఫీ: సాయి శ్రీ‌రామ్
  నిర్మాతలు: ఎంవివి స‌త్య‌నారాయ‌ణ‌, కోన కార్పోరేష‌న్
  ద‌ర్శ‌కుడు: హ‌రినాథ్

  ‘ఒక విచిత్రం’తో ప్ర‌యాణం మొద‌లుపెట్టి.. విచిత్రంగా త‌మిళ ఇండ‌స్ట్రీకి వెళ్లి.. మ‌ళ్లీ ‘స‌రైనోడు’.. ‘రంగ‌స్థ‌లం’.. ‘నిన్నుకోరి’ లాంటి సినిమాల‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు ఆది పినిశెట్టి. త‌మిళనాట విజ‌యం సాధించినా కూడా సొంత భాష‌లో గుర్తింపు కోసం పాకులాడుతున్నాడు ఈ హీరో. ఇక ఇప్పుడు ‘నీవెవ‌రో’ అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. మ‌రి ఈయ‌న కోరిక‌ను ఈ సినిమా ఎంతవ‌ర‌కు తీర్చింది..?

  క‌థ‌:
  క‌ళ్యాణ్(ఆది పినిశెట్టి) అంధుడు. కానీ అద్భుత‌మైన వంట‌గాడు. సిటీలో ఓ రెస్టారెంట్ న‌డుపుతుంటాడు. క‌ళ్యాణ్ అంటే ప‌డి చచ్చిపోయే అమ్మాయి అను(రితికా సింగ్). ఇద్ద‌రికి పెళ్లి చేయాల‌ని ఇరు కుటుంబాల అనుకుంటాయి. స‌రిగ్గా అదే స‌మ‌యంలో క‌ళ్యాణ్ జీవితంలోకి వెన్నెల‌(తాప్సీ) వ‌స్తుంది. క‌ళ్లు లేని క‌ళ్యాణ్ ను ప్రేమిస్తున్నానని చెబుతుంది. కానీ అనుకోకుండా మెరుపులా వ‌చ్చి క‌ళ్యాణ్ జీవితంలోంచి వెళ్లిపోతుంది వెన్నెల‌. అప్ప‌ట్నుంచి పిచ్చోడిలా ఆమె కోస‌మే తిరుగుతుంటాడు క‌ళ్యాణ్. ఆ క్ర‌మంలోనే వెన్నెల గురించి కొన్ని సంచ‌ల‌న విష‌యాలు తెలుస్తాయి. అస‌లు ఈ వెన్నెల ఎవ‌రు.. ఎందుకు ఈయ‌న జీవితంలోకి వ‌స్తుంది అనేది అస‌లు క‌థ‌..

  విశ్లేష‌ణ‌:
  హీరోలో లోపం ఉన్న క‌థ‌లు ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో చాలానే వ‌స్తున్నాయి. ఒక‌ప్పుడు అంటే హీరో అంటే హీరోలాగే ఉండాలి.. అత‌డు ఆంజ‌నేయుడు త‌మ్ముడంత బ‌ల‌వంతుడై ఉండాలి అనుకునే వాళ్లు కానీ ఇప్పుడు మ‌న హీరోలు కూడా మారిపోయారు. ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా హీరోల‌కు లోపం ఉన్న క‌థ‌లే వ‌స్తున్నాయి. రాజా ది గ్రేట్.. అంధ‌గాడు.. రంగ‌స్థ‌లం.. ఊపిరి లాంటి సినిమాల్లో హీరోలు ఇలాగే లోపం ఉన్న వాళ్లుగానే న‌టించారు. ఇప్పుడు నీవెవ‌రోలో కూడా ఆది అంధుడిగా న‌టించాడు. అయితే హీరోలో లోపం ఉంటే ప‌ర్లేదు కానీ ఇక్క‌డ క‌థ‌లో కూడా లోపం క‌నిపిస్తుంది. రొటీన్ క‌థ కావ‌డంతో ఆస‌క్తిక‌ర‌మైన మ‌లుపులు లేకుండా సాగిపోయింది క‌థ‌.
  ఫ‌స్టాఫ్ లో ఎక్క‌డా చెప్పుకోద‌గ్గ ఆస‌క్తి క‌ర‌మైన అంశాలు క‌నిపించ‌లేదు. హీరో హీరోయిన్ మ‌ధ్య ప్రేమ‌ను కూడా స‌రిగ్గా చూపించ‌లేక‌పోయాడు ద‌ర్శ‌కుడు. వాళ్ల మ‌ధ్య ఏం జ‌రుగుతుందో.. అస‌లు తాప్సీ ఎక్క‌డ్నుంచి ఎందుకు వ‌స్తుందో ఎవ‌రికీ అర్థం కాదు. అలా వ‌స్తుంది.. రాత్రిపూట రోజూ హీరోతో కాసేపు రోడ్డుమీద న‌డుస్తుంది.. అంత‌లోనే మాయ‌మైపోతుంది.. ఇదే ఫ‌స్టాఫ్ లో స‌గానికి పైగా ఉంటుంది. అక్క‌డ ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించే సీన్ ఉండ‌దు.
  ఇంట‌ర్వెల్ వ‌ర‌కు కూడా ఎక్క‌డ వేసిన గొంగ‌లి అక్క‌డే అన్న‌ట్లు క‌ద‌ల‌కుండా ఉంటుంది క‌థ‌. ఆది జీవితంలోంచి తాప్సీ వెళ్లిన త‌ర్వాత కూడా క‌థ‌లో చ‌ల‌నం ఉండ‌దు. సెకండాఫ్ లో ఏం చేయాలో తెలియ‌క ద‌ర్శ‌కుడు వెన్నెల కిషోర్ సాయం తీసుకున్నాడు. ప్ర‌తీ సీన్ లో ఆయ‌న్ని చూపించి.. పూర్తిగా కామెడీ వ‌ర్క‌వుట్ చేసే ప్ర‌య‌త్నం చేసాడు. కానీ అది కూడా పెద్దగా ఫ‌లించ‌లేదు. అక్క‌డ‌క్క‌డా పంచ్ డైలాగులు ప‌డ్డాయి కానీ అంత‌గా న‌వ్వించే సీన్స్ అయితే ఎక్క‌డా లేవు. అటు స‌స్పెన్స్ లేక‌.. ఇటు ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నం లేక‌.. హీరో హీరోయిన్ల మ‌ధ్య సరైన లవ్ ట్రాక్ లేక‌.. అన్నీ స‌గంస‌గంలోనే ఆగిపోయింది నీవెవ‌రో. ఎప్పుడూ అబ్బాయిల చేతిలో అమ్మాయిలే మోస‌పోతుంటారు క‌దా.. ఇక్క‌డ మాత్రం అమ్మాయి చేతిలో అబ్బాయి మోస‌పోతుంటాడు.. ఇదొక్క‌టే ఈ సినిమాలో ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నం. కానీ దాన్ని కూడా స‌రిగ్గా తెర‌పై ప్ర‌జెంట్ చేయ‌లేక‌పోయాడు కొత్త ద‌ర్శ‌కుడు హ‌రినాథ్.

  న‌టీన‌టులు:
  ఆది పినిశెట్టి బాగానే చేసాడు. అంధుడిగా అద్భుతంగా న‌టించాడు. కానీ ఆయ‌న గ‌త సినిమాల‌తో పోలిస్తే మాత్రం ఇందులో న‌టించే స్కోప్ లేని పాత్ర ఇది. పైగా క‌థ కూడా రొటీన్ కావ‌డంతో ఈయ‌న కారెక్ట‌ర్ కూడా పెద్ద‌గా పేలలేదు. తాప్సీకి మాత్రం ఈ సినిమా ప్ర‌త్యేకం. ఇన్నాళ్లు కేవ‌లం హీరోయిన్ గా న‌టిస్తూ వ‌చ్చిన ఈ భామ‌.. నీవెవ‌రోలో మాత్రం కొత్త‌గా ట్రై చేసింది. రితికా సింగ్ ప‌ర్లేదు. వెన్నెల కిషోర్ సెకండాఫ్ అంతా మోసాడు. తుల‌సి.. శివాజీరాజా.. స‌త్య‌కృష్ణ‌ణ్ ప‌ర్లేదు.

  టెక్నిక‌ల్ టీం:
  అచ్చు సంగీతం ప‌ర్లేదు. పెళ్లిపాట ఒక‌టి బాగుంది.. వెన్నెల వెన్నెల అంటూ సిద్ శ్రీ‌రామ్ పాడిన పాట కూడా బాగుంది. సినిమాటోగ్ర‌ఫీ ప‌ర్లేదు. సాయి శ్రీ‌రామ్ త‌న‌వంతు ప్ర‌య‌త్నం అయితే చేసాడు. ఎడిటింగ్ వీక్ అనిపించింది. చాలాచోట్ల క‌థ నెమ్మ‌దిగా సాగింది. ద‌ర్శ‌కుడిగా హ‌రినాథ్ డ్రీమ్ డెబ్యూ అయితే కాదు. ఆది లాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ దొరికినా కూడా వాడుకోలేక‌పోయాడు. కోన‌వెంక‌ట్ మార్క్ కూడా సినిమాలో మిస్ అయింది.

  చివ‌ర‌గా ఒక్క‌మాట‌:
  నీవెవ‌రో.. క‌థ ఏంటో.. ఆ కంగారేంటో..?
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  అగ్ర కథనాలు