Mohan Babu: పెద్ద మనసు చాటుకున్న మోహన్ బాబు.. అమరవీరుడి కుటుంబానికి అండగా..

Mohan Babu Photo : Twitter

Mohan Babu: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మరోసారి మంచి మనసును చాటుకున్నారు.

  • Share this:
    కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మరోసారి మంచి మనసును చాటుకున్నారు. జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన హవాల్దార్ సీహెచ్ ప్రవీణ్ కుమార్ అమరులైన సంగతి తెలిసిందే. ప్రవీణ్ కుమార్ చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందినవారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి గత 18 ఏళ్లుగా భారత సైన్యంలోని మద్రాస్ రెజిమెంట్‌లో పనిచేస్తున్నారు. ఆయన జమ్మూకాశ్మీర్‌లోని మాచిల్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆయన ప్రాణాలను విడిచారు. ప్రవీణ్ కుటుంబానికి రాష్ట్రం ప్రభుత్వం చేయాల్సిన సాయం చేసింది. ఇక తాజాగా నటుడు మోహన్ బాబు ఆ కుటుంబానికి సాయం చేయడానికి ముందుకు వచ్చారు. అందులో భాగంగా ప్రవీణ్‌కుమార్‌ కూతురు లోహితకు ఉచితంగా విద్యను అందించనున్నారు. ఈ విద్యా సంవత్సరం 4వ తరగతి నుంచి లోహితకు శ్రీ విద్యానికేతన్‌‌లో ఉచితవిద్య అందించనున్నట్లు మోహన్‌బాబు తెలిపారు.

    ఇక మోహన్ బాబు నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే..ఆయన ప్రస్తుతం “సన్ ఆఫ్ ఇండియా” అనే ప్యాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందింది. మోహన్ బాబు చాలా కాలం తర్వాత ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించనున్నారు. ఒక క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా వస్తున్నట్లు తెలుస్తోంది. సన్ ఆఫ్ ఇండియాకు డైమండ్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. మేస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మోహన్ బాబుతో పాటు శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో తనికెళ్ళ భరణి, ఆలీ, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, రాజా రవీంద్ర, రఘుబాబు కనిపించనున్నారు. సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published: