టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ప్రయోగాలకు చిరునామాగా నిలిచాడు నాగార్జున. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చినా.. ఆ తరువాత టాలీవుడ్‌లో తనదైన ముద్రవేసాడు నాగార్జున. అంతేకాదు కొత్తదనాన్ని ప్రోత్సహించాలన్నా..ప్రయోగాలు చేయాలన్నా...సంచలనాలు క్రియేట్ చేయాలన్నా ముందుగా గుర్తొచ్చే పేరు నాగార్జునదే. వయసు అరవై దాటినా ఇప్పటికీ అమ్మాయిల మనసుదోస్తున్నాడు ఈ మన్మథుడు. సీనియర్ టాప్ హీరోల్లో ఒకరిగా ఉంటూనే...మారుతున్న అవసరాలను బట్టి సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ కొడుకులతో పోటీపడుతున్నాడు.ఇటువంటి ట్రాక్ రికార్డు వున్న నాగార్జున..ఆయన టాలీవుడ్‌కు పరిచయం చేసిన బాలీవుడ్ హీరోయిన్స్ విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ చేశాడు. అప్పట్లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘విక్కీదాదా’ మూవీతో హిందీ బ్యూటీ జుహీ చావ్లాను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసాడు. ఆ తర్వాత ఈ భామతో ‘శాంతి క్రాంతి’ అనే మూవీలో నటించాడు నాగ్.
’నేటి సిద్దార్థ’ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ ఆయేషా జుల్కాతో ఆడిపాడాడు ఈ మన్మథుడు.ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో చేసిన ‘అంతం’ మూవీలో హీరోయిన్ ఊర్మిళతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండించాడు. ఆ తర్వాత తెలుగులో వేరే కథానాయకులు పరిచయం చేసిన హిందీ భామలతో కొన్ని సినిమాల్లో నటించిన ట్రాక్ రికార్డ్ నాగ్ సొంతం. వెంకటేశ్ ‘కూలీ నంబర్ 1’ మూవీతో పరిచయం చేసిన టబుతో ‘సిసింద్రీ’, ‘నిన్నేపెళ్లాడతా’, ‘ఆవిడా..మా ఆవిడే’ వంటి సినిమాల్లో నటించాడు.
‘ఆజాద్’ మూవీలో బాలీవుడ్ భామ శిల్పాశెట్టితో ఆడిపాడాడు. ఇక ‘క్రిమినల్’ మూవీతో మనీషా కొయిరాలను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఈ టాలీవుడ్ కింగ్...ఆ తర్వాత ‘రక్షకుడు’ మూవీతో ఒకప్పటి మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌తో ఆన్ స్ర్కీన్ రొమాన్స్ పండించాడు. ఆ తర్వాత మిస్ వరల్డ్ అయిన ఐశ్వర్యారాయ్‌ని ‘రావోయి చందమామ’ మూవీతో టాలీవుడ్‌కు పరిచయం చేసిన ఘనత కూడా నాగార్జునదే.
మరోవైపు ‘పెళ్లి సందడి’ మూవీతో పరిచయమైన బాలీవుడ్ భామ దీప్తి భట్నాగర్‌తో ‘ఆటో డ్రైవర్’ సినిమాలో కలిసి నటించాడు. ‘ఆకాశవీధిలో’ మూవీతో రవీనా టాండన్...‘సూపర్’ మూవీతో ఆయేషా టకియాతో వంటి బాలీవుడ్ భామలతో ఆన్ స్ర్కీన్ రొమాన్స్ పండించాడు. ఇక ‘ఎదురులేని మనిషి’ మూవీతో ‘ఎం టీవీ’ యాంకైన షెహనాజ్‌ను టాలీవుడ్ కు పరిచయం చేసిన ట్రాక్ రికార్డు ఈ బాస్ సొంతం. అటు రకుల్, లావణ్య త్రిపాఠి వంటి వాళ్లు నార్త్ వాళ్లే అయినా.. వీళ్లు మాత్రం తెలుగు సినిమాలతోనే గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం నాగార్జున.. కొత్త దర్శకుడు సాల్మన్ డైరెక్షన్‌లో ‘వైల్డ్ డాగ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ.. దియా మీర్జాతో నటిస్తున్నాడు.
ఇక బ్రహ్మాస్త్ర’ సినిమాలో ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ డింపుల్ కపాడియాకు జోడిగా నటిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి ఈ టాలీవుడ్ కింగ్ ప్రయోగాలు చేయడంతో పాటు బాలీవుడ్ భామలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండించడంలో నాగార్జున రియల్ మన్మథుడిగా పేరు గడించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.