ఇప్పుడు ఈ వార్తలు ఇండస్ట్రీలో చాలానే వినిపిస్తున్నాయి. సాధారణంగా నాగార్జున వివాదాలకు చాలా దూరంగా ఉంటాడు. ముఖ్యంగా మాటల యుద్ధానికి కూడా దూరమే. ఆయన తన సినిమాలు.. తన పనులతోనే బిజీగా ఉంటాడు. కానీ ఇప్పుడు మన్మథుడు 2 సాక్షిగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఈయనకేమైనా చెడిందా అనే వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం కూడా లేకపోలేదు. మన్మథుడు 2 ప్రీ రిలీజ్ వేడుకలో తన ఒరిజినల్ సినిమా గురించి చాలా పొగిడాడు. అంతేకాదు ఆ సినిమాకు పని చేసిన విజయ్ భాస్కర్, దేవీ శ్రీ ప్రసాద్‌లను కూడా తన వేడుకకు పిలిచాడు నాగార్జున.

మన్మథుడు 2 ఫైల్ ఫోటో
అందులో భాగంగానే తన కెరీర్లో మన్మథుడు ఎంత గొప్ప సినిమానో చెప్పాడు. అయితే మన్మథుడు సినిమా అంత బాగా రావడానికి.. అందులో పంచ్ డైలాగులు అంత బాగా పేలడానికి కారణం విజయ్ భాస్కర్ అంటూ చెప్పుకొచ్చాడు నాగ్. ఇదే ఇప్పుడు త్రివిక్రమ్ అభిమానులకు నచ్చడం లేదు. చిన్నపిల్లాడిని అడిగినా కూడా మన్మథుడు సినిమాలో త్రివిక్రమ్ పాత్ర గురించి చెప్తాడు. ఆయన డైలాగులు.. మాటలు.. స్క్రీన్ ప్లే సినిమాకు ఎంతగా హెల్ప్ అయ్యాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

నాగార్జున త్రివిక్రమ్ ఫైల్ ఫోటో
ప్రతీ డైలాగ్.. ప్రతీ పంచ్ గుర్తొచ్చినప్పుడల్లా నవ్వొచ్చేలా ఉంటాయి. కానీ ఇప్పుడు మన్మథుడు 2 ప్రీ రిలీజ్ వేడుకలో మాత్రం నాగార్జున ఆ మాటల మాంత్రికున్ని పూర్తిగా మరిచిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అది అనుకోకుండా జరిగిందా.. లేదంటే కావాలనే త్రివిక్రమ్ పేరు నాగార్జున చెప్పలేదా అనేది ఆసక్తి కలిగిస్తుంది.

మన్మథుడు 2 ఫైల్ ఫోటో (Source: Twitter)
ఇదిలా ఉంటే రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన మన్మథుడు 2పై మాత్రం అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆగస్ట్ 9న విడుదల కానుంది ఈ చిత్రం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా విజయం సాధించడం ఖాయం అంటున్నాడు నాగార్జున. ఏదేమైనా చూడాలిక.. ఈ మన్మథుడు ఆ మన్మథున్ని మరిపిస్తుందో లేదో..?
Published by:Praveen Kumar Vadla
First published:August 07, 2019, 08:40 IST