టాలీవుడ్ లెజండరీ డైరెక్టర్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్ (K Viswanath passes away) అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 92 ఏళ్లు. గత కొంత కాలంగా వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలో బాధపడుతున్న ఆయన గురువారం కూడా తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశారు.
విశ్వనాథ్ మృతి పట్ల ఇటు రాజకీయ నాయకులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు తమ ప్రగాడ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు ఘన నివాళులు అర్పిస్తూ.. విశ్వానాథ్ కుటుంబానికి ప్రగాడ సంతాపాన్ని ప్రకటించారు. తాజాగా సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తన సంతాపాన్ని తెలిపారు. ''కళా తపస్వి కె. విశ్వనాథ్ గారు కన్నుమూయడం తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటు.. భారతీయ సంస్కృతీ సంప్రదాయలు మరీ ముఖ్యంగా మన తెలుగు దనాన్ని అణువణువున ప్రతిబింబించేలా ఆయన తీసిన అత్యద్భుత చిత్రాలు తెలుగు సినిమాకే గర్వ కారణం. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసి తెలుగు చలనచిత్ర పరిశ్రమకే వన్నెతెచ్చి ప్రతి తెలుగు వాడు గర్వించేలా చేసిన దిగ్గజ దర్శకుడి మరణం తీవ్ర విచారానికి గురిచేసింది. కళా తపస్వి ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను'' అని బాలకృష్ణ పేర్కొన్నారు.
తెలుగు చిత్రపరిశ్రమకు గొప్ప గౌరవాన్ని, గుర్తింపు తీసుకొచ్చిన విశ్వనాథ్ (RIP Viswanath).. 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. భారతీయ సంస్కృతికి చిహ్నమైన శాస్త్రీయ కళలను కథలుగా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆత్మ గౌరవం సినిమాతో దర్శకుడిగా మారారు. శంకరాభరణం సినిమా తెలుగు చిత్రసీమలో చరిత్ర సృష్టించింది. జాతీయ పురస్కారం గెలుచుకుంది. సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం ఆయకు కీర్తి ప్రతిష్ఠతలు తెచ్చిపెట్టాయి. సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ.. ఆయన తీసిన సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం అందరినీ ఆలోజింపజేశాయి.
విశ్వనాథ్ పూర్తి పేరు.. కాశీనాథుని విశ్వనాథ్. 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా రేపల్లెలో ఆయన జన్మించారు. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారు. ఆ తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక.. వాహిని స్టూడియోస్‌లో సౌండ్ ఆర్టిస్టుగా సినీ కెరీర్‌ను మొదలుపెట్టారు. సినిమాల్లో ఆయన ప్రతిభను గుర్తించిన నాగేశ్వరరావు.. ఆత్మగౌరవం సినిమాలో దర్శకుడిగా అవకాశం కల్పించారు. ఆ తర్వాత సిరిసిరి మువ్వ సినిమాతో దర్శకుడిగా ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది. అలా ఎన్నో అద్భుతమైన..అపురూపమమైన చిత్రాలను టాలీవుడ్‌కి అందించారు కె.విశ్వనాథ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Kasi vishwanath, Tollywood