నిజమే.. ఇప్పుడు మేనల్లుడికి మెగాస్టార్ సాయం చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు గైడెన్స్ లేకే సాయిధరమ్ తేజ్ సినిమాలు ఇలా వరసగా పోతున్నాయనే వాదన కూడా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. మెగా కుటుంబం కూడా సాయిని పట్టించుకోవడం లేదని.. కథల ఎంపిక రాకే పాపం ఆ కుర్ర హీరో అలా ఫ్లాప్ సినిమాలు ఇస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. దానికితోడు సాయిధరమ్ తేజ్‌కు ఉన్న ఇమేజ్ వాడుకోడానికి చాలా మంది దర్శకులు చెత్త కథలను కూడా చెప్పి ఒప్పిస్తున్నారనే టాక్ ఉంది ఇండస్ట్రీలో. అందుకే మేనల్లుడే వెళ్లి స్వయంగా మావయ్యను తన సినిమా విషయంలో సాయం కోరాడని తెలుస్తుంది.
అందుకే చిరంజీవి కూడా సైరాతో బిజీగా ఉన్నా కూడా చిత్రలహరి సినిమా కథ విషయంలో తనదైన సూచనలు ఇచ్చాడని తెలుస్తుంది. వరసగా ఆరు ఫ్లాపులు వచ్చిన హీరోకు ఆఫర్లు రావడమే ఎక్కువ. అది చిన్న హీరో అయితే ప్రేక్షకులు పూర్తిగా మరిచిపోతారు కూడా. కానీ సాయిధరమ్ తేజ్ విషయంలో మాత్రం మరోలా జరుగుతుంది. ఈయన ఇప్పటికీ క్రేజీ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం "చిత్రలహరి" సినిమాపైనే ఈ హీరో కెరీర్ ఆధారపడి ఉంది. కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ సగానికి పైగా పూర్తైంది. చిత్రయూనిట్ సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు ఎప్రిల్ 12న సినిమా విడుదల అవుతుందని ప్రకటించారు.
ఈ చిత్రం కోసం పూర్తిగా లుక్ మార్చేసాడు సాయిధరమ్ తేజ్. అసలు మనం ఇదివరకు చూసిన సాయినేనా ఇప్పుడు చూస్తుంది అనిపించక మానదు. పక్కా కామెడీ ఎంటర్టైనర్గా "చిత్రలహరి" తెరకెక్కనుంది. ఆరు ఫ్లాపుల తర్వాత సాయి చాలా జాగ్రత్త పడి ఎంచుకున్న స్క్రిప్ట్ ఇది. పైగా చిరంజీవి సాయంతో పాటు ఆశీస్సులు కూడా ఉన్నాయి. దాంతో ఈ చిత్రంతో కచ్చితంగా తాను ఫామ్‌లోకి వస్తానంటున్నాడు సాయిధరమ్ తేజ్. ఈ చిత్రంలో సునీల్ కీలకపాత్రలో నటించనున్నాడు. ఈయన ఫుల్ లెంత్ రోల్ చేస్తున్నాడు.
ఇక "బార్ అండ్ రెస్టారెంట్" అనేది దీనికి ట్యాగ్ లైన్. ఇందులో నివేదా పేతురాజ్ మరో హీరోయిన్. మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ చిత్రంతో మళ్లీ హిట్ కొట్టాలని చూస్తున్నారు. వరస విజయాలతో జోరు మీదున్న ఈ సంస్థకు సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంటోనీ రూపంలో భారీ దెబ్బలు తగిలాయి. సాయి సినిమాకు తొలిసారి దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు. మొత్తానికి ఈ "చిత్రలహరి" అయినా సాయిధరమ్ తేజ్ వరస ఫ్లాపులకు బ్రేక్ వేస్తుందో లేదో..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Sai Dharam Tej, Sunil, Telugu Cinema