అఖండ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా టీజర్ విడుదలైన తర్వాత వాళ్లు సినిమా చూడడానికి అస్సలు ఆగడం లేదు. ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని కళ్లలో ఒత్తులేసుకుని చూస్తున్నారు. మధ్యలో ఈ మాయదారి కరోనా వచ్చి ప్లాన్స్ అన్నీ పాడు చేసింది కానీ లేకపోతే ఈ పాటికి బాలకృష్ణ థియేటర్లలో రచ్చ చేసేవాడు. మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అఖండ సినిమాను విడుదల చేయాలనుకున్నారు దర్శక నిర్మాతలు. కానీ కరోనా రెండో దశ ఉండడంతో షూటింగ్ కూడా పూర్తి చేసుకోలేకపోయింది ఈ సినిమా. చాలా రోజులుగా అఖండ సినిమా షూటింగ్ హోల్డ్ లోనే ఉంది. ఇప్పటికే చాలా సినిమాలు తిరిగి మొదలు పెట్టారు కానీ బాలయ్య మాత్రం లొకేషన్ కు రాలేదు. తాజాగా అఖండ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ఇదే విషయాన్ని దర్శకుడు బోయపాటి శ్రీను కన్ఫర్మ్ చేశాడు. షూటింగ్ మొదలు పెడుతున్నట్లు ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇది చూసి నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది అఖండ సినిమా.
మిగిలింది కూడా కేవలం 20 రోజుల్లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు బోయపాటి శ్రీను. ఆగస్టు, సెప్టెంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి దసరాకు సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో.. అభిమానులు మాత్రమే కాదు ఆడియన్స్ కూడా అఖండ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక బాలయ్య గత సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా అఖండ అద్భుతమైన బిజినెస్ చేస్తుంది. దాదాపు 60 కోట్లకు పైగా ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ బిజినెస్ ఇదే. టీజర్ చూసిన తర్వాత సినిమాపై బయ్యర్లకు నమ్మకం పెరిగింది. ఇందులో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ హీరో శ్రీకాంత్ అఖండ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తుండడం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akhanda, Boyapati Srinu, Nandamuri balakrishna, Telugu Cinema, Tollywood