Nayanthara: ఓ వైపు కమర్షియల్ సినిమాలు, మరోవైపు లేడి ఓరియెంటెడ్ సినిమాలుచేస్తూ బిజీబిజీగా గడిపేస్తున్నారు దక్షిణాది లేడి సూపర్ స్టార్ నయనతార. ప్రస్తుతం ఈ నటి ప్రముఖ దర్శకుడు మిలింద్ రావ్ దర్శకత్వంలో నెట్రికాన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. నయనతార 65వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ మూవీని నయన్ లవర్ విఘ్నేష్ శివన్ నిర్మిస్తున్నారు. ఇందులో నయనతార అంధురాలిగా కనిపిస్తున్నారు. ఆ మధ్యన నయన్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి విడుదలైన స్పెషల్ టీజర్ అందరినీ తెగ ఆకట్టుకుంది. అందులో అంధురాలిగా నయన్ వావ్ అనిపించింది. ఇక ఈ మూవీ నుంచి తాజాగా మరిన్ని స్టిల్స్ విడుదల అయ్యాయి. అందులో ఎలాంటి మేకప్ లేకుండా నయన్ అదరగొట్టేస్తోంది. వీటిని చూసిన అభిమానుల్లో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
మొత్తానికి ఈ స్టిల్స్ ను చూస్తుంటే నయన్ ఖాతాలో మరో హిట్ పడే అవకాశం కనిపిస్తోంది. ఇక నెట్రికాన్ మూవీతో పాటు నయనతార మలయాళంలో నిళల్ అనే చిత్రంలో నటించింది. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగా విడుదలకు సిద్ధంగా ఉంది.
అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధానపాత్రలో శివ తెరకెక్కిస్తోన్న అన్నాత్తే మూవీలో నయన్ నటిస్తోంది. వీటితో పాటు విజయ్ సేతుపతి హీరోగా విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తోన్న కాటువాకుల రెండు కాదల్ అనే చిత్రంలో నయన్ నటించనుంది. ఈ మూవీలో మరో హీరోయిన్ గా సమంత నటిస్తుండగా.. తొలిసారిగా నయన్, సమంత కలిసి నటించబోతున్నారు.