అవును.. ఇప్పుడు నిజంగానే ఇదే జరగబోతుంది. అన్నీ అనుకున్నట్లు కానీ జరిగితే సాయి ధరమ్ తేజ్‌కు చిరంజీవి నుంచి షాక్ తప్పదు. ప్రస్తుతం సైరా సినిమాతో బిజీగా ఉన్నాడు మెగాస్టార్. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. మరో నెల రోజుల్లోనే దీనికి గుమ్మడి కాయ్ కొట్టేయాలని చూస్తున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. దాదాపు 200 కోట్లతో రామ్ చరణ్ నిర్మిస్తున్న సినిమా ఇది. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీపై మాత్రం ఇంకా సస్పెన్స్ వీడటం లేదు.
సైరా 2019లోనే వస్తుందని నిర్మాతలు చెబుతున్నా.. 2020 సంక్రాంతికి వాయిదా పడిందేమో అనే అనుమానాలు కూడా అభిమానుల్లో కలుగుతున్నాయి. ఇదే ఇప్పుడు సాయి ధరమ్ తేజ్‌ను టెన్షన్ పెడుతున్న అంశం. ఈయన చిత్రలహరి సినిమా విజయంతో జోష్ మీదున్నాడు. ఈ చిత్రం తర్వాత ఇప్పుడు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. గీతా ఆర్ట్స్ 2 నిర్మించబోయే ఈ చిత్రం ఎమోషనల్ ఎంటర్ టైనర్‌గా రానుంది. తొలిసారి మారుతి పూర్తిగా సీరియస్ సినిమా చేయబోతున్నాడు.
ఈ సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అందుకే భోగి అనే టైటిల్ అనుకుంటున్నారు. అయితే చిరంజీవి కానీ సంక్రాంతికి వచ్చాడంటే మరో ఆప్షన్ కూడా లేకుండా సాయి సైడ్ ఇవ్వాల్సిందే. దాంతో సైరా విడుదల తేదీపైనే ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ భోగి సినిమా కూడా ఆధారపడి ఉంది. ఒకవేళ సంక్రాంతికి సాయి సినిమా రాకపోతే దానికి ప్రతీరోజు పండగే అనే టైటిల్ పరిశీలిస్తున్నాడు మారుతి. ఏదేమైనా కూడా ఇప్పుడు మెగాస్టార్ సినిమాపైనే మెగా మేనల్లుడి సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Sai Dharam Tej, Telugu Cinema, Tollywood