సీనియర్ నటుడు మోహన్ బాబు (Mohah Babu) మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఇదివరకు ఈయనపై కొన్ని విషయాలలో కాంట్రవర్సీలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు మోహన్ బాబు. ఆయనతో పాటు అతడి వారసుడు మంచు విష్ణు (Manchu Vishnu) కూడా ఈ వివాదంలో ఉన్నాడు. విష్ణు కార్యాలయంలో జరిగిన హెయిర్ డ్రెస్సర్ వివాదం రోజురోజుకీ ముదురుతోంది. నాయి బ్రాహ్మణులను కించపరిచేలా హీరో మోహన్‌బాబు మాట్లాడారంటూ ఆ సంఘం నాయకులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. చిలికి చిలికి గాలివానలా మారేలా కనిపిస్తుంది ఈ వివాదం. ఇప్పట్లో తెగేలా కూడా కనిపించడం లేదు. పైగా మెగా బ్రదర్ నాగబాబు (Naga Babu) నాగ శ్రీను ఇంటికి వెళ్లి డబ్బులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే మంచు మోహన్ బాబుపై నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
తమ కులాన్ని దారుణంగా కించపరుస్తూ మోహన్ బాబు వ్యాఖ్యలు చేశారని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. క్షమాపణ చెప్పేందుకు రెండు రోజులు గడువువిచ్చినా ఆయన స్పందించలేదని.. అందుకే ఫిర్యాదు ఇస్తున్నామంటూ నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్నా కూడా కులాలపై దాడి ఏంటని ఆయన ప్రశ్నించారు. మోహన్ బాబు ఇంటిలో నాగ శ్రీను అనే వ్యక్తి 11 ఏళ్లుగా హెయిర్ డ్రెస్సర్‌గా నమ్మకంగా పని చేస్తున్నాడని.. అలాంటి వాడిపై ఇప్పుడు కులం పేరుతో నోరు పారేసుకున్నారని శ్రీనివాస్ ఆరోపించారు.
ఇప్పుడు తప్పుడు కేసులు బనాయించి.. పై నుంచి మళ్లీ కులం పేరుతోనూ దూషించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. నాగ శ్రీనును మోహన్ బాబు వాళ్లు ఇంట్లో మోకాళ్లపై కూర్చోబెట్టి కులం పేరుతో నానా దుర్భాషలాడుతూ వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడ్డారు. ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకోవాలని.. తప్పుడు కేసులు నమోదు చేయకుండా సమగ్ర విచారణ చేసి బాధితుడికి న్యాయం చేయాలని హెచ్ఆర్సీని ఆశ్రయించినట్లు శ్రీనివాస్ తెలిపారు. ఇదిలా ఉంటే మంచు విష్ణు కార్యాలయంలో పని చేసే హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీను రూ.5 లక్షల విలువైన వస్తువులు ఎత్తుకెళ్లాడంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆయన లీగల్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తనపై మంచు కుటుంబం తప్పుడు కేసు బనాయించిందంటూ నాగ శ్రీను ఆరోపిస్తుండటం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.