చిరంజీవి పైకి కనిపించడు కానీ చాలా అంటే చాలా రొమాంటిక్. అది సోషల్ మీడియాలో ఆయన పెట్టే పోస్టులతోనే అర్థమైపోతుంది. ఒక్కోసారి ఆయన చేసే కామెంట్స్ చూస్తే నిజంగానే చిరు వయసు 65 ఏళ్లు ఉంటుందా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన వయసు పెరిగినా మనసు మాత్రం 20ల్లోనే ఆగిపోయింది. అంత చిలిపిగా ఉంటాడు చిరంజీవి. అంతేకాదు భార్య సురేఖతో ఉన్నపుడు చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తుంటాడు. తనపై తానే జోకులు కూడా వేసుకుంటాడు మెగాస్టార్. అంత సరదాగా ఉంటాడు ఈయన. ఇప్పుడు కూడా సమంత అక్కినేని స్యామ్ జామ్ షోకు వచ్చిన చిరు అక్కడ చాలా విషయాల గురించి చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా తన భార్యతో జరిగిన ఓ సరదా సంఘటన గురించి గుర్తు చేసుకున్నాడు ఈయన. తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో జరిగిన సంఘటన పంచుకున్నాడు. అప్పుడు ఈయనకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. అసలు విషయం ఏంటంటే.. మీ కెరీర్‌లో మిమ్మల్ని బాగా ఏడిపించిన సినిమా ఏదైనా ఉందా అని సమంత అడిగింది. దానికి వెంటనే ఉందని చెప్పాడు చిరు. తాను బాగా ఏడ్చేసిన సినిమా శంకరాభరణం అని.. సినిమా క్లైమాక్స్‌కు వచ్చేసరికి తెలియకుండానే కళ్ల నిండా నీళ్లు కారిపోతున్నాయని చెప్పాడు.
ఆ సినిమాలో నటించిన హీరోయిన్ మంజు భార్గవి అంతకుముందు తనతో కోతలరాయుడు సినిమాలో నటించిందని.. ఆ పరిచయంతోనే శంకరాభరణం ప్రీమియర్ షోకు తనను కూడా పిలిచారని చెప్పాడు చిరు. అప్పటికి విశ్వనాథ్, ఏడిద నాగేశ్వరరావు లాంటి వాళ్లతో తనకు పరిచయం లేదని చెప్పుకొచ్చాడు చిరు. అలాంటి సమయంలో సినిమా చూస్తున్నపుడే ఎమోషనల్‌గా ఫీల్ అయిపోయానని.. చివర్లోకి వచ్చేసరికి ఏడ్చేసానని చెప్పాడు చిరంజీవి. అయితే ఎవరైనా చూస్తే బాగోదని అటూ ఇటూ చూస్తుంటే మంజు భార్గవి తన పైట కొంగు అందించిందని.. అలా తుడుచుకుంటుంటే వెంటనే లైట్స్ ఆన్ చేసారని చెప్పాడు చిరు.
దాంతో అంతా తననే చూసారని.. ఆ హీరోయిన్ పైట తన చేతిలో ఉన్నపుడు లైట్స్ ఆన్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి అంటూ నవ్వేసాడు చిరు. అక్కడికి అల్లు రామలింగయ్య ఫ్యామిలీ కూడా వచ్చారని.. సురేఖ కూడా వచ్చుంటుందని చెప్పాడు. అప్పుడు తనను అలా చూసిన రెండు మూడు నెలలకు పెళ్లి సెట్ చేసారని.. తనను అలా చూసింది కాబట్టి కచ్చితంగా నో చెప్తుందనే అనుకున్నానని చెప్పాడు చిరు. కానీ ఎస్ చెప్పడంతో పెళ్లైపోయిందని నవ్వుకుంటూ చెప్పుకొచ్చాడు మెగాస్టార్. ఏదేమైనా కూడా నాటి సంఘటనను గుర్తు చేసుకుని సరదాగా అందర్నీ నవ్వించాడు మెగాస్టార్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Chiranjeevi Wife Surekha, Telugu Cinema, Tollywood