Tuck Jagadish movie review: ‘టక్ జగదీష్’ రివ్యూ.. నాని కూడా మోయలేకపోయిన రొటీన్ ఫ్యామిలీ డ్రామా..

టక్ జగదీష్ రివ్యూ (Tuck Jagadish review)

Tuck Jagadish movie review: గతేడాది సెప్టెంబర్ 5న ఓటిటిలో వి (V) సినిమాతో వచ్చాడు నాని (Nani). అది ఆయనకు 25వ సినిమా. మళ్లీ ఏడాది తర్వాత పరిస్థితులు మారలేదు. నాని నిర్ణయం కూడా మారలేదు. అందుకే మరోసారి ఓటిటిలోనే వచ్చాడు. ఈ సారి టక్ జగదీష్ (Tuck Jagadish) సినిమాతో అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. నాని నటించిన టక్ జగదీష్ సినిమాపై ముందు నుంచి కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఈ చిత్రం అంచనాలు ఎంతవరకు అందుకుందో చూద్దాం..

  • Share this:
నటీనటులు: నాని, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్, జగపతిబాబు, నాజర్, రోహిణి , ప్రవీణ్, డేనియల్ బాలాజీ, తిరువీర్ తదితరులు
సంగీతం: థమన్
నేపథ్య సంగీతం: గోపీ సుందర్
సినిమాటోగ్రఫర్: ప్రసాద్ మూరెళ్ళ
ఎడిటర్: ప్రవీణ్ పూడి
నిర్మాతలు: సాహు గరపాటి,
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకుడు: శివ నిర్వాణ

గతేడాది సెప్టెంబర్ 5న ఓటిటిలో వి (V) సినిమాతో వచ్చాడు నాని (Nani). అది ఆయనకు 25వ సినిమా. మళ్లీ ఏడాది తర్వాత పరిస్థితులు మారలేదు. నాని నిర్ణయం కూడా మారలేదు. అందుకే మరోసారి ఓటిటిలోనే వచ్చాడు. ఈ సారి టక్ జగదీష్ (Tuck Jagadish) సినిమాతో అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. నాని నటించిన టక్ జగదీష్ సినిమాపై ముందు నుంచి కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఈ చిత్రం అంచనాలు ఎంతవరకు అందుకుందో చూద్దాం..

కథ:
భూదేవిపురంలో భూ తగాదాలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఊరి పెద్ద ఆదిశేషు నాయుడు (నాజర్) వాటిని రూపుమాపాలని చాలా ప్రయత్నిస్తుంటాడు. ఆయనకి ఇద్దరు భార్యలు. మొదటి భార్య చనిపోతుంది. మొదటి భార్యకు ఇద్దరు కూతుళ్ళు (రోహిణి, దేవదర్శిణి చేతన్).. మొదటి భార్యకు బోసు (జగపతి బాబు), జగదీష్ (నాని) సంతానం ఉంటారు. అంతా కలిసే ఉంటారు. అయితే పెద్దాయన చనిపోయిన తర్వాత బోసులో మరో కోణం బయటికి వస్తుంది. తమ ఆస్తి చినభార్య పిల్లలు అనుభవిస్తున్నారని.. బోసు అందర్నీ బయటికి పొమ్మంటాడు. అదే ఊళ్లో విఆర్‌వోగా పని చేస్తుంది గుమ్మడి వరలక్ష్మి (రీతూ వర్మ). ఆమెకు, టక్ జగదీష్‌కు మధ్య ప్రేమ నడుస్తుంది. ఇవన్నీ ఇలా ఉంటే ఆ ఊరిలో వీరేంద్ర నాయుడు (డేనియల్ బాలాజి) అనే ఓ పెద్ద మోతుబరి ఉంటాడు. రైతుల భూములు లోకల్ ఎమ్ఆర్‌ఓతో కలిసి కుమ్మక్కై లాక్కుంటాడు. ఆ భూముల్లో ఆదిశేషునాయుడు భూములు కూడా ఉంటాయి. వాటి కోసం బోసు వాళ్ళతో చేతులు కలుపుతాడు. అలాంటి సమయంలో తన కుటుంబాన్ని టక్ జగదీష్ ఎలా కాపాడుకున్నాడు అనేది అసలు కథ..

కథనం:
ఇప్పటి వరకు తెలుగులో ఎన్నో సినిమాల్లో చూసిన కథే టక్ జగదీష్. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే నాని ఈ విషయం చెప్పాడు. తమ సినిమాలో ఇప్పటి వరకు చెప్పని కథ చెప్తున్నాం.. కొత్తగా ఉంటుందని చెప్పట్లేదని.. తెలిసిన కథనే మరింత ఎమోషనల్‌గా చెప్పే ప్రయత్నం చేస్తున్నామని తెలిపాడు. నిన్ను కోరి, మజిలి లాంటి సినిమాలతో ఎమోషన్స్ బలంగా పలికిస్తాడనే పేరు తెచ్చుకున్న దర్శకుడు శివ నిర్వాణ.. తన దారి కాదనుకుని కమర్షియల్ యాక్షన్ జోనర్‌లోకి వచ్చి చేసిన సినిమా టక్ జగదీష్. హీరోకు టక్‌కు ఎలాంటి కనెక్షన్ ఉండదు. ఆయనకు టక్ ముట్టుకుంటే కోపం వస్తుందంతే. అందుకే ఆయనకు టక్ జగదీష్ అనే పేరు వస్తుంది. ఎప్పట్నుంచో తెలుగులో ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. ఆస్తి కోసం విడిపోయిన అన్నాదమ్ములు.. ఇద్దరు భార్యలు పిల్లలు.. వాళ్లను కలపడానికి హీరో చేసే ప్రయత్నాలు చాలా కాలంగా చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఇదే కథను మరోసారి కొత్త బాటిల్‌లో పోసి స్టైలిష్‌గా చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు శివ. ఈ ప్రయత్నంలో కొంతవరకు మాత్రమే సక్సెస్ అయ్యాడు ఈయన. విందు భోజనం చేద్దామని విస్తరు ముందు కూర్చున్న వాడికి.. పాచిపోయిన అన్నంలో వేడి పప్పు వేసి తిను అంటే ఎలా ఉంటుంది.. టక్ జగదీష్ అలాగే అనిపిస్తుంది. నిన్ను కోరి, మజిలీ లాంటి అద్భుతమైన సినిమాలు తీసిన శివ.. జోనర్ మార్చి తప్పు చేసాడు అనిపించింది. నాని ఈ టక్ జగదీష్ పాత్రలో తనకు తాను కొత్తగా ఊహించుకుని కథకు ఓకే అన్నాడేమో.. ఎందుకంటే నాని తప్ప ఇందులో ఏం లేదు. ఇంతకుముందు కూడా ఏమీ లేని కథలని.. అన్నీ తానై నడిపించాడు నాని. కానీ టక్ జగదీష్ లో ఆ ఛాన్స్ లేదు.
ఎందుకంటే ఎమోషన్స్ కంటే ఆస్తి గొడవలే ఎక్కువగా ఉన్నాయి ఈ సినిమాలో. ఓ పక్క ఫ్యామిలీ ఎమోషన్స్ అంటూనే.. మరోపక్క నరుక్కోవడాలు చూపించారు. ఫస్టాఫ్ లో నాని MROగా ఎంట్రీ సీన్.. సెకండాఫ్ లో పొలం ఫైట్ బాగున్నాయి. క్లైమాక్స్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్నాయి. ఇలా అక్కడక్కడా అనేలా తప్ప.. అంతా బాగుంది అని చెప్పలేని పరిస్థితి. ఎన్నో సినిమాల్లో వచ్చిన కథకు టక్ వేసి స్టైల్ గా తీసాడు శివ నిర్వాణ. బయట టక్ అయితే వేసాడు కానీ.. లోపల లోపాలు వదిలేసాడు. అందుకే ఎమోషనల్ జర్నీలా ఉండాల్సిన టక్ జగదీష్.. యాక్షన్.. ఎమోషన్స్ మధ్యలో ఉండిపోయాడు. జగపతిబాబు ఆస్తి కోసం మారిపోయిన తర్వాత కథను మరింత ఎమోషనల్‌గా నడిపించే ప్రయత్నంలో.. కమర్షియల్‌గా ఉండలేక.. అనుకున్నది చెప్పలేక దర్శకుడు బ్యాలెన్స్ తప్పినట్లు అనిపించింది. అప్పటి వరకు ఊళ్ళోనే ఉన్న హీరో ఉన్నఫలంగా సిటీ వెళ్లి MRO గా వెనక్కి వచ్చేస్తాడు. అదెలా అనేది ఎవరికీ అర్థం కాదు. పోనీలే అది సినిమాటిక్ లిబర్టీ అనుకుంటే.. MRO అంటే ఏదో కలెక్టర్ అన్నట్లు.. ఆయనపై ఎవరూ లేనట్లు చూపించారు. నాని ఇమేజ్ పెంచడానికి.. ఆయనకు మాస్ ఇమేజ్ తీసుకురావడానికి బలంగా రుద్దిన ప్రయత్నంలా అనిపిస్తుంది టక్ జగదీష్. గత సినిమాలతో పోలిస్తే నాని కూడా కొత్తగా మాస్ హీరోలా కనిపించాడు ఇందులో. పొలం ఫైట్ అయితే చాలా స్టైలిష్‌గా తీసారు. పాటకు ఫైట్ పెట్టడం అల వైకుంఠపురములో సినిమాను గుర్తు చేసింది. ఐశ్వర్య రాజేష్ పాత్రను సరిగ్గా వాడుకోలేదేమో అనిపించింది. అరగంటలో అయిపోయే కథను క్లైమాక్స్ వరకు ఆస్తి గొడవలుగా చూపించే ప్రయత్నం చేయడంలో ఎమోషనల్ సీన్స్ కొంతవరకు మాత్రమే వర్కవుట్ అయ్యాయి.

నటీనటులు:
నాని మరోసారి మాయ చేసాడు.. జగదీష్ నాయుడుగా కొత్తగా ఉన్నాడు.. నాని ఉన్నాడు కాబట్టి చూడొచ్చు. ఎప్పటికప్పుడు ఏ పాత్ర ఇచ్చినా తనను తాను కొత్తగా చూపించుకోడానికి ప్రయత్నిస్తాడు నాని. అందుకే ఆయన న్యాచురల్ స్టార్ అయ్యాడు. రీతూ వర్మ హీరోయిన్ అని ఎవరో ఒకరు గుర్తు చేయాలి.. అలా ఉంది ఈమె పాత్ర. జగపతిబాబు పర్లేదు. అప్పటి వరకు బాగుండి.. ఉన్నపలంగా విలనిజం షేడ్స్ బాగా చూపించాడు. చాలా రోజుల తర్వాత తమిళ నటుడు డేనియల్ బాలాజీ తెలుగులో కనిపించాడు. ఆయన విలనిజం సరిగ్గా వాడుకోలేదు. తిరువీర్ సర్ప్రైజ్ ప్యాకేజీ.. మనోడు చూడ్డానికి సాఫ్టుగా ఉన్నా కారెక్టర్ మాత్రం చాలా కఠినంగా ఉంది. ఐశ్వర్య రాజేష్ ఉన్నంతలో ఓకే. మిగిలిన వాళ్లంతా పాత్రల మేరకు పర్లేదు.

టెక్నికల్ టీం:
థమన్ పాటలు బాగున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే పాట ఆకట్టుకుంటుంది. గోపీసుందర్ నేపథ్య సంగీతం జస్ట్ ఓకే అనిపించింది. ఆయన కంటే థమన్ ఇంకా బాగా చేసేవాడేమో..? ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అద్భుతం. సినిమా చాలా రిచ్‌గా కనిపించింది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ కాస్త వీక్ అనిపించింది. దర్శకుడు, ఎడిటింగ్ మధ్య ఇంకాస్త కెమిస్ట్రీ ఉండుంటే ఆకట్టుకునేది. నిర్మాణ విలువల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నాని రేంజ్ కంటే ఎక్కువగానే ఈ చిత్రం కోసం ఖర్చు చేసారు. దర్శకుడిగా ఈ యాక్షన్ జోనర్ శివ నిర్వాణకు కొత్త కానీ ప్రేక్షకులకు పాతే. నిన్ను కోరి, మజిలీ సినిమాలలో చాలా బలమైన ఎమోషన్స్‌తో కథను నడిపించాడు శివ. కానీ ఈ సారి అది కుదర్లేదు. కమర్షియల్ కోణంలో చేయబోయి.. ఇటు ఎమోషనల్ సీన్స్ కూడా గాడి తప్పాయి. నాని ఉన్నాడు కాబట్టి చూడొచ్చు అనేలా ఉంది తప్ప సినిమాగా చూస్తే టక్ జగదీష్ శివ నిర్వాణ స్థాయి సినిమా కాదు.

చివరగా ఒక్కమాట:
టక్ జగదీష్.. రొటీన్ ఫ్యామిలీ డ్రామా..

రేటింగ్: 2.75/5
Published by:Praveen Kumar Vadla
First published: