67th National Film Awards:నేషనల్ ఫిల్మ్ అవార్డు. మన దేశంలో నిజమైన సినిమా కళాకారులకు అదొక కల. సినిమాను శ్వాసగా, ధ్యాసగా బ్రతికే వాళ్లకు జాతీయ పురస్కారం అనేది గొప్ప అఛీవ్మెంట్. అటువంటి నేషనల్ అవార్డులకు...రియల్ స్టోరీలకు దగ్గర సంబంధం ఉంది. మన దగ్గర నిజ జీవితగాథల మీద తీసే సినిమాలకు మాత్రమే ఎక్కువ మటుకు ఈ జాతీయ అవార్డులు వస్తుంటయి. తాజాగా ప్రకటించిన 67వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఝాన్సీ లక్ష్మీ బాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మణికర్ణిక’ సినిమాలో నటనకు గాను కంగనా రనౌత్ ముచ్చటగా మూడోసారి జాతీయ అవార్డు అందుకుంది.
‘మణికర్ణిక’ సినిమాతో పాటు ‘పంగ’ సినిమాలోని నటనకు గాను కంగనా జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకుంది. అంతకు ముందు ‘ఫ్యాషన్’ సినిమాలోని నటనకు గాను జాతీయ స్థాయిలో ఉత్తమ సహాయనటి అవార్డు అందుకుంది ఈ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్.
అంతకు ముందు ఈ జాతీయ అవార్డుల విషయానికొస్తే.. 66వ జాతీయ అవార్డుల్లో ‘మహానటి’ సావిత్రి జీవితంపై తెరకెక్కిన ‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్‌కు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకుంది. మరోవైపు 66వ జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఉత్తమ నటుడిగా ఎంపికైన విక్కీ కౌశల్ ‘యూరీ’ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్నారు. ఈ సినిమా కూడా భారత దేశం పాకిస్థాన్ పై చేసిన సర్జికల్ స్ట్రైక్స్ ఆధారంగా తెరకెక్కించారు. ఈ రకంగా నిజ జీవిత గాథలతో తెరకెక్కిన ‘మహానటి’ ‘యూరీ ది సర్జికల్ స్ట్రైక్స్’ సినిమాలకు గాను వీళ్లిద్దరు ఉత్తమ నటీనటులుగా అవార్డులు అందుకోవడం విశేషం.
మరోవైపు నిజ జీవిత గాథలతో తెరకెక్కిన ‘ఎయిర్‌లిఫ్ట్’,‘రుస్తుం’ సినిమాలో నటనకు గాను అక్షయ్ కుమార్ మొదటిసారి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. ఎయిర్ లిఫ్ట్ విషయానికొస్తే...1990 నాటి ఇరాన్, ఇరాక్ యుద్ద నేపథ్యంలో తెరకెక్కింది. అటు రుస్తుం చిత్రం...1950, 60ల జరిగిన నేవల్ ఆఫీసర్ రుస్తుం పావ్రీ నిజ జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రం అక్షయ్ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అందుకే ఈ రెండు సినిమాలు అక్షయ్ కుమార్ ను జాతీయ ఉత్తమ నటుడ్ని చేసాయి.
ఇక జాతీయ స్థాయిలో ఉత్తమ హిందీ చిత్రంగా ఎంపికైన ‘నీర్జా’ సినిమా కూడా నీర్జా బానోత్ అనే ఎయిర్ హోస్టెస్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఈ మూవీలో నటనకు సోనమ్ కపూర్ కు జాతీయ స్థాయిలో స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. అంతకు ముందు భారత సైన్యంల పని చేసిన అథ్లెట్ పాన్ సింగ్ తోమర్ జీవితం మీద తీసిన సినిమాకు అటు జాతీయ ఉత్తమ చిత్రంతో పాటు...ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. ఒక అథ్లెటిక్ సోల్జర్...ఎందుకు బందిపోటుగా మారాడనేదే ఈ సినిమా స్టోరీ. ఈ చిత్రంలోని నటనకుగాను దివంగత ఇర్ఫాన్ ఖాన్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వరించింది.
ఇక సిల్క్ స్మిత జీవితం మీద తెరకెక్కిన ‘డర్టీ పిక్చర్’ నటనకు గాను...2011లో విద్యాబాలన్ జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కించుకుంది. అంతకు ముందు ‘గాడ్ మదర్’ ...అనే సినిమాలో నటనకు షబానా అజ్మీ జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకుంది. మన దేశంలో ఫస్ట్ ఉమెన్ డాన్ గా ఫేమసైన ‘సంతోక్ బెన్’ జిందగీనే ‘గాడ్ మదర్’ తెరకెక్కిస్తే...ఈ చిత్రంలో నటనకుగాను షబానాకు ఐదోసారి నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది.
ఇక పూలన్ దేవి జిందగీ మీద డైరెక్టర్ శేఖర్ కపూర్ తెరకెక్కించిన చిత్రం ‘బాండిట్ క్వీన్’. ఈ సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేసిన సీమా బిస్వాస్‌కు జాతీయ ఉత్తమనటి అవార్డు వచ్చింది. ఈ మూవీకి ఉత్తమనటి అవార్డుతో పాటు....జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇగ మన దేశంల ఫస్ట్ ఐపీఎస్ అధికారిణైన కిరణ్ బేడి జిందగీని బేస్ చేసుకొని...దానికి కాస్తంత కమర్షియాలిటీ జోడించి తీసిన సినిమా ‘కర్తవ్యం’. ఈ చిత్రంలో నటనకు గాను విజయశాంతికి మొదటిసారి జాతీయ ఉత్తమనటి అవార్డు వరించింది.
అటు పంజాబ్‌లో జరిగిన హింస నుంచి పిల్లలు ఏ రకంగా టెర్రరిస్టులుగా మారుతున్నారో కళ్లకు కట్టిన సినిమా ‘మాచిస్’. ఈ మూవీలో నటనకు గాను టబు మొదటిసారి జాతీయ ఉత్తమ నటి అవార్డు కైవసం చేసుకుంది. అటు దేశనాయకుల జీవితాల మీద తీసిన సినిమాలు కూడా నేషనల్ ఫిల్మ్ అవార్డులు సొంతం చేసుకున్నాయి. అజయ్ దేవగన్...భగత్ సింగ్‌గా యాక్ట్ చేసిన సినిమా ‘లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్’. 23 ఏళ్లకే భారత జాతికోసం ప్రాణత్యాగం జేసి...ప్రజల గుండెలల్లో కొలువైన భగత్ సింగ్ గా అజయ్ దేవ్ గన్ నటనగాను గాను రెండోసారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు.
అటు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ రియల్ స్టోరీతో తెరకెక్కించిన మూవీ ‘డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్’. ఈ సినిమాను నేషనల్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ వాళ్లు సొంతంగా నిర్మించారు. ఈ చిత్రంలో అంబేద్కర్ పాత్రలో యాక్ట్ చేసిన మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి...ఈ మూవీతో మరోసారి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు.
అటు రియల్ స్టోరీగా తెరకెక్కిన మరో మూవీ ‘స్వామి వివేకానంద’. ఈ చిత్రంలో వివేకానంద గురువైన రామకృష్ణ పరమహంస క్యారెక్టర్ చేసిన మిథున్ చక్రవర్తికి 1995ల జాతీయ స్థాయిల ఉత్తమ సహాయ నటుడు అవార్డు వరించింది. అటు మహాత్మ గాంధీ రియల్ లైఫ్ ను తెరకెక్కించిన మూవీ...‘ది మేకింగ్ ఆఫ్ మహాత్మ’. 1996ల రిలీజైన ఈ మూవీల గాంధీ క్యారెక్టర్ చేసిన రజిత్ కపూర్...ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. అటు ఈ సినిమా నేషనల్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా ఎంపికైంది.
ఇక రియల్ లైఫ్ బయోగ్రఫీల నుంచి తెరకెక్కిన చిత్రాలు కొన్నైతే...మన సమాజంలో కొందరి లైఫ్ స్టైల్ ను బేస్ చేసుకొని తెరకెక్కించిన చిత్రాలు మరొకొన్ని. ఆ సినిమాల విషయానికొస్తే...ముందుగా ‘ఫ్యాషన్’ సినిమా గురించి చెప్పుకోవాలి. ఈ సినిమాలో మోడల్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూపించారు. సామాజింకాంశాలను వండర్ఫుల్ గా స్క్రీన్ పై చూపించే డైరెక్టర్ మధుర్ భండార్కర్...ఈ మూవీని డైరెక్ట్ చేసాడు. ఇందుల ప్రియాంక చోప్రా నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు వరించింది. ఇక ఇదే సినిమాలో నటనకు కంగనాకు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు వరించింది.
ఇగ మధుర్ భండార్కర్ తెరకెక్కించిన మరో రియల్ స్టోరీ ‘చాందినీ బార్’. ఈ సిన్మా వివిధ కేటగిరీల 4 నేషనల్ అవార్డులను గెలుచుకుంది. ఈ సినిమాలో నటనకు టబు రెండుసారి జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకుంది. ఇక ఇదే సిన్మాల యాక్ట్ చేసిన అతుల్ కులకర్ణి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు. అటు ఈ సినిమాలో నటించిన అనన్యా ఖరే ఉత్తమ సహాయనటి అవార్డు అందుకుంది. ఇక ఈ సినిమా బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ ఇన్ సోషల్ ఇష్యూస్ గా ఎంపికవ్వడం విశేషం.
అటు చేనేత కార్మికుల జీవితం మీద తీసిన సినిమా ‘కాంచివరమ్’. చేనేత కార్మికుడిగా ప్రకాష్ రాజ్‌లో ఉన్న నటుడ్ని బైటికి తీసుకొచ్చింది ఈ సినిమా. కన్నబిడ్డ పెళ్లికి పట్టుచీర కానుకగా ఇస్తానని చెప్పి...అందుకోసం దొంగతనం చేయాల్సిన పరిస్థితి. ఇక ఈ సినిమాను బెస్ట్ ఫిల్మ్ గా జాతీయ అవార్డు గెలుచుకుంది.ఈ సినిమాలో నటనకు ప్రకాష్ రాజ్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు.
ఈ సినిమా కంటే ముందు మణిరత్నం ఒకప్పటి తమిళ సూపర్ స్టార్.. ఎంజీఆర్, తమిళ పొలిటికల్ సీనియర్ నేత కరుణానిధిల రియల్ స్టోరీని ‘ఇరువర్’ గా తెరకెక్కించారు.ఈ చిత్రంలో కరుణానిధి క్యారెక్టర్ ను చేసిన .. ప్రకాశ్ రాజ్‌కు నేషనల్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా అవార్డు గెలుచుకున్నాడు.
అటు ఇరువర్ కంటే ముందు మణిరత్నం కమల్ హాసన్ తో బాంబే అండర్ వాల్డ్ డాన్ వరదరాజన్ మొదలియార్ జీవితం మీద తీసిన సినిమా ‘నాయకుడు’. మన దగ్గర అకాడమీ అవార్డు...అదేనండి ఆస్కార్ కు మన దేశం నుంచి అఫీఫియల్ ఎంట్రీ పొందిన సినిమా ‘నాయకుడు’. ఈ సినిమాలో నటనకు కమల్ హాసన్ రెండోసారి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నాడు. ఇక సినిమాకు సిన్మాటోగ్రఫీ అందించిన పీసీ శ్రీరామ్ తో పాటు...ఆర్ట్ డైరెక్టర్ తోట తరణికి కూడా జాతీయ అవార్డులు వచ్చాయి.
తెలుగులో మొదటి పదకవితా పితామహుడుగా తాళ్లపాక అన్నమాచార్యులు జీవిత నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘అన్నమయ్య’. ఈ సినిమా రాష్ట్ర స్థాయి అవార్డులే కాదు...జాతీయ స్థాయిలో ఈ మూవీకి రెండు నేషనల్ అవార్డులొచ్చాయి. బెస్ట్ యాక్టర్ గా నాగార్జునకు స్పెషల్ జ్యూరీ అవార్డుతో పాటు...ఈ మూవీకి సంగీతం అందించిన ఎం.ఎం.కీరవాణికి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా జాతీయ అవార్డులు వచ్చాయి.
ఏమైనా మన దగ్గర కమర్షియల్ హంగులు ఎక్కువ కనిపించని సినిమాలకే నేషనల్ అవార్డులు వస్తుంటాయి. అందులో మొదటి నుంచి రియల్ స్టోరీలదే హవా. రీసెంట్గా వచ్చిన అవార్డులు చూస్తే ఆ సంగతి మరోసారి ప్రూవ్ చేసింది. ఏమైనా జాతీయ స్థాయిలో ఉత్తమ నటీనటులుగా ఎంపికవ్వుడు మాత్రం మాములు విషయం కాదనే చెప్పాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 67th National Film Awards:, Bollywood news, Kangana Ranaut, National Awards, Tollywood