‘జెర్సీ’ ఈ మధ్య కాలంలో వచ్చిన తెలుగు సినిమాల్లో ‘వన్ ఆఫ్ ది బెస్ట్’ మూవీగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం. నేచురల్ స్టార్ నాని హీరోగా ‘మళ్లీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ‘జెర్సీ’ బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి వసూళ్లు సాధించింది. ‘కృష్ణార్జున యుద్ధం’, ‘దేవదాస్’ సినిమాలు బాక్సీఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిల్ తర్వాత నేచురల్ స్టార్ నానికి కావాల్సిన మంచి విజయాన్ని అందించింది ‘జెర్సీ’. బాక్సాఫీస్ వసూళ్ల కంటే అభిమానులను అలరించడంలో, చూసిన ప్రతీ ప్రేక్షకుడినీ కదిలించడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు నాని. యంగ్ టైగర్ ఎన్.టీ.ఆర్, సూపర్ స్టార్ మహేశ్ బాబు వంటి స్టార్స్ కూడా ‘జెర్సీ’ సినిమాను పొగడ్తల్లో ముంచెత్తారు. అయితే నాని కెరీర్‌లోనే ఓ మంచి చిత్రంగా నిలిచిన ‘జెర్సీ’కి కూడా కొన్ని ఏరియాల్లో నష్టాలు తప్పకపోవడం విశేషం. విడుదలైన మొదటి వారంలోనే రూ.15 కోట్లకు పైగా షేర్ సాధించిన ‘జెర్సీ’ ఆ తర్వాత బాగా నెమ్మదించింది. దానికి ముఖ్యకారణంగా హాలీవుడ్ సూపర్ హీరోస్ ‘అవెంజర్- ది ఎండ్ గేమ్’ మూవీ. మొదటి వారంలో రాఘవ లారెన్స్ ‘కాంచన 3’తో బాక్సాఫీస్ పంచుకున్న ‘జెర్సీ’... రెండో వారంలో ‘అవెంజర్స్’ సునామీలో కలెక్షన్లు కోల్పోవాల్సి వచ్చింది. అయితే మొత్తంగా చూస్తే ఒక్క సీడెడ్ ఏరియాలో మినహాయిస్తే అన్నిచోట్ల లాభాలు తెచ్చాడు నాని. నాని ‘జెర్సీ’ సినిమా కలెక్షన్స్ ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.
‘జెర్సీ’ సినిమాను రెండు తెలుగురాష్ట్రాల్లో రూ.19.56 కోట్లకు అమ్మారు. మొత్తంగా రూ.25.35 కోట్ల షేర్ రాబట్టిన ‘జెర్సీ’... డిస్టిబ్యూటర్లకు రూ.5.79 కోట్ల లాభాన్ని అందించింది. నైజాం ఏరియాలో రూ.7 కోట్లకు విక్రయిస్తే... ఏకంగా రూ.10.75 కోట్లు వసూళ్లు కొల్లగొట్టింది జెర్సీ. సీడెడ్‌లో రూ.3.60 కోట్లకు ‘జెర్సీ’ని అమ్మగా... రూ.2.94 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది నాని సినిమా. ఫలితంగా సీడెడ్ డిస్టిబ్యూటర్లకు రూ.66 లక్షల నష్టం తప్పలేదు. వైజాగ్‌లో రూ.1.07 లాభం రాగా, ఈస్ట్ గోదావరిలో రూ.54 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ.23లక్షలు... గుంటూరులో రూ.32 లక్షలు, కృష్ణాలో రూ.52 లక్షలు లాభం వచ్చింది. నెల్లూరులో మాత్రం రూ.20 వేల స్వల్ప లాభంతో గట్టెక్కింది ‘జెర్సీ’. నాని ‘జెర్సీ’ సినిమాలో కన్నడ హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించిన ‘జెర్సీ’ మూవీ త్వరలోనే అమేజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jersey, Nani, Telugu Cinema, Tollywood Box Office Report