ఇప్పుడు నిజంగానే తెలుగు ఇండస్ట్రీకి పెద్దన్నలా మారిపోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఎవరికి ఏ కష్టం వచ్చినా.. ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా కాదనకుండా వస్తున్నాడు.. తనవంతు సాయం చేస్తున్నాడు. అంతేకాదు ఇండస్ట్రీ బాగోగులు చర్చించడానికి అందరికంటే ముందు చిరు వస్తున్నాడు. తాజాగా కేసీఆర్‌తో చర్చించిన చిరు.. జగన్‌తోనూ భేటీ కానున్నాడు. కరోనా బాధితుల కోసం త్వరలోనే ఇండస్ట్రీ తరుఫు నుంచి ఓ భారీ కార్యక్రమం చేయాలని తలపిస్తున్నాడు చిరంజీవి. దీనికి అందరి నుంచి కూడా సపోర్ట్ ఉంటుందని ఒక్కడే మాటిచ్చేసాడు. దీన్నిబట్టి చిరుకు ఇండస్ట్రీలో ఎలాంటి గౌరవం ఉందో అర్థమైపోతుంది.
ఆయన చెబితే అంతే.. ఇండస్ట్రీలో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరితో ఆయన వ్యవహరిస్తున్నాడని కొన్ని రోజులుగా ప్రశంసలు వస్తూనే ఉన్నాయి. చిరంజీవి తీరు చూస్తుంటే ఈయన నిజంగానే మరో దాసరి అవుతాడేమో అనిపిస్తుంది. దాసరి నారాయణరావు ఉన్నపుడు చిన్నా పెద్ద తేడా లేకుండా అందరి సినిమాలకు వచ్చేవాడు. పవన్ కళ్యాణ్ సినిమా ఆడియోకు వచ్చి ఆశీర్వాదం ఇచ్చేవాడు.. అలాగే రాజ్ తరుణ్ సినిమాకు కూడా వచ్చేవాడు దర్శకరత్న. ఆయన పోయిన తర్వాత చిన్న సినిమాలకు పెద్దదిక్కు లేకుండా పోయింది. అయితే ఇప్పుడు దాసరి లేని లోటు తీర్చడానికి చిరంజీవి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఆయన మనసులో ఆలోచన ఉందో లేదో తెలియదు కానీ ఇండస్ట్రీలో మాత్రం అంతా నువ్వే మా పెద్దదిక్కు అంటున్నారు. చిరంజీవి కూడా అలాగే ఫిక్సైపోతున్నాడిప్పుడు. మెగాస్టార్ కూడా ఈ మధ్య చిన్న సినిమాల ఆడియో వేడుకులకు వస్తున్నాడు. ఈ మధ్య వరసగా ఎక్కడ చూసినా చిరంజీవి ఎక్కువగా కనిపిస్తున్నాడు. మొన్నామధ్య ఆచార్య సినిమా టైటిల్ నోరు జారింది కూడా బ్రహ్మాజీ తనయుడు సంజయ్ హీరోగా నటించిన ఓ పిట్ట కథ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలోనే. అక్కడ చాలా సేపు మాట్లాడటమే కాకుండా.. చిన్న సినిమాలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని మాటిచ్చాడు.
ఈ మధ్యే తన నివాసంలోనే మంత్రి తలసానితో ఇండస్ట్రీ గురించి మాట్లాడాడు. చిరంజీవి పిలిస్తే ఈ రోజు ఇండస్ట్రీ అంతా కదులుతుంది. ఆయనేం చెబితే అదే అంటుంది. అన్నయ్యే మాకన్నీ అంటున్నారు వాళ్లు కూడా. చిరంజీవి కూడా చిన్న సినిమాలపై దృష్టి పెడుతున్నాడు. చిన్న పెద్దా తేడా లేకుండా అంతా కష్టపడాలి అంటూ పిలుపునిచ్చాడు మెగాస్టార్. ఎక్కడ చూసినా కూడా ఈ మధ్య చిరంజీవి కనిపిస్తున్నాడు. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు.. కొత్త వాళ్ల నుంచి పక్క ఇండస్ట్రీల వరకు ఎవరు పిలిచినా కూడా కాదనకుండా వెళ్లి తన పెద్దరికం చూపిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి.
ఇండస్ట్రీలో కూడా చాలా మంది చిన్న నిర్మాతలు ఇప్పుడు తమ సినిమాలకు చిరును ఆహ్వానిస్తున్నారు. అంత స్వేఛ్చ అప్పట్లో దాసరి బతికున్నపుడు ఉండేది. ఆయన అన్ని సినిమాలకు వచ్చి తన ఆశీర్వాదాలు ఇచ్చేవాడు. ఇప్పుడు చిరంజీవి ఇదే చేస్తున్నాడు. ఈయన రావడం వల్లే కొన్ని సినిమాలు వస్తున్నాయని తెలుస్తుంది. మొత్తానికి చిరు ఇప్పుడు దాసరి స్థానంలోకి వస్తున్నాడన్నమాట.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Talasani Srinivas Yadav, Telugu Cinema, Tollywood