నాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా దసరా (Dasara). ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాస్ యాక్షన్ పాత్రలో నాని కనిపించనున్నాడు. చిత్రంలో నాని సరసన కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్ గా నటిస్తోంది. సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేసిన ఈ దసరా టీజర్ లో నాని విశ్వరూపం కనిపించింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా మాస్ లుక్ లో ఆకట్టుకున్నారు నాని. రా అండ్ రగ్గ్‌డ్ లుక్ లో నాని యాక్షన్ టీజర్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అత్యంత సహజంగా ఉన్న లొకేషన్స్ సినిమాపై ఆసక్తి పెంచేశాయి. తెలంగాణ లోని గోదావరిఖని సమీపంలో ఉన్న సింగరేణి ప్రాంతానికి చెందిన ఫిక్షనల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ దసరా మూవీని మార్చి 30వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదల చేసిన దసరా ఫస్ట్ లుక్, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేయగా.. తాజాగా వదిలిన టీజర్ భారీ హైప్ తీసుకొచ్చింది. ఈ చిత్రంలో నానిని మాస్ లుక్ లో చూడాలనే కుతూహలం ప్రేక్షకుల్లో పెరిగిపోయింది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. షూటింగ్ చేస్తుండగానే ఈ సినిమాకు భారీ డీల్స్ వచ్చాయని తెలిసింది. ఇప్పటికే ఈ దసరా సినిమాకు 100 కోట్ల బిజినెస్ జరిగిపోయిందని టాలీవుడ్ వర్గాల్లో ఓ టాక్ నడుస్తోంది.
తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ దసరా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగులో ఈ టీజర్ రాజమౌళి రిలీజ్ చేయగా.. హిందీ టీజర్‌ను షాహిద్ కపూర్, తమిళ్ టీజర్‌ను ధనుష్, మలయాళ టీజర్‌ను దుల్కర్ సల్మన్, కన్నడ టీజర్‌ను రక్షిత్ శెట్టి విడుదల చేశారు. రిలీజ్ చేసిన కాసేపట్లోనే ఈ టీజర్ భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో దసరా మూవీపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dasara Movie, Hero nani, Keerthy Suresh