Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: March 15, 2020, 7:59 PM IST
రోజా, నాగబాబు(Facebook/Photos)
ఎక్కడైనా వ్యవస్థను నమ్ముకుని వ్యక్తి పని చేయాలి కానీ వ్యక్తిని నమ్ముకుని వ్యవస్థ అయితే పని చేయదు. నాగబాబు, మల్లెమాల విషయంలో కూడా ఇదే జరిగింది. సంస్థ నచ్చలేదు ఆయన మారిపోయాడు. కానీ నాగబాబు వెళ్లినంత మాత్రానా రేటింగ్స్ పడిపోతాయా అంటే మాత్రం లేదనే సమాధానమే వస్తుంది. కచ్చితంగా నాగబాబు వెళ్లిన తర్వాత జబర్దస్త్ కామెడీ షో కొన్ని వారాలు ఇబ్బంది పడిన మాట వాస్తవమే అయినా కూడా చాలా త్వరగా పుంజుకుంది. ఇప్పుడు కూడా రేటింగ్స్ అద్భుతంగా వస్తున్నాయి. నాగబాబు వెళ్లిపోయిన తర్వాత కూడా టిఆర్పీ రేటింగ్స్‌లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఎంత కాదనుకున్నా నాగబాబుకు, జబర్దస్త్ కామెడీ షోకు విడదీయరాని అనుబంధం ఉంది.

జబర్దస్త్ కామెడీ షో (jabardasth Comedy show)
అసలు ఈయన కెరీర్ మళ్లీ రెక్కలు తొడిగిందే ఈ కామెడీ షో నుంచి. అప్పట్లో ఆరెంజ్ సినిమా తర్వాత నాగబాబు కెరీర్ పూర్తిగా డైలమాలో పడిపోయింది. ఓ సమయంలో అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకుందామనుకున్నాడు నాగబాబు. అలాంటి సమయంలో ఈయన కెరీర్‌కు మళ్లీ ఊపిరి ఊదింది జబర్దస్త్ కామెడీ షో. అలాంటి షోను వదిలేసి వెళ్లిపోయాడు ఈయన. మంచి పారితోషికం వచ్చినపుడు తప్పేం లేదనే వాళ్లు కూడా ఉన్నారు. కానీ లైఫ్ ఇచ్చిన షోను వదిలి వెళ్లే ముందు ఓసారి ఆలోచించుకుని ఉంటే బాగుండేదని నాగబాబుకు సలహాలు కూడా ఇచ్చారు. కానీ ఆయన మాత్రం కాదనుకుని వెళ్లిపోయాడు. వెళ్లిన తర్వాత కూడా జబర్దస్త్ అలాగే ఉంది కానీ ఆయన వెళ్లిన షో మాత్రం అంతగా సత్తా చూపించడం లేదనే వార్తలు వస్తున్నాయి.

జబర్దస్త్ కామెడీ షో... (Jabardasth Nagababu)
అదిరింది అంటూ జీ తెలుగులో మరో షో మొదలుపెట్టాడు. అయితే జబర్దస్త్ కామెడీ షోకు పోటీగా వచ్చినా కూడా ఇప్పటి వరకు అది ప్రభావం చూపించింది మాత్రం తక్కువే. మరోవైపు నాగబాబు లేకపోయినా కూడా జబర్దస్త్ మాత్రం దుమ్ము దులిపేస్తూనే ఉంది. రేటింగ్స్‌లో టాప్‌లోనే ఉంది ఈ షో. దానికితోడు అదిరింది షోకు రేటింగ్స్ ఊహించినంతగా రావడం లేదనే ప్రచారం జరుగుతుంది. ఓ కొత్త కార్యక్రమం పరంగా చూసుకుంటే మాత్రం దీనికి మంచి రేటింగ్స్ వస్తున్నా కూడా ఊహించినంత మాత్రం రావడం లేదు. దీనిపై జీ సంస్థ కూడా తర్జనభర్జన పడుతుంది. టీమ్స్ బాగానే ఉన్నా కూడా ఎక్కడో రేటింగ్స్ విషయంలో మాత్రం తేడా కొడుతుంది. ఈ సమయంలో జబర్దస్త్ వైపు నాగబాబు ఆలోచించినా కూడా మల్లెమాల మాత్రం నో ఎంట్రీ బోర్డ్ పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది.

జబర్దస్త్ కామెడీ షో... (Jabardasth Nagababu)
దానికి కారణం కూడా లేకపోలేదు.. వెళ్లేప్పుడు మామూలుగా వెళ్లిపోయుంటే అసలు సమస్యే ఉండేది కాదు కానీ మల్లెమాలపై చాలా విమర్శలు చేసాడు నాగబాబు. ఏడేళ్లుగా జబర్దస్త్ కమెడియన్లకు చాలా అన్యాయం చేసారన్నట్లుగా మాట్లాడాడు ఈయన. అంతేకాదు కమెడియన్లు ఏమైపోయినా కూడా కేవలం లాభాలు మాత్రమే చూసుకున్నారంటూ మల్లెమాల నిర్మాణ సంస్థపై సంచలన వ్యాఖ్యలు చేసాడు మెగా బ్రదర్. దాంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలే రీ ఎంట్రీకి అడ్డుగా మారుతున్నాయని తెలుస్తుంది. మళ్లీ జబర్దస్త్‌కు రావాలనుకుంటున్నా కూడా నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాత్రం ఆయన ఎంట్రీకి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది. ఏదేమైనా కూడా నాగబాబు ఉన్నా లేకపోయినా జబర్దస్త్ మాత్రం అలాగే ఉంది. అదిరింది మాత్రం అంతగా అదరడం లేదు.
Published by:
Praveen Kumar Vadla
First published:
March 15, 2020, 7:59 PM IST