రివ్యూ: ‘గ్యాంగ్ లీడర్’.. కథలో పగ ఉంది.. కథనంలో వేగం లేదు..

నాని సినిమా అంటే ఎలా ఉంటుంది అని అడక్కూడదు.. ఎంత బాగుంది అని అడగాలి. మరి ఇప్పుడు ఈయన నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా విడుదలైంది.. ఇదెలా ఉందో ఒక్కసారి చూద్దాం..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 13, 2019, 1:20 PM IST
రివ్యూ: ‘గ్యాంగ్ లీడర్’.. కథలో పగ ఉంది.. కథనంలో వేగం లేదు..
గ్యాంగ్ లీడర్ కలెక్షన్స్
  • Share this:
నటీనటులు: నాని, ప్రియాంక మోహన్, కార్తికేయ, శరణ్య, లక్ష్మి, ప్రాణ్య, ప్రియదర్శి తదితరులు
కథ, స్క్రీన్ ప్లే దర్శకుడు: విక్రమ్ కే కుమార్

నిర్మాతలు: మైత్రి మూవీ మేకర్స్

నాని సినిమా అంటే ఎలా ఉంటుంది అని అడక్కూడదు.. ఎంత బాగుంది అని అడగాలి. మరి ఇప్పుడు ఈయన నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా విడుదలైంది.. ఇదెలా ఉందో ఒక్కసారి చూద్దాం..

కథ:
పెన్సిల్ పార్థసారథి (నాని) ఫేమస్ రివేంజ్ రైటర్. అలాంటి వాడి దగ్గరికి ఐదుగురు ఆడవాళ్లు వస్తారు. అందులో 80 ఏళ్ల బామ్మ (లక్ష్మి), 50 ఏళ్ల అమ్మ (శరణ్య), 22 ఏళ్ల అమ్మాయి ప్రియ (ప్రియాంక మోహన్), 17 ఏళ్ల టీనేజర్, నాలుగేళ్ళ పాప (ప్రాణ్య) ఉంటారు. పెన్సిల్ పుస్తకాల్లో ఉండే పగను నమ్మి.. తమ పగకు సాయం చేయమని ఆయన దగ్గరికి వస్తారు. అక్కడ్నుంచి అసలు కథ మొదలవుతుంది. పెన్సిల్ వాళ్లకు ఎలా సాయం చేసాడు..? ఆ ఐదుగురు ఆడవాళ్లు వెతుకుతున్న ఆరోవాడు దేవ్ (కార్తికేయ) ఎవరు..? వీళ్లకేం అన్యాయం చేసాడు అనేది అసలు కథ..

కథనం:విక్రమ్ కే కుమార్ సినిమా అంటే రొటీన్‌కు భిన్నంగా ఉంటుందని ఊహిస్తాం. ప్రతీ ప్రేక్షకుడికి కూడా ఇదే అంచనాలు, ఆసక్తి ఉంటాయి. ఆయన గత సినిమాల నుంచి వచ్చిన ఆసక్తి అది. విక్రమ్ కే కుమార్ అంటే కచ్చితంగా మంచి సినిమా ఇస్తాడనే నమ్మకం ప్రేక్షకుల్లో పెంచేసాడు ఈయన. మనం, ఇష్క్, 24 లాంటి సినిమాల తర్వాత చేసిన సినిమా కావడం దీనికి కారణం. అయితే గ్యాంగ్ లీడర్ విషయంలో మాత్రం మరోలా జరిగింది. ఈ చిత్ర కథ నుంచీ అన్నీ ముందే చెప్పాడు దర్శకుడు. టీజర్, ట్రైలర్ లోనే కథ మొత్తం ముందుంచేసాడు. దానికి స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేస్తాడేమో అనుకున్నారంతా. కానీ ఇప్పుడు సినిమలో అది కూడా మిస్ కావడం ఆడియన్స్‌కు అసలు షాక్. ఫస్ట్ సీన్ నుంచే ఊహించే స్క్రీన్ ప్లే సినిమాపై ఆసక్తి తగ్గించేసింది. ఎక్కడా స్పీడ్ పెంచుకుండా.. కథలో వేగం నెమ్మదించడంతో గ్యాంగ్ లీడర్ పూర్తిగా నీరసించిపోయాడు. దొంగతనంతో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు.. అదే వేగం తర్వాత కొనసాగించడంలో విఫలమయ్యాడు. నాని ఎంట్రీ తర్వాత కూడా కథలో వేగం పెరగలేదు. రొటీన్ స్క్రీన్ ప్లేతో సాగే సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. అక్కడక్కడా నాని తన స్టైల్ ఆఫ్ నవ్వులు పంచినా కూడా సినిమాకు అది పెద్దగా హెల్ప్ చేయలేకపోయింది. ఫస్టాఫ్ అంతా రివేంజర్స్ అసెంబుల్ అవ్వడం.. ఆ తర్వాత ఆరోవాడి కోసం వెతకడంతోనే అయిపోతుంది. ఒక్కసారి తాము వెతుకుతున్న వాడు దొరికిన తర్వాత కూడా అతన్ని పట్టుకునే క్రమంలో వచ్చే సన్నివేశాలన్నీ చాలా సిల్లీగా అనిపిస్తాయి. పోలీసులకు ఏడాదిన్నరగా దొరకని దొంగ.. హీరో అండ్ గ్యాంగ్‌కు కేవలం కొన్ని రోజుల్లోనే దొరికిపోవడం లాజిక్ లేకుండా అనిపిస్తుంది. క్లైమాక్స్ వరకు కూడా కథనం ఆసక్తికరంగా లేకపోవడంతో గ్యాంగ్ లీడర్‌పై అంచనాలు కూడా తగ్గిపోతాయి. రొటీన్ స్క్రీన్ ప్లే ఈ చిత్రం కొంప ముంచేసింది. కెరీర్లోనే తొలిసారి పూర్తిగా రొటీన్ స్క్రీన్ ప్లే రాసుకుని సినిమా తెరకెక్కించాడు విక్రమ్. నాని లాంటి యాక్టర్ ఉన్నా కూడా కథ సహకరించకపోవడం గ్యాంగ్ లీడర్‌కు మైనస్ అయిపోయింది. అక్కడక్కడా నాని నవ్వులు తప్పిస్తే సినిమాలో ఆసక్తికరమైన అంశాలు వెతుక్కువడం కష్టమే. కార్తికేయ ప్రతినాయకుడిగా మెప్పించాడు కానీ ఫ్లాష్ బ్యాక్ మాత్రం ఆసక్తికరంగా లేదు. మొత్తంగా గ్యాంగ్ లీడర్‌లో రివేంజ్ ఉంది కానీ దానికి తగ్గ కారణాలు మాత్రం ఆసక్తికరంగా అనిపించలేదు.

నటీనటులు:
నాని మరోసారి మెప్పించాడు. నేచురల్ స్టార్ కాబట్టి ఏ కారెక్టర్ అయినా నేచురల్‌గా చేస్తాడు. ఇది కూడా అంతే. తన కామెడీ టైమింగ్‌తో బాగానే నవ్వించాడు నాని. ఇక ప్రియాంక మోహన్ కొత్తమ్మాయే అయినా కూడా బాగా చేసింది. చాలా అందంగా కూడా ఉంది. కార్తికేయ విలన్‌గా మెప్పించాడు. ఆయన చెప్పినంత కాదు కానీ బాగానే రాక్షసంగా ఉన్నాడు. లక్ష్మి, శరణ్య, ప్రాణ్య గ్యాంగ్ కూడా బాగానే ఉన్నారు. వెన్నెల కిషోర్ రెండు సీన్స్‌లో బాగానే నవ్వించాడు.

టెక్నికల్ టీం:
క్యూబా సినిమాటోగ్రఫీ బాగుంది. మన భాష, దేశం కాకపోయినా సినిమాకు బౌండరీస్ లేవని నిరూపించాడు. అనిరుధ్ సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా నిను చూసే, హొయనా సాంగ్స్ అదిరిపోయాయి. ఆర్ఆర్ కూడా బాగుంది. ఇక ఎడిటింగ్ మాత్రం వీక్. కొన్ని సన్నివేశాలు కథకు అడ్డు పడినట్లు అనిపించాయి. దర్శకుడిగా విక్రమ్ కే కుమార్ తొలిసారి ఫెయిల్ అయ్యాడేమో అనిపిస్తుంది. ఇంత రొటీన్ కథను ఆయనెప్పుడూ రాసుకోలేదు. 1,2,3 అంటూ లెక్కలేసుకుని రాసుకున్న స్క్రీన్ ప్లేలా అనిపించింది. ప్రతీ సీన్ ముందే ఊహకు వచ్చేస్తుంది. ఓవరాల్‌గా గ్యాంగ్ లీడర్ ఆయన నుంచి ఊహించే సినిమా మాత్రం కాదు..

చివరగా ఒక్కమాట:
గ్యాంగ్ లీడర్.. పగ ఉంది కానీ స్క్రీన్ ప్లే ముంచేసింది..

రేటింగ్: 2.5/5
Published by: Praveen Kumar Vadla
First published: September 13, 2019, 1:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading