నేచురల్ స్టార్ నాని కోవిడ్ వల్ల స్పీడు తగ్గించాడు. కాస్త గ్యాప్ తీసుకుని రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్తున్నాడు. వరుస సినిమాలకు ఓకే చెబుతూ ఉన్నాడు. మరో వైపు ఆ సినిమాల షూటింగ్స్‌ను పక్కా ప్లానింగ్‌తో పూర్తి చేస్తున్నాడు. ఇదంతా బాగానే ఉంది. ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సినిమాను పూర్తి చేస్తున్న నేచురల్ స్టార్.. తదుపరి వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ అంటే సుందరానికీ సినిమాను చేయాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అయితే అనుకోని సమస్య ఇప్పుడు అంటే సుందరానికీ అడ్డం పడుతుంది. ఇంతకీ ఈ సినిమాకు అడ్డం పడుతున్న విషయమేంటో తెలుసా? నిర్మాత రాజ్ కందుకూరి. అదేంటి రాజ్ కందుకూరి అంటే ఇండస్ట్రీలో అందరితో మంచి స్నేహంగా ఉండే నిర్మాత అని తెలుసు. అలాంటి ఆయన నాని సినిమాకు ఎందుకు అడ్డం పడుతున్నాడా? అనే సందేహం రాక మానదు.
వివరాల్లోకి వెళితే.. అంటే సుందరానికీ దర్శకుడు వివేక్ ఆత్రేయ అనే సంగతి తెలిసిందే. ఈయన తొలి సినిమా మెంటల్ మదిలో. ఈ సినిమాను రాజ్ కందుకూరి నిర్మించాడు.ఈ సినిమాను చేసే సమయంలో తనకు మరో సినిమా చేసి పెట్టాలని నిర్మాత రాజ్ కందుకూరి ఓ కండీషన్ పెట్టి మరీ సినిమా చేశాడట. అప్పుడు వివేక్ ఆత్రేయ ఒప్పుకున్నాడు. కానీ.. ఇప్పుడు మాత్రం సినిమా చేయడం లేదట. రాజ్ కందుకూరి అడిగితే వివేక్ ఆత్రేయ నుంచి సమాధానం రావడం లేదు. దీంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. తనకు సినిమా చేయకుండా వివేక్ ఆత్రేయ తప్పించుకుని తిరుగుతున్నాడంటూ ఏకంగా నిర్మాతల మండలిలోనే ఫిర్యాదు చేశాడట రాజ్ కందుకూరి. మరి నిర్మాతల మండలి ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.
నాని రంగంలోకి దిగితే వ్యవహారం సులువుగానే పరిష్కారమవుతుంది. మరో వైపు అంటే సుందరానికీ సినిమాను నిర్మించేది మైత్రీ మూవీ మేకర్స్ కాబట్టి.. రాజ్ కందుకూరి, వివేక్ ఆత్రేయ విషయం పెద్దగా లాగే పని ఉండకపోవచ్చునని, ఏదో ఒక సెటిల్మెంట్ చేసే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి మరి. రాజ్ కందుకూరి హీరో విజయ్ దేవరకొండకు పెళ్లిచూపులతో మంచి బ్రేక్ ఇచ్చాడు. అలాగే శ్రీవిష్ణుకి కూడా మెంటల్ మదిలో చిత్రంతోనూ మంచి బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hero nani, Mythri Movie Makers