టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. ఆయన తీసినవి నాలుగైదు సినిమాలే అయినా.. అంతకుమించిన వివాదాల్లో ఇప్పుడు అతడు చిక్కుకున్నాడు. ఇందుకు అతడు ఇటీవలే చేసిన ఓ ప్రాంక్ వీడియోనే కారణం. విశ్వక్ సేన్ ఇటీవలే నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విశ్వక్ సేన్, ఆయన టీం చేసిన ప్రాంక్ వీడియోపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే అంశంపై ఓ టీవీ ఛానెల్‌లో జరిగిన డిబెట్‌లో విశ్వక్ సేన్, సదరు యాంకర్ దేవీ నాగవల్లి మధ్య వాడివాడి చర్చ జరిగింది. స్టూడియో నుంచి 'గెట్ అవుట్' అంటూ యాంకర్ గట్టిగా అరవడం, దానికి విశ్వక్ సేన్ అభ్యంతరకర.. పదంతో దూషించడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
దీనిపై మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. విశ్వక్ సేన్‌పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చానళ్లు విశ్వక్ సేన్ హీరోగా గుర్తిస్తున్నారో లేదో తమకు తెలియదన్నారు. కానీ, మేం మాత్రం అతడిని హీరోగా గుర్తించడం లేదన్నారు ఎమ్మెల్యే దానం. లైవ్‌లో ఇలాంటి అసభ్యకర పదాలు వాడటం సరికాదన్నారు. దేవి నాగవళ్లికి యాంకర్‌గానే కాదు, బయట సమాజంలో కూడా మంచి పేరు ఉందన్నారు దానం. అలాంటి యాంకర్‌ను పట్టుకుని అతడు అలా అనడం తప్పన్నారు ఎమ్మెల్యే.
మీడియాలో మాట్లాడాల్సిన సమయంలో అనేక ప్రశ్నలు ఎదురవుతుంటాయి. వాటికి జవాబు చెప్పే సత్తా ఉన్నప్పుడు మాత్రమే మీడియా ముందుకు రావాలన్నారు. లేకపోతే సైలెంట్‌గా ఉండాలని సూచించారు దానం నాగేందర్. స్టూడియోలో విశ్వక్ సేన్ మాట్లాడిన మాటల మీద పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే దానం డిమాండ్ చేశారు. లేదంటే మహిళా సంఘాలతో తామే కేసు పెట్టిస్తామని హెచ్చరించారు. అతను ఆ మాట అనగానే అదే వేదికపై యాంకర్ చెప్పుతో కొట్టేది ఉండే అని దానం కీలక వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు తెలంగాణ సినిమాటోగ్రాఫ్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా విశ్వక్ సేన్ వ్యవహారంపై స్పందించారు. విష్వక్‌సేన్ టీవీ చర్చాకార్యక్రమంలో వాడిన అభ్యంతరకర భాషపై దేవి నాగవళ్లి మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌కు మంగళవారం ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'రోడ్డుపై ఇష్టమొచ్చినట్టు చేస్తా, ప్రశ్నించినవారిని ఇష్టమొచ్చినట్లు దూషిస్తానంటే కుదరదు. విష్వక్‌సేన్ ప్రవర్తన, ఆయన సారీ చెప్పిన విధానం రెండూ బాగాలేవన్నారు తలసాని. కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయాన్ని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్తాం' అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Devi nagavalli, Minister talasani srinivas, TV9, Vishwak Sen