తమన్నా గ్రేట్... నయనతార మీద పరోక్షంగా మెగాస్టార్ పంచ్‌లు..

సైరా పోస్టర్ Twitter

Sye Raa | సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరంజీవి పక్కన మెయిన్ హీరోయిన్‌గా నయనతార నటించింది.

  • Share this:
    సైరా నరసింహారెడ్డి కన్నడ వెర్షన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తమన్నాను పొగడ్తల్లో ముంచెత్తడం ద్వారా పరోక్షంగా నయనతార మీద అసంతృప్తిని బయటపెట్టారు. బెంగళూరులో సైరా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో చిరంజీవి మాట్లాడుతూ.. ‘తమన్నా అద్భుతంగా నటించింది. గ్లామర్‌గానే కాదు. ఎమోషనల్‌గా ఎంతో నటన చూపింది. విసుగు లేకుండా చేసింది. ఎన్ని రోజులు కాల్షీట్ అడిగితే అన్ని రోజులు ఇచ్చింది. సినిమా మీద, మా మీద ప్రేమ, అభిమానం చూపింది. లక్ష్మి క్యారెక్టర్ కోసం ఎంతో శ్రమించింది. తమన్నా ప్రమోషన్స్‌కి వస్తుందా? రాదా? అని డౌట్ ఉంది. సినిమా అయిపోయాక వారి బాధ్యత తీరిపోతుంది. కానీ, తమన్నా ప్రమోషన్స్‌లో కూడా ఎంతో సహకరించింది. ముంబై, చెన్నై, కొచ్చిన్, బెంగళూరు. ఇలా ప్రతిచోటకు వచ్చింది. ఇంతగా రావాల్సిన అవసరం లేదు. ఈ సినిమాను తన సొంత సినిమాగా భావించింది.’ అని చిరంజీవి తమన్నా మీద పొగడ్తల జల్లు కురిపించారు.

    అయితే, నయనతార గురించి కేవలం ఒకే ఒక్క మాట చెప్పారు చిరంజీవి. ఈ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భార్యగా అద్భుతంగా నటించిందన్నారు. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్‌లో నయనతార ఎక్కడా కనిపించలేదు. హైదరాబాద్, చెన్నై, కొచ్చిన్... ఎక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగినా కూడా నయనతార రాలేదు. మెగాస్టార్ సినిమాకు కూడా నయనతార ఇలా చేయడం మెగా అభిమానులను అసంతృప్తికి గురిచేసిందనే వాదన ఉంది. తొలుత హైదరాబాద్‌లో జరిగే ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు నయన్ వస్తుందని ప్రచారం జరిగింది. కానీ, అక్కడ కనిపించలేదు. దీంతో నయనతార మీద మెగాస్టార్, మెగా పవర్ స్టార్ ఇద్దరూ అసంతృప్తితో ఉన్నట్టు టాలీవుడ్‌లో వార్తలు వచ్చాయి.
    First published: