చూస్తున్నారుగా.. నందమూరి మోక్షజ్ఞ కొత్త లుక్ ఇది.. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న లుక్ ఇది. ఈయన ఎంట్రీ కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు నందమూరి అభిమానులు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఈ వంశం నుంచి హీరో వచ్చి ఒకటి రెండు కాదు.. 13 ఏళ్ళైపోయింది. ఇప్పటికీ అదే కళ్యాణ్ రామ్.. అదే ఎన్టీఆర్.. అదే బాలయ్య ఇండస్ట్రీని దున్నేస్తున్నారు. వాళ్లు కాకుండా ఈ కుటుంబం నుంచి కొత్త మొహాలు రాలేదు. మరోవైపు అందరి కుటుంబాల నుంచి వారసులు ఒక్కొక్కరుగా వస్తూనే ఉన్నారు.
గత పదేళ్లలో వెల్లువలా ఒక్కో ఫ్యామిలీ నుంచి ముగ్గురు నలుగురు వారసులు కూడా వచ్చారు. మెగా ఫ్యామిలీ అయితే తమ కుర్రాళ్లతో ఇండస్ట్రీని నింపేసింది. దాంతో ఇప్పుడు నందమూరి కుటుంబం మాత్రమే బ్యాలెన్స్ ఉండిపోయింది. ఈ లోటు భర్తీ కావాలి అంటే ఇప్పుడు ఈ కుటుంబం నుంచి రావాల్సిన వారసుడు నందమూరి మోక్షజ్ఞ సన్ ఆఫ్ నందమూరి బాలకృష్ణ. తండ్రికి తగ్గ తనయుడు.. తాతకు తగ్గ మనవడు అనిపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు ఈ కుర్రాడు. ఇప్పటికే 21 ఏట అడుగు పెట్టాడు మోక్షు.
ఇండస్ట్రీలో చాలామంది వారసులు ఇదే వయసులోనే హీరోలుగా వచ్చారు. చరణ్ 21 ఏళ్లకు "చిరుత".. అఖిల్ 20 ఏళ్లకే "అఖిల్".. ఎన్టీఆర్ అయితే 16 ఏళ్లకే "నిన్ను చూడాలని".. మహేశ్, పవన్ 25 ఏళ్లకు.. బన్నీ 20 ఏళ్లకు "గంగోత్రి".. ప్రభాస్ 22 ఏళ్లకు "ఈశ్వర్".. ఇలా ప్రతీ హీరో చాలా తక్కువ వయసులోనే వచ్చారు. దాంతో ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు అని ఇప్పుడు నందమూరి అభిమానులు బాలయ్యను ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానంగా బాలయ్య కూడా త్వరలోనే వారసున్ని పరిచయం చేస్తానంటున్నాడు. ప్రస్తుతం మోక్షజ్ఞ నటనతో పాటు డాన్సులు.. ఫిజిక్‌పై దృష్టి పెట్టాడు.
ఆ మధ్య బాగా లావుగా కనిపించిన మోక్షు.. ఇప్పుడు స్లిమ్ లుక్ లోకి మారిపోయాడు. బాలకృష్ణ డాన్సుల్లో కింగ్.. అలాంటి హీరో వారసుడు అంటే అభిమానులు ఊహించేది డాన్సులు. అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఈ వారసుడు. మోక్షు ఎప్పుడొచ్చినా కూడా తనే సినిమా నిర్మిస్తానని సాయి కొర్రపాటి చెబుతున్నాడు. బాలయ్య మాత్రం తన సొంత నిర్మాణ సంస్థ ఎన్బికే ఫిల్మ్స్‌లో తనయున్ని పరిచయం చేయాలని చూస్తున్నాడు. దర్శకుడు క్రిష్ చేతిలో తన వారసున్ని పెట్టాలని చూస్తున్నాడు బాలయ్య. ఆ మధ్య నెంబర్ వన్ యారీ షోలో కూడా మోక్షుతో సినిమా చేస్తే ఏది చేస్తారంటే.. మరో ఆలోచన లేకుండా ‘ఆదిత్య 369’ను రీమేక్ చేస్తానంటూ చెప్పాడు క్రిష్.
అది కాకపోయినా కూడా మరో సినిమాతో ఈ దర్శకుడే నందమూరి వారసున్ని పరిచయం చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయిప్పుడు. ప్రస్తుతం ఎన్టీఆర్ మహానాయకుడు పనుల్లో బిజీగా ఉన్న ఈ దర్శకుడు.. ఆ తర్వాత మోక్షు కథపై దృష్టి పెట్టనున్నాడు. మరి చూడాలిక.. మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడో..? ఈ వారసుడు వస్తే మరో పదేళ్ల వరకు ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ ఉండదు.. వెంకీ, మహేష్, పవన్ కళ్యాణ్ తనయులు ఇంకా చిన్నోళ్లే కావడంతో మోక్షజ్ఞపైనే ఇప్పుడు అందరి ఆసక్తి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bala Krishna Nandamuri, Jr ntr, Kalyan Ram Nandamuri, Telugu Cinema, Tollywood