అపజయం లేకుండా ఇండస్ట్రీలో ప్రయాణం చేయడం అంటే చాలా కష్టం. చాలా తక్కువ మందికి సాధ్యం అవుతుంది అది. మైత్రి మూవీ మేకర్స్‌కు కూడా మూడు సినిమాల వరకు బాగానే పనికొచ్చింది అది. కానీ ఇప్పుడు మాత్రం కుదిరేలా కనిపించడం లేదు. ఈ సంస్థ నుంచి ఇప్పుడు వచ్చిన "సవ్యసాచి" టాక్ తేడాగా వచ్చేసింది. ఇప్పటికే తొలి రెండు రోజుల కలెక్షన్లు చూస్తుంటే సినిమా రేంజ్ అర్థమైపోతుంది. తొలిరోజు కేవలం 4 కోట్ల దగ్గరే ఆగిపోయిన "సవ్యసాచి" రెండో రోజు అంతకంటే తక్కువ తెచ్చుకున్నాడు.
దాంతో వీకెండ్ కూడా నీరుగారిపోయేలా కనిపిస్తుంది. ఇదే ఇప్పుడు దర్శక నిర్మాతలను కంగారు పెడుతున్న అంశం. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే సవ్యసాచికి ఇచ్చిన 23 కోట్ల లక్ష్యాన్ని అందుకోవడం అసాధ్యంగానే కనిపిస్తుంది. అంటే మూడు వరస విజయాలతో జోరు మీదున్న మైత్రి మూవీ మేకర్స్ జోరుకు బ్రేకులు పడినట్లే. దాంతో ఇప్పుడు వీళ్ల ఆశలన్నీ ఇప్పుడు రవితేజపైనే ఉన్నాయి. "అమర్ అక్బర్ ఆంటోనీ" సినిమాతో మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నారు ఈ నిర్మాతలు.
నవంబర్ 16న ఈ చిత్రం విడుదల కానుంది. శ్రీనువైట్ల తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో రవితేజ మూడు భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. ఇలియానా ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. ఆరేళ్ల తర్వాత తెలుగులో ఇల్లీబేబీ నటిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రం కోసం రెండు కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలిక.. "అమర్ అక్బర్ ఆంటోనీ"తో మైత్రి మూవీ మేకర్స్ మళ్లీ ఫామ్‌లోకి వస్తారో లేదో..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.