నాని ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కరోనా టైమ్‌లోనూ సినిమా షూటింగ్స్ పూర్తి చేసాడు ఈయన. ప్రస్తుతం ఈయన చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో టక్ జగదీష్ ఈ మధ్యే అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా విడుదలైన ఈ సినిమాకు ఊహించిన రెస్పాన్స్ అయితే రాలేదు. అంతేకాదు దానికి ముందు విడుదలైన వి సినిమాకు కూడా అంత రెస్పాన్స్ రాలేదు. ఇక థియేటర్స్‌లో విడుదలైన నాని 24వ సినిమా గ్యాంగ్ లీడర్ కూడా ఫ్లాప్ అయింది. దాంతో ఇప్పుడు కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో పడిపోయాడు నాని. ఇలాంటి సమయంలో ఈయన నటిస్తున్న సినిమా శ్యామ్ సింగరాయ్. డిసెంబర్ 24న విడుదల కానుంది ఈ చిత్రం. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ట్రైలర్ విడుదలైంది. ఇది కూడా ఆసక్తికరంగానే సాగింది. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ హిస్టారికల్ సినిమాపై అంచనాలు కూడా అంతే భారీగా ఉన్నాయి.
కోల్కత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సత్యదేవ్ జంగా కథ అందించారు. నాని కెరీర్లోనే తొలిసారి 40 కోట్లతో తెరకెక్కుతుంది ఈ చిత్రం. కచ్చితంగా అభిమానుల అంచనాలు నిలబెట్టేలాగే ఈ చిత్రం ఉంటుందని నాని కూడా నమ్మకంగా చెబుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి, సెన్సేషనల్ సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు నాని. ఇప్పటికే ఎంసిఏ సినిమాలో కలిసి నటించిన నాని, సాయి పల్లవి శ్యామ్ సింగరాయ్ కోసం మరోసారి కలిసారు. ఇప్పటి వరకు సాయి పల్లవి చేయనటువంటి భిన్నమైన పాత్రను ఈ చిత్రంలో పోషిస్తుందని తెలుస్తుంది.
This month is going to be a feast for movie lovers and I promise you a great dessert ♥️
24th న థియేటర్స్ లో కలుద్దాం...#ShyamSinghaRoy Trailer #SSRTrailer https://t.co/pEbEHN1fDk pic.twitter.com/Un7AfawwQ1
— Nani (@NameisNani) December 14, 2021
ఇందులో దేవదాసిగా నటిస్తుంది సాయి పల్లవి. బెంగాలీ అమ్మాయిగా నటిస్తుంది ఈ భామ. సాయి పల్లవి కారెక్టర్ పవర్ ఫుల్‌గా ఉంటుందని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ‘వాడి గుడిసె జోలికి వెళ్ళావో, నీ ఇల్లు ఎక్కడ ఉందో ఈ శ్యామ్ సింగ రాయ్ కి బాగా తెలుసు’, ‘పిరికి వాళ్ళే కర్మ సిద్ధాంతం మాట్లాడుతారు… ఆత్మాభిమానం కన్నా ఏ యాగము గొప్పది కాదు తప్పని తెలిసాక దేవుడిని అయినా ఎదిరించడం లో తప్పే లేదు’ లాంటి డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి. శ్యామ్ సింగరాయ్ అనే పవర్ ఫుల్ పాత్రతో పాటు.. వాసు అనే ఫిల్మ్ డైరెక్టర్ పాత్రలో నటిస్తున్నాడు నాని. కృతి శెట్టి, నాని మధ్య లిప్ లాక్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఈ ట్రైలర్ చూస్తుంటే కచ్చితంగా నాని గట్టి హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. మరి చూడాలిక.. ఏం జరుగుతుందో..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hero nani, Shyam Singha Roy, Telugu Cinema, Tollywood