నాని ఇప్పుడు నిజంగానే విలన్ అవుతున్నాడు. వరసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈయనకు ఇప్పుడు ప్రతినాయకుడిగా నటించాల్సిన అవసరం ఏమొచ్చింది అనుకుంటున్నారా..? కథ కుదిరినపుడు విలన్ కావడంలో తప్పేం లేదని చిరంజీవి, ఎన్టీఆర్, బాలకృష్ణ లాంటి హీరోలే నిరూపించారు ఇప్పుడు నాని కూడా ఇదే చేయబోతున్నాడు. అందులోనూ తన సినిమాలో తను విలన్ అయిపోయి.. మరో హీరో హీరోగా నటించబోతుండటం విశేషం. అన్నింటికి మించీ 25వ సినిమాలో విలన్ పాత్ర పోషించబోతున్నాడని తెలుస్తుంది.
ఏంటి అప్పుడే నాని 25వ సినిమా దగ్గరికి వచ్చేసాడా..? ఆయన ఎప్పుడొచ్చాడు.. ఎప్పుడు పాతిక సినిమాలు పూర్తి చేసాడు అనుకుంటున్నారా.. ఇదే షాక్లో ఉండగానే ఇప్పుడు నిజంగానే నాని సినిమాల లెక్క 25కు చేరువైంది. ఇప్పటికే ఈయన 22 సినిమాలు పూర్తి చేసాడు. ప్రస్తుతం 23వ సినిమా ‘జెర్సీ’తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత విక్రమ్ కే కుమార్తో చేయబోయేది 24వ సినిమా. ఈ రెండు సినిమాలు ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇప్పటికే జెర్సీ షూటింగ్ పూర్తైపోయింది. ఎప్రిల్ 19న విడుదల కానుంది ఈ చిత్రం.
ఇందులో క్రికెటర్గా నటిస్తున్నాడు ఈయన. మరోవైపు విక్రమ్ కే కుమార్ సినిమాలో పూర్తిగా కొత్త పాత్రలో నటించబోతున్నాడు న్యాచురల్ స్టార్. ఇదిలా ఉంటే ఇప్పుడు 25వ సినిమా గురించి ఇప్పట్నుంచే ప్లాన్ చేసుకుంటున్నాడు నాని. ఈయన్న ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలోనే 25వ సినిమా చేయబోతున్నాడు నాని. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నాడు. ఆగస్ట్ నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తుంది.
ఇప్పటికే దిల్ రాజు కాంబినేషన్ లో ‘నేను లోకల్’, ‘ఎంసిఏ’ లాంటి సూపర్ హిట్స్ ఇచ్చాడు నాని.. మరోవైపు ‘అష్టాచమ్మా’, ‘జెంటిల్ మెన్’ సినిమాల తర్వాత ఇంద్రగంటితో నాని చేయబోయే సినిమా ఇది. ఈ సినిమాలో నాని విలన్ అయితే.. సుధీర్ బాబు హీరోగా నటించనున్నాడు. జెంటిల్ మెన్ సినిమాలో కాసేపు నెగిటివ్ ఛాయలున్నట్లు నటించినా కూడా అది చివరికి హీరో అయిపోయింది. అయితే ఈ సారి మాత్రం నెగిటివ్ రోల్ చేయడానికి సరే అన్నట్లు తెలుస్తుంది. అదంతా ఇంద్రగంటిపై నానికి ఉన్న నమ్మకమే. మరి న్యాచురల్ స్టార్ విలన్ వేషాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Dil raju, Jr ntr, Nani, Telugu Cinema, Tollywood