నట శిఖరం Nedumudi Venu ఇక లేరు -కొవిడ్ దెబ్బకు ఆరోగ్యం పాడై -3సార్లు జాతీయ, 7రాష్ట్ర స్థాయి అవార్డులు

నటుడు నెడుముడి వేణు మృతి

Nedumudi Venu passed away : దక్షిణభారత చలనచిత్ర రంగం మరో ధృవతారను కోల్పోయింది. కొద్ది గంటల కిందటే కన్నడ నటుడు సత్యజిత్ కన్నుమూయగా, ఇప్పుడు మలయాళ నట శిఖరం నెగుముడి వేణు మరణ వార్త సినీ అభిమానుల్ని విషాదంలోకి నెట్టింది. ‘భారతీయుడు’, ‘అపరిచితుడు’, ‘సర్వం తాళమయం’లాంటి సినిమాలతో తెలుగునాట కూడా ఆదరణ పొందిన ఆయన కరోనా అనంతర ప్రభావాలకు గురై ప్రాణాలు కోల్పోయారు..

  • Share this:
ప్రముఖ మలయాళ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత నెడుముడి వేణు కన్నుమూశారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సోమవారం మధ్యాహ్నం తర్వాత ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబీకులు చెప్పారు. చనిపోయేనాటికి ఆయన వయసు 73 ఏళ్లు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతిలో వైరస్ కాటుకు గురైన వేణు.. కొవిడ్ అనంతర ప్రభావం వల్లే చనిపోయినట్లు డాక్టర్లు చెబుతున్నారు.

కరోనా తొలి, రెండో దశల్లో కేరళలో ఎక్కువ కేసులు, మరణాలు నమోదుకావడం తెలిసిందే. సెకండ్ వేవ్ లో వేణుకు కూడా కరోనా సోకింది. కొంతకాలం చికిత్స తీసుకుని నెగటివ్ గా బయటపడ్డారు. కానీ వృద్ధాప్యంలో ఉన్న ఆయనపై కరోనా అనంతర ప్రభావం తీవ్రంగా ఉండింది. ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ, కొంతకాలంగా ఆస్పత్రికే పరిమితమయ్యారు. అయినాసరే,

మరణశయ్యపై ఉండి కూడా కరోనాపై పోరుకు ముందుకొచ్చారు నెడిముడి వేణు. ఆస్పత్రి బెడ్ పై నుంచే తన అభిమానులను ఉద్దేశించి ఓ ఆడియో సందేశాన్ని పంపారు. కరోనాను తేలికగా తీసుకోకుండా బాధ్యతాయుతంగా పోరాటం చేయాలని వేణు పిలుపునిచ్చారు. దురదృష్టవశాత్తూ అదే ఆయన మాట్లాడిన చివరి ఆడియోగా మిగిలిపోయింది. వేణు మృతిపై మలయాళ చిత్ర పరిశ్రమతోపాటు దక్షిణాది నటులు విచారం వ్యక్తం చేశారు.

నాటక రంగంలో చిన్న ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన నెడిముడి వేణు 1978లో జీ అరవిందన్‌ దర్శకత్వంలో వచ్చిన థంబు చిత్రంలో సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. మలయాళం, తమిళంతో పాటు దాదాపు 500 సినిమాల్లో నటించారు. తెలుగులోకి డబ్‌ అయిన కొన్ని తమిళ సినిమాల ద్వారా ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. అద్బుతమైన నటనకుగానూ ఆయనకు మూడు సార్లు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. అలాగే ఏడు సార్లు రాష్ట్ర స్థాయిలో బెస్ట్ యాక్టర్ అవార్డులు అందుకున్నారు.
Published by:Madhu Kota
First published: