రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరస సినిమాలు చేస్తూ రెచ్చిపోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఖైదీ నెం 150 తర్వాత సైరాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఇప్పుడు మరో రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే చాలా మంది దర్శకులు చెప్పిన కథలు విన్న చిరు.. తాజాగా ఓ కుర్ర దర్శకుడికి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు చిరంజీవి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తయింది. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ కొన్ని రోజులు ఆపేసారు.
మార్చ్ 31 తర్వాత పరిస్థితులు చూసి మళ్లీ మొదలు పెట్టాలని చూస్తున్నాడు చిరు. ఈ లోపు నెక్ట్స్ సినిమాల కోసం కథలు వినే పనిలో బిజీగా ఉన్నాడు చిరంజీవి. ఈ క్రమంలోనే కుర్ర దర్శకుడు బాబీ చెప్పిన కథ ఈయనకు బాగా నచ్చిందని తెలుస్తుంది. ఈ మధ్యే వెంకీ మామ సినిమాతో పర్లేదనిపించిన ఈ దర్శకుడు చిరు కోసం ఓ పవర్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న కథను ఒకటి సిద్ధం చేసాడని తెలుస్తుంది. ఇది విన్న వెంటనే మెగాస్టార్ కూడా ఫిదా అయిపోయాడని.. వెంటనే బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేయాల్సిందిగా కోరాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతుంది. బాబీ గతంలో పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను తెరకెక్కించాడు. అప్పుడు ఆయన పనితనానికి చిరు కూడా ఫిదా అయిపోయాడు. ఆ పరిచయంతోనే ఇప్పుడు కథ నెరేట్ చేసినట్లు తెలుస్తుంది. పైగా జై లవకుశలో ఎన్టీఆర్‌ను ఆయన హ్యాండిల్ చేసిన తీరు చూసి స్టార్స్‌ను బ్యాలెన్స్ చేస్తాడని నమ్మి.. బాబీకి చిరు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. అన్నీ కుదిర్తే కొరటాల శివ తర్వాత బాబీతోనే మైత్రి మూవీ మేకర్స్‌లో చిరు సినిమా చేయడం ఖాయంగా కనిపిస్తుంది. మరి చూడాలిక.. ఈ కాంబినేషన్ వర్కవుట్ అయితే మాత్రం బాబీ పంట పండినట్లే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Telugu Cinema, Tollywood