మొన్నటి వరకు వరసగా సినిమా విడుదల తేదీలు అనౌన్స్ చేసారు. కరోనా వచ్చినా కూడా పరిస్థితులు మళ్లీ చక్కబడ్డాయి అనుకుని రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసారు దర్శక నిర్మాతలు. కానీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ దారుణంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రకటించిన రిలీజ్ డేట్స్‌ను వరసగా మార్చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. ఎప్రిల్ 16న రావాల్సిన నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరీ సినిమా వాయిదా వేసారు దర్శక నిర్మాతలు. కేవలం పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని వాయిదా వేసారు. మరోవైపు ఇప్పుడు ఎప్రిల్ 23న రావాల్సిన టక్ జగదీష్ కూడా వాయిదా పడింది. నాని, రితూ వర్మ జంటగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఎమోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎప్రిల్ 23న విడుదల చేయాలని ఫిక్స్ చేసారు మేకర్స్. ముందు ఎప్రిల్ 16న అనుకున్నా కూడా లవ్ స్టోరీ కారణంగా వారం రోజులు ఆలస్యంగా తీసుకురావాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ తేదీ నుంచి కూడా సినిమా పోస్ట్‌పోన్ అయింది.
టక్ జగదీష్ కుటుంబమంతా కలిసి చూసే సినిమా అని.. అలాంటి సినిమాను ఫ్యామిలీస్ కలిసి చూస్తేనే మజా వస్తుందని.. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేకపోవడంతో రిలీజ్ డేట్ కూడా మారిపోయిందని చెప్పాడు నాని. సినిమా చాలా బాగా వచ్చిందని.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది త్వరలోనే చెప్తామని తెలిపాడు నాని.
Hi :) #TuckJagadishPostponed pic.twitter.com/byQwprFTHA
— Nani (@NameisNani) April 12, 2021
అంతేకాదు ఉగాదికి రావాల్సిన ట్రైలర్ కూడా వాయిదా పడింది. ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుందో.. అప్పుడే కొత్త విడుదల తేదీ కూడా అందులోనే ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు న్యాచురల్ స్టార్. దాదాపు 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రంపై నాని చాలా ఆశలే పెట్టుకున్నాడు. గత రెండేళ్లలో నాని కెరీర్ గ్రాఫ్ అంత బాగోలేదు. కృష్ణార్జున యుద్ధం, దేవదాస్, గ్యాంగ్ లీడర్, వి సినిమాలు నిరాశ పరిచాయి. ఒక్క జెర్సీ మాత్రమే విజయం సాధించింది. దాంతో టక్ జగదీష్ విజయం ఈయనకు కీలకంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hero nani, Telugu Cinema, Tollywood, Tuck Jagadish